
క్రీడాకారులతో కూటమి చెడుగుడు!
స్పోర్ట్స్ స్కూళ్లలో అడ్మిషన్లు నిలిపేసిన రాష్ట్ర ప్రభుత్వం
క్రీడా కుసుమాలను వెలికితీయాలంటే క్షేత్ర స్థాయిలో యువతను ప్రోత్సహించాలి. మట్టిలో
మాణిక్యాలకు తగిన శిక్షణ ఇచ్చి క్రీడా నైపుణ్యాన్ని మెరుగుపరచాలి. ఇదే ఉద్దేశంతో గత
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గిరిజన విద్యార్థుల కోసం స్పోర్ట్స్ స్కూళ్లను ఏర్పాటు చేసింది.
విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న క్రీడల్లో రాణించేలా తీర్చిదిద్దేందుకు కోచ్‌లను నియమించింది. అయితే కూటమి ప్రభుత్వం గద్దెనెక్కగానే గిరిజన విద్యార్థుల క్రీడావకాశాలపై దెబ్బకొట్టింది. స్పోర్ట్స్ స్కూళ్లలో అడ్మిషన్లు సైతం నిలిపేసి భావి క్రీడాకారుల జీవితాలతో చెడుగుడు ఆడుకుంటోంది.
యర్రగొండపాలెం: గిరిజన విద్యార్థుల్లో దాగిఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచే విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అరకులో ఉన్న ఏపీటీడబ్ల్యూఆర్ స్పోర్ట్స్ స్కూల్‌కు అనుబంధంగా రాష్ట్రంలో ఆరు క్రీడా పాఠశాలకు శ్రీకారం చుట్టారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట(బాలురు), భద్రగిరి(బాలికలు), తూర్పు గోదావరి జిల్లాలోని ముసురుమిల్లి(బాలురు), ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం(పీటీజీ–బాలురు), నంద్యాల జిల్లాలోని మహానంది(బాలికలు), అనంతపురం జిల్లాలోని గొల్లలదొడ్డి(బాలురు)లో 6 స్పోర్ట్స్ సూళ్లను ప్రారంభించారు. ఆయా పాఠశాలల్లో 720 మంది విద్యార్థినీ, విద్యార్థులు ఆటల పోటీల్లో ప్రతిభాపాఠవాలు ప్రదర్శించే అవకాశం కల్పించారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు సంయుక్తంగా నిర్వహించే ఈ స్పోర్ట్స్ సూళ్లను 2022లో ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఒక్కో ఈవెంట్‌కు ఒకరు చొప్పున 23 మంది కోచ్‌లను నియమించారు. దీంతో గిరిజన విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్న పాఠశాలల్లో చేరి నైపుణ్యాన్ని పెంపొందించుకున్నారు. అనేక మంది విద్యార్థులు జిల్లా స్థాయితో పాటు అంతర్జాతీయ స్థాయి వరకు ఈ స్పోర్ట్స్ స్కూల్స్ ద్వారా ఎదగ గలిగారు.
క్రీడా పాఠశాలల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులకు గత ప్రభుత్వంలో ప్రత్యేక పరీక్షలు నిర్వహించి అడ్మిషన్లు ఇచ్చేవారు. గిరిజనుల పిల్లలు క్రీడా ప్రతిభను కనబరిచేందుకు వేదికలుగా ఉన్న ఈ పాఠశాలలపై కూటమి ప్రభుత్వం కన్నెర్రజేసింది. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 14 నెలలు కావస్తున్నప్పటికీ సోర్ట్స్ స్కూళ్లలో ఒక్క గిరిజన విద్యార్థికీ అడ్మిషన్ ఇచ్చిన పాపానపోలేదు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే గిరిజన విద్యార్థులను కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందనిపిస్తోదని వైపాలేనికి చెందిన గిరిజన నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. 6 స్పోర్ట్స్ స్కూళ్లలో కోచ్‌లు ఉన్నప్పటికీ విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వకపోవడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. స్పోర్ట్స్ స్కూళ్లలో అడ్మిషన్లు లేకపోవడం వల్ల గిరిజన విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన పిల్లలు క్రీడల్లో ఎదగకుండా ఈ ప్రభుత్వం ఎందుకు ఆటంకం కలిగిస్తోందో అర్థం కావడం లేదని, తమ పిల్లలను ఉన్నత స్థాయిలో చూసుకునే అవకాశం కల్పించకపోవడం శోచనీయమని వారు అంటున్నారు. వెంటనే రాష్ట్రంలో ఉన్న 6 స్పోర్ట్స్ స్కూళ్లలో గిరిజన విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
క్రీడల్లో గిరిజన విద్యార్థులు ప్రతిభ
కనబరచకుండా సర్కారు అడ్డుపుల్ల
అగమ్యగోచరంగా రాష్ట్రంలోని 6 స్పోర్ట్స్ స్కూళ్ల పరిస్థితి
తమ పిల్లలను చిన్నచూపు చూడటం తగదని గిరిజన సంఘ నేతల మండిపాటు
వివిధ క్రీడాంశాలకు సంబంధించిన పాఠశాలలు
పాఠశాల క్రీడలు
సీతంపేట(బాలురు), పార్వతీపురం మన్యం ఆర్చరీ, అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, వాలీబాల్
భద్రగిరి(బాలికలు), పార్వతీపురం మన్యం అథ్లెటిక్స్, హాకీ, జూడో, వెయిట్‌లిఫ్టింగ్
ముసురుమిల్లి(బాలురు), తూర్పుగోదావరి ఆర్చరీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, ఫుట్‌బాల్
యర్రగొండపాలెం(బాలురు), ప్రకాశం ఆర్చరీ, అథ్లెటిక్స్, హాకీ, వాలీబాల్
మహానంది(బాలికలు), నంద్యాల ఆర్చరీ, అథ్లెటిక్స్, టేబుల్ టెన్నిస్
గొల్లలదొడ్డి(బాలురు), అనంతపురం అథ్లెటిక్స్, బాక్సింగ్, ఫుట్‌బాల్, వెయిట్‌లిఫ్టింగ్

క్రీడాకారులతో కూటమి చెడుగుడు!