
ఏకేయూ పీజీ ఫలితాలు విడుదల
ఒంగోలు సిటీ: ఆంధ్రకేసరి యూనివర్సిటీ పరిధిలోని పీజీ కళాశాలల్లో 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి మూడో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను ఏకేయూ వైస్ చాన్సిలర్ ప్రొఫెసర్ డి.వి.ఆర్.మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు గురువారం సాయంత్రం విడుదల చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 1037 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, వారిలో 929 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. వారిలో 770 మంది విద్యార్థులు 82.8 శాతం మేరకు ఉత్తీర్ణత సాధించినట్లు ఆంధ్రకేసరి యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హరిబాబు తెలిపారు. ఈ ఫలితాలలో హిస్టరీ, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ తదితర విభాగాలలో పరీక్షలు రాసిన విద్యార్థులు నూరు శాతం పాసయ్యారని చెప్పారు. యూనివర్సిటీ స్థాయిలో, ఆయా కళాశాలల స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఏకేయూ ఉప కులపతి ప్రొఫెసర్ డి.వి.ఆర్.మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు, సీఈ ప్రొఫెసర్ జి.సోమశేఖర, ఏసీఈ డాక్టర్ ఏ భారతీదేవి తదితరులు అభినందించారు. కార్యక్రమంలో పీజీ కో ఆర్డినేటర్ (నాన్ కాన్ఫిడెన్షియల్) డాక్టర్ ఆర్.శ్రీనివాస్, ఏసీఈ సహాయకులు డాక్టర్ ఎన్.సురేష్, పరీక్షల విభాగం పర్యవేక్షకుడు సూడా శివరామ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.