త్రుటిలో తప్పిన ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

కారు వెనుక భాగంపై పడిన గ్రానైట్‌ రాయి

Aug 16 2023 2:54 AM | Updated on Aug 16 2023 12:27 PM

లారీ నుంచి పడిన భారీ గ్రానైట్‌ రాయి,పక్కనే దెబ్బతిన్న కారు  - Sakshi

లారీ నుంచి పడిన భారీ గ్రానైట్‌ రాయి,పక్కనే దెబ్బతిన్న కారు

ప్రకాశం: ట్రాలీ లారీ నుంచి భారీ పరిమాణంలో ఉన్న గ్రానైట్‌ రాయి జారి కారు వెనుక భాగంపై పడటంతో కారులో ఉన్న నలుగురు వ్యక్తులకు ఊపిరి ఆగినంతపనైంది. ఈ సంఘటన చీమకుర్తి ఎన్‌ఎస్పీ కాలనీ శివారులో పారడైజ్‌ హోటల్‌ ఎదుట కర్నూలు రోడ్డుపై మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. రామతీర్థం క్వారీల నుంచి ఓ లారీ గ్రానైట్‌ బ్లాకులతో ఒంగోలు వైపు బయలుదేరింది.

అదే సమయంలో చీమకుర్తి నుంచి రామతీర్థం వైపు కారు వెళ్తోంది. ఎన్‌ఎస్పీ కాలనీ శివారు వద్ద లారీ నుంచి భారీ గ్రానైట్‌ బ్లాక్‌ జారి కారు వెనుక భాగాన్ని రాసుకుంటూ కిందపడింది. అదే రాయి కారుపై పడి ఉంటే పరిస్థితి ఏమిటో ఊహించుకుంటేనే గుండె ఝల్లుమందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా, కారు వెనుక భాగం స్వల్పంగా దెబ్బతింది. కారు యజమాని కావటి నాగకిరణ్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్‌రెడ్డి తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement