కందుకూరు:
ప్రజాభిమానం ముందు అధికార మదం తలవంచక తప్పలేదు. దాడులు, ప్రలోభాలు, బెదిరింపులతో వైఎస్సార్‌సీపీని ఖాళీ చేయాలనుకున్న అధికార పార్టీ కుట్రలు ప్రజాక్షేత్రంలో బద్దలయ్యాయి. కందుకూరు గడ్డపై వైఎస్సార్‌సీపీ ప్రజా పునాదులు ఎంత పటిష్టంగా ఉన్నాయో తాజా ఫలితాలు నిరూపించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఉన్న తిరుగులేని ఆదరణ ముందు అధికార టీడీపీ దాడులు, దౌర్జన్యాలు, అధికారుల ఏకపక్ష వైఖరి ఏమాత్రం నిలబడలేకపోయాయి. నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీని నామరూపాలు లేకుండా చేయాలన్న పాలకుల వ్యూహాలు తలకిందులయ్యాయి. స్థానిక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అడుగడుగునా ఎదురైన ప్రతిబంధకాలను ఛేదించి వైఎస్సార్‌సీపీ ఆరు ఎంపీటీసీ స్థానాలతో పాటు ప్రతిష్టాత్మకమైన ఉలవపాడు జెడ్పీటీసీ స్థానాన్ని సగర్వంగా కై వసం చేసుకుంది. సంఖ్యాపరంగా టీడీపీ కొన్ని స్థానాలు నెగ్గినా, ప్రజాక్షేత్రంలో నైతికంగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అరాచక రాజకీయాలను ధీటుగా ఎదుర్కొన్న వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్, పార్టీ శ్రేణుల్లో అపూర్వమైన ధైర్యాన్ని నింపి పార్టీ సత్తా చాటారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఏకగ్రీవాలు
ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచే టీడీపీ నాయకులు అడ్డదారులు తొక్కారు. గుడ్లూరు, వలేటివారిపాలెం, లింగసముద్రం, కందుకూరు, ఉలవపాడు మండలాల్లో ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా దాడులకు తెగబడ్డారు. ప్రధానంగా లింగసముద్రంలో తీవ్ర హింసను సృష్టించి నాలుగు స్థానాల్లో నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారు. పరిశీలన వేళ అధికారులపై ఒత్తిడి తెచ్చి గెలుపు అవకాశాలున్న చోట్ల నామినేషన్లు రద్దు చేయించారు. మరికొందరిని బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి బలవంతంగా ఉపసంహరింపజేశారు. ఇలా కందుకూరు మండలంలోని మాచవరం, పాలూరు దొండపాడు, వలేటివారిపాలెంలోని చుండి, పోలినేనిచెరువు వంటి వైఎస్సార్‌సీపీ పక్కాగా గెలిచే స్థానాలు సహా ఏకంగా 21 ఎంపీటీసీలను దౌర్జన్యంగా ఏకగ్రీవం చేసుకున్నారు.
డబ్బు, రిగ్గింగ్ నమ్ముకున్నా భంగపాటే..
నియోజకవర్గంలో పోలింగ్ నిర్వహించిన 38 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ వీరోచితంగా పోరాడింది. కందుకూరు మండలంలో మాచవరం–1, పలుకూరు, ఉలవపాడు మండలంలో కరేడు ఈస్ట్, ఉలవపాడు ఈస్ట్, లింగసముద్రం మండలంలో మొగిలిచర్ల, గుడ్లూరు మండలంలో చేవూరు ఎంపీటీసీ స్థానాల్లో ప్రభంజనం సృష్టించింది. గెలుపు కోసం టీడీపీ ఉలవపాడు, గుడ్లూరు మండలాల్లో కాంట్రాక్టర్ల ద్వారా ఓటుకు రూ.1000 నుంచి రూ.2000 వరకు పంపిణీ చేసింది. నియోజకవర్గ వ్యాప్తంగా రూ.3 నుంచి రూ.4 కోట్లు కుమ్మరించింది. అంతటితో ఆగక ఏజెంట్లను బయటకు నెట్టి బూత్‌కు 100 నుంచి 200 దొంగ ఓట్లతో రిగ్గింగ్‌కు పాల్పడింది. అయినా టీడీపీ గెలిచిన స్థానాల్లో కేవలం 50 నుంచి 150 ఓట్ల స్వల్ప మెజార్టీలే దక్కడం ఆ పార్టీ డొల్లతనాన్ని బయటపెట్టింది. మాచవరంలో ఓటర్లకు భారీగా డబ్బు పంచినా, మొగిలిచర్లలో ఎమ్మెల్యే స్వయంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా వైఎస్సార్‌సీపీదే అంతిమ విజయమైంది. ఫలితాలు రాగానే ఎమ్మెల్యే హైదరాబాద్ వెళ్లిపోగా, స్థానిక నాయకులు సంబరాలకు మొహం చాటేయడం గమనార్హం.
వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో వెల్లువెత్తిన జోష్
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో అధికార దౌర్జన్యాలను తట్టుకుని కందుకూరులో 6 ఎంపీటీసీలు, ఉలవపాడు జెడ్పీటీసీ స్థానాన్ని గెలుచుకోవడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఆరంభం నుంచే అభ్యర్థులకు అండగా నిలిచి పోరాడిన ఇన్‌చార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ నాయకత్వంపై కేడర్‌లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పక్షం కుట్రలను తిప్పికొట్టి సాధించిన ఈ విజయాలు వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపాయి.
గెలిచిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను అభినందిస్తున్న బుర్రా, నాయకులు
కందుకూరు నియోజకవర్గ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటిన వైఎస్సార్ సీపీ
అధికార పార్టీ దౌర్జన్యాలు, కుట్రలను ఛేదించి 6 ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ స్థానం కై వసం
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ టీడీపీ అడ్డదారులు.. భయపెట్టి 21 స్థానాల ఏకగ్రీవం
కోట్లు కుమ్మరించినా, రిగ్గింగ్‌కు పాల్పడినా పడని ప్రభావం.. టీడీపీలో తీవ్ర అంతర్మథనం
శ్రేణులను నడిపించి టీడీపీ వ్యూహాలకు చెక్ పెట్టిన మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్


