
ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి
ఒంగోలు సబర్బన్: లో గ్రేడ్ పొగాకు కొనుగోలుకు ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రభుత్వ రంగ సంస్థలచే కొనుగోలు చేసేందుకు చొరవ చూపాలని పలువురు రైతు సంఘ నేతలు డిమాండ్ చేశారు. గురువారం ఒంగోలులోని పొగాకు బోర్డ్ ఆర్‌ఎం కార్యాలయం వద్ద ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. లో గ్రేడ్ పొగాకు కొనుగోలుకు రూ.1000 కోట్లు కేటాయించాలని, క్వింటా రూ.20 వేలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు జూజ్జూరు జయంతిబాబు అధ్యక్షతన జరిగిన ధర్నాలో సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పమిడి వెంకటరావు మాట్లాడుతూ ఈ ఏడాది వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా వర్జీనియా పొగాకు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందన్నారు. కంపెనీలు, బోర్డు సూచనలకు అనుగుణంగా సాగు చేసిన రైతుకు సరైన దిగుబడులు రాక, గిట్టుబాటు ధర లభించక, వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు జరక్క తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుతో బ్యారన్‌కు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చారు. జిల్లాలో ఈ పాటికే మిర్చి, నల్ల బర్లీ పొగాకు రైతులు 12 మంది వరకు ఆత్మహత్యలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. భరోసా కల్పించాల్సిన బోర్డు, ప్రభుత్వం నెలన్నరగా ఆందోళన చేపట్టినా స్పందించలేదన్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో 45 శాతం బేళ్లు తిప్పి పంపడం వల్ల కొంటారో, కొనరోనని రైతులు ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మంత్రులు, బోర్డు చైర్మన్, ఈడీ అనేక సార్లు పర్యటించడం వల్ల రైతులు ఆశగా ఎదురు చూశారన్నారు. ఇకనైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని లో గ్రేడ్ కొనుగోలుకు రూ.1000 కోట్లు కేటాయించాలని, పెనాల్టీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
గత సంవత్సరం
140 మిలియన్ కిలోల కొనుగోలు...
జయంతి బాబు మాట్లాడుతూ గత సంవత్సరం 140 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేసిన యంత్రాంగం.. ఈ ఏడాది మరో 40 మిలియన్ కిలోలకు అనుమతిచ్చినందునే అధికంగా సాగు చేశారని అన్నారు. బోర్డు చైర్మన్ 240 మిలియన్ కిలోలుగా వక్రీకరించినట్లు ఆరోపించారు. కేవలం సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. బోర్డుచైర్మన్, ఈడీ కంపెనీలకు వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపించారు. ధరలు దిగజార్చి కంపెనీలకు మేలు చేసే విధంగా బోర్డు యంత్రాంగం కుట్రపన్నుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వం లో గ్రేడ్ పొగాకు రూ.20 వేలకు తగ్గకుండా కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఎస్టీసీతో పాటు పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్యను రంగంలోకి దించాలన్నారు. గతంలో కొనుగోలు చేసిన ప్రభుత్వ సంస్థలకేమీ నష్టం వాటిల్లలేదని, లాభపడ్డాయని గుర్తు చేశారు. అనంతరం రీజినల్ మేనేజర్ శీలం రామారావుకు వినతిపత్రం అందజేశారు. ఆగస్టు మొదటి వారంలో బోర్డు ఉన్నతాధికారుల సమావేశం జరగనుందని, ఆ సమావేశంలో పొగాకు సమస్యపై చర్చించడం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. తూబాటి శ్రీకాంత్ ధర్నాను ప్రారంభించగా, సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు పెంట్యాల హనుమంతరావు, తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు అబ్బూరి వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి బెజవాడ శ్రీనివాసరావు, నాయకులు కిలారి పెద్దబ్బాయి, కురిచేటి హనుమంతరావు, కొల్లూరు వెంకటేశ్వర్లు, చిలుకూరి వెంకట్రావు, పోలవరపు జనార్దన్‌రావు, దాసరి ఆంజనేయులు, నార్నే చెంచయ్య, మొలకలపల్లి కోటేశ్వరరావు, చెరుకూరి వాసు, తోకల శేషారావు, గాదె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేయించాలి రూ.1000 కోట్లు కేటాయించి రైతులను ఆదుకోవాలి పొగాకు ఆర్‌ఎం కార్యాలయం వద్ద రైతుల ధర్నా