హైవేపై తరచుగా అగ్నికి ఆహుతవుతున్న ట్రావెల్స్ బస్సులు మార్కాపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 14 మంది సజీవ దహనం నేడు వలేటివారిపాలెం వద్ద తగలబడిన ట్రావెల్స్ బస్సు ప్రమాదాలు జరుగుతున్నా నామ మాత్రపు చర్యలతో సరిపెడుతున్న రవాణాశాఖ అధికారులు మామూళ్లతో నిద్ర నటిస్తున్న అధికారుల తీరుపై మండిపడుతున్న ప్రజలు
ప్రైవేటు బస్సులంటే హడలిపోతున్న ప్రయాణికులు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
సాఫ్ట్‌వేర్ రంగం బలపడిన తరువాత జిల్లాలోని యువకులు హైదరాబాద్, బెంగళూరు, చైన్నై నగరాలకు వెళ్లడం ఎక్కువై పోయింది. వివిధ పనుల నిమిత్తం విశాఖ, రాజమండ్రి, తిరుపతి నగరాలకు కూడా ఉమ్మడి జిల్లాల మీదుగా వందలాది ప్రైవేటు ట్రావెల్ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. జిల్లా నుంచి సుమారు 300 బస్సులు నడుస్తుంటాయి. ఆధునిక సౌకర్యాలతోపాటుగా అత్యంత వేగంగా గమ్యాన్ని చేర్చుతున్న ట్రావెల్స్ బస్సులకు ఆదరణ పెరిగింది. తరచుగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురికావడం జరుగుతోంది. మార్కాపురం వద్ద జరిగిన ప్రమాదంలో 14 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. సోమవారం అర్ధరాత్రి వలేటివారిపాలెం వద్ద ట్రావెల్స్ బస్సు తగలబడింది. దీంతో ట్రావెల్ బస్సుల గురించి జిల్లాలో చర్చ జరుగుతోంది.
ప్రాణాలు పోలేదు..అంతే చాలు:
కడప నుంచి విజయవాడ వెళుతున్న ఓ ట్రావెల్స్ బస్సు సోమవారం అర్ధరాత్రి వలేటివారిపాలెం మండలం చుండి వద్దకు రాగానే ప్రమాదానికి గురైంది. బస్సు టైర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో ప్రయాణికులను బస్సు నుంచి దింపేశారు. కొద్ది సేపటికే మంటలు వ్యాపించాయి. బస్సు మొత్తం కాలి బూడిదైంది. డ్రైవర్ అప్రమత్తం కాకపోతే ఏం జరిగేదో ఊహించుకుంటే ఒళ్లు గగుర్పాటు కలుగుతుంది. బస్సు ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో హమ్మయ్య...అని అంతా ఊపిరి పీల్చుకున్నారు.
జిల్లాలో బస్సు దహనం ఘటనలు ఇలా..
ఇటీవల కొంతకాలంగా జిల్లా పరిధిలో ట్రావెల్స్ బస్సులు తరచుగా ప్రమాదాలకు గురౌతున్నాయి. 2015 జనవరి 28వ తేదీన ఉలవపాడు మండలం చాగల్లు వద్ద చైన్నె–హైదరాబాద్ ట్రావెల్స్ బస్సు వెనక భాగంలో ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించాయి. అనుమానం వచ్చిన డ్రైవర్ వెంటనే అప్రమత్తం అయ్యాడు. బస్సులో ప్రయాణిస్తున్న 35 మందిని వెంటనే బస్సు నుంచి దించేశాడు. కొద్దిసేపటికే బస్సు మొత్తం తగలబడింది. చూస్తుండగానే బూడిదగా మిగిలింది.
ఒకేసారి తగలబడిన 9 బస్సులు...
జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో ఒకేసారి 9 బస్సులు తగలబడ్డాయి. నగరంలోని వెంకటేశ్వరనగర్‌లో కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సులను పార్కింగ్ చేస్తుంటారు. 2022 మార్చి 1వ తేదీ నిలిపి ఉన్న తొమ్మిది బస్సులు ఒక్కసారిగా తగలబడ్డాయి. ఒంగోలు నగరంలోని ఆకాశం అంతా నల్లటి పొగలు వ్యాపించాయి. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది. అప్పటికే బస్సులన్నీ పూర్తిగా తగలబడిపోయాయి. సుమారు రూ.6 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు బస్సు యాజమాన్యం తెలిపింది.
మామూళ్ల మత్తు వీడని రవాణా శాఖ...
జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలు వరుసగా జరుగుతున్నా రవాణా శాఖలో చలనం కనిపించడం లేదు. ప్రయాణికుల ప్రాణాల కంటే నెలవారీ మామూళ్లకే ప్రాధాన్యమిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బస్సుల కండీషన్, ఫిట్‌నెస్, డ్రైవర్ల పనితీరు, వేగ నియంత్రణ వంటి అంశాలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా మీదుగా ప్రతిరోజూ సుమారు 300 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఒంగోలులో బయలుదేరిన బస్సులు తెల్లవారుజామున 5 గంటల్లోపే హైదరాబాద్ చేరుకుంటున్నాయి. ఈ ప్రయాణ సమయాలే బస్సులు ఏ స్థాయిలో వేగంగా దూసుకెళ్తున్నాయో చెప్పకనే చెబుతున్నాయి. అతివేగం, డ్రైవర్ల విశ్రాంతి లోపం ప్రమాదాలకు కారణమవుతున్నా నియంత్రణ చర్యలు మాత్రం కొరవడుతున్నాయి. రవాణా శాఖ అధికారులకు నెలవారీ మామూళ్లు అందితే చాలని, బస్సుల కండీషన్ ఎలా ఉన్నా పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ట్రావెల్స్ యాజమాన్యాల నుంచి నెలనెలా లక్షల రూపాయలు వసూలవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఈ వసూళ్లలో వాటాలు పంచుకోవడంపై చూపుతున్న శ్రద్ధ ప్రయాణికుల భద్రతపై చూపడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. తరుచూ ప్రమాదాలు జరుగుతున్నా తనిఖీలు, పర్యవేక్షణలో ఆశించిన మార్పు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉలవపాడు మండలం చాగల్లు వద్ద చైన్నె నుంచి హైదరాబాద్ వెళ్తున్న తులసి ట్రావెల్స్ బస్సు
దగ్దమైన దృశ్యం (ఫైల్)
ఉలవపాడు మండలం రాజుపాలెం వద్ద హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్దమైన దృశ్యం (ఫైల్)
ఉలవపాడు మండలం మన్నెటికోట రోడ్ వద్ద
దగ్ధమైన తిరువూరు డిపో ఆర్టీసీ బస్సు(ఫైల్)
ఒక ప్రమాదం పదుల ప్రాణాలను బలిగొంటోంది.. మరో ప్రమాదం ప్రయాణికులను భయకంపితులను చేస్తోంది. అయినా ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాల తీరు మారడం లేదు. అధికార యంత్రాంగం కళ్లు తెరవడం లేదు. మార్కాపురం ఘోర దుర్ఘటనలో ప్రయాణికులు
సజీవ దహనమైన విషాదం కళ్లముందు కదలాడుతుండగానే సోమవారం అర్ధరాత్రి వలేటివారిపాలెం వద్ద మరో బస్సు అగ్నికి ఆహుతైంది. ప్రమాదం జరిగినప్పుడు తనిఖీలంటూ హడావుడి... ఆ తర్వాత అంతా యథాతథం.ప్రైవేటు ట్రావెల్స్ వ్యాపారానికి ప్రయాణికుల ప్రాణాలు పణంగా మారుతున్నా నియంత్రించే నాథుడే కరువయ్యాడు.
నిద్ర నుంచి శాశ్వత నిద్రలోకి...
మార్కాపురం శివారులోని పలకల గనుల వద్ద ఈ ఏడాది మార్చి 26వ తేదీన ఒక టిప్పర్‌ను ఢీకొన్న ఘటనలో జగిత్యాల నుంచి వింజమూరు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు పూర్తిగా తగలబడింది. తెలవారుజాము నాలుగు గంటల సమయంలో ఈ ప్రశాంతంగా ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. బస్సులో 37 మంది ప్రయాణికులు ఉండగా అందులో 14 మంది సజీవ దహనం అయ్యారు. తీవ్రంగా గాయపడిన ఒక ప్రయాణికుడు చికిత్స పొందుతూ మరణించారు. మిగిలిన 23 మందికి గాయాలయ్యాయి. వారిని ఒంగోలు జీజీహెచ్, మార్కాపురం జీజీహెచ్‌లకు తరలించి అత్యవసర వైద్య చికిత్స అందజేశారు. ఈ ప్రమాదం ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం కలిగించింది. అయితే ప్రమాదంలో మరణించిన వారిలో కనిగిరి, పామూరు వారు ఎక్కువగా ఉండడంతో జిల్లాలో విషాదం నెలకొంది.


