రాక్షస రాజకీయంలో
కందుకూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార యంత్రాంగం, పోలీసులను అడ్డంపెట్టుకుని టీడీపీ అరాచకాలకు తెగబడినా.. క్షేత్రస్థాయిలో గుండైధెర్యంతో పోరాడిన వైఎస్సార్‌సీపీ శ్రేణులదే నైతిక విజయమని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్ స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం చేశారని మండిపడ్డారు. అన్ని రకాల దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడినా వైఎస్సార్‌సీపీ ప్రజాబలాన్ని మాత్రం తగ్గించలేకపోయారని తేల్చిచెప్పారు.
బీహార్‌ను తలపించేలా దౌర్జన్యాలు
వైఎస్సార్‌సీపీ శ్రేణుల పోరాటపటిమతో నియోజకవర్గంలో 6 ఎంపీటీసీ స్థానాలతో పాటు ఒక జెడ్పీటీసీ స్థానాన్ని సగర్వంగా కై వసం చేసుకున్నామని బుర్రా తెలిపారు. మరో 8 నుంచి 10 స్థానాల్లో స్వల్ప ఓట్ల తేడాతోనే ఓడిపోయామన్నారు. పార్టీ సునాయాసంగా గెలిచే పలు స్థానాల్లో అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి నామినేషన్లు వేయనీయలేదని, మరో నాలుగైదు స్థానాల్లో స్క్రూట్నీ పేరుతో అక్రమంగా తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. కందుకూరులో బీహార్‌ను తలపించే రీతిలో ఎమ్మెల్యే ఇంటూరి రాక్షస క్రీడ నడిపించారని, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తే మెజార్టీ స్థానాలు వైఎస్సార్‌సీపీ ఖాతాలోనే ఉండేవని ధీమా వ్యక్తం చేశారు. గెలుపు కోసం ఎమ్మెల్యే ఏకంగా రూ.3 కోట్లు వెచ్చించారని ఆరోపించారు.
బూత్‌లను ఆక్రమించి 10 వేల ఓట్లు రిగ్గింగ్
నామినేషన్ల ఘట్టం నుంచి ఫలితాల వరకు టీడీపీ నేతలు చేయని అకృత్యం లేదని బుర్రా ధ్వజమెత్తారు. ఎన్నికల రోజు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బలవంతంగా బూత్‌ల నుంచి నెట్టివేసి ఓట్లు గుద్దుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడేవారిపాలెం, వీఆర్‌కోట, చినపవని, పెదపవని వంటి గ్రామాల్లో బహిరంగంగా రిగ్గింగ్ చేశారని, నియోజకవర్గవ్యాప్తంగా దాదాపు 10 వేల ఓట్లను రిగ్గింగ్ చేసుకున్నారని ఆధారాలతో వివరించారు.
ఖాకీల ‘పచ్చ’పాతం
గుడ్లూరు, లింగసముద్రం ఎస్సైలు పచ్చ చొక్కాలు వేసుకోవడం ఒక్కటే తక్కువన్నట్లుగా టీడీపీ కార్యకర్తల్లా ఏకపక్షంగా పనిచేశారని బుర్రా మండిపడ్డారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా క్షేత్రస్థాయి అధికారులు అధికార పార్టీకే తొత్తులుగా మారారని దుయ్యబట్టారు. ఇలాంటి కుట్రలతో సాధించిన గెలుపు అసలైన గెలుపే కాదని ఎద్దేవా చేశారు. రానున్న మున్సిపల్, పంచాయతీ ఎన్నికలనైనా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అరాచకాలకు ఎదురొడ్డి యుద్ధసైనికుల్లా
పోరాడిన పార్టీ శ్రేణులు
ప్రజా మద్దతుతో 6 ఎంపీటీసీలు,
ఒక జెడ్పీటీసీ కై వసం
పోలీసులను అడ్డంపెట్టుకుని టీడీపీ నేతలు 10 వేల ఓట్లు రిగ్గింగ్ చేశారు
గెలుపు కోసం ఎమ్మెల్యే ఇంటూరి రూ.3 కోట్లు వెచ్చించారు
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తే మెజార్టీ స్థానాలు గెలిచేవాళ్లం
వైఎస్సార్ సీపీ కందుకూరు ఇన్‌చార్జి
బుర్రా మధుసూదన్‌యాదవ్


