ఉలవపాడు: జాతీయ రహదారిపై మన్నేటికోట రోడ్డు–కరేడు ర్యాంపు మధ్య మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. టంగుటూరుకు చెందిన దంపతులు బొడ్డు అన్నపూర్ణ, బొడ్డు ప్రభాకరరావులు కావలికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. కావలిలో లింగంగుంటకు చెందిన ఎ.జయకుమార్ ఆటోను మాట్లాడుకుని టంగుటూరు వైపు వస్తున్నారు. జాతీయ రహదారిపైకి రాగానే నెల్లూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు వీరి ఆటోను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి ఆటో రోడ్డు మార్జిన్ దాటి పక్కనే ఉన్న ఫెన్సింగ్‌ను బలంగా తాకుతూ నిలిచిపోయింది. ప్రమాదంలో ఆటో డ్రైవర్ జయకుమార్‌తో పాటు భార్యాభర్తలు అన్నపూర్ణ, ప్రభాకరరావులు తీవ్రంగా గాయపడ్డారు. కారు వేగంగా ఢీకొనడంతో వెంటనే ఎయిర్ బ్యాగ్‌లు (బెలూన్లు) తెరుచుకున్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న దంపతులు, చిన్నారి ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. స్థానికుల సాయంతో హైవే అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను వెంటనే ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


