ఎన్నికల్లో పోటీ చేశారని దాడులకు పాల్పడతారా.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున
చీమకుర్తి రూరల్: దళితులు ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయడం జీర్ణించుకోలేని పచ్చమూకలు వారిపై విచక్షణా రహితంగా దాడిచేయడం దారుణమని, దాడిచేసిన టీడీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. మండలంలోని ఎల్లయ్యనగర్‌లో శనివారం రాత్రి వైఎస్సార్ సీపీ సానుభూతిపరులైన మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారిపై టీడీపీ అగ్రకుల నాయకులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో దాదాపు 25 మంది దళితులు గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరు ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. బాధితులను బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, మేరుగు నాగార్జున ఆదివారం రిమ్స్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులు బూచేపల్లి, మేరుగుతో బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మహిళలు, పిల్లలు అని కూడా చూడకుండా టీడీపీ మూకలు కర్రలు, ఇనుప రాడ్లతో విచక్షణా రహితంగా దాడిచేశారని వాపోయారు. మాదిగలు.. మీకు ఎందుకు రాజకీయమంటూ నిద్రిస్తున్న వారిని సైతం ఇళ్ల నుంచి బయటకు లాగి కొట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడిన వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. స్థానిక బూదవాడ ఎంపీటీసీ ఎన్నికల్లో ఎంపీటీసీ అభ్యర్థిగా జండ్రాజుపల్లి యేసేబు పోటీ చేశారని, వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలిచారనే కారణంతో తమను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారని వాపోయారు.
దాడి ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు:
బాధితులకు అండగా ఎస్పీ హర్షవర్ధన్‌రాజుని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, సంతనూతలపాడు ఇన్‌చార్జి మేరుగు నాగార్జున, మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొమ్మూరి కనకారావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వేమా శ్రీనివాసరావు, చీమకుర్తి మండల పార్టీ అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు తదితరులు కలిసి ఫిర్యాదు చేశారు. బాధితులకు న్యాయం చేయాలని కోరారు. దళితులపై దాడి చేసిన సీఐ ప్రసాద్‌ను విధుల నుంచి తొలగించాలన్నారు. దళితులపై దాడి చేసిన టీడీపీ నాయకులు లగడపాటి రామారావు, మేదరమెట్ల భీమేశ్వరరావు, ఆదినారాయణ, పరుశురాం, చాంద్ బాషా, గౌస్ బాషా, ఎస్.కె.బుల్లా తదితరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు రిమ్స్ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం, పునరావాస సహాయం అందించాలని కోరారు. దళితులకు కూడా గౌరవంగా జీవించే హక్కు ఉందని, ఎన్నికల్లో పోటీ చేయడం నేరం కాదన్నారు. వారి మాట వినలేదనే కారణంతో దాడులు చేయడం, కులం పేరుతో అవమానించడం, పసిబిడ్డలను ఎత్తుకొని ప్రాణాలు కాపాడుకోవడానికి గ్రామం వదిలి వచ్చే పరిస్థితి కల్పించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. దళితులకు రక్షణ కల్పించి, జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలని, వారి ప్రాణాలకు, కుటుంబాల భద్రతకు ఎలాంటి ముప్పు కలగకుండా తక్షణ చర్యలు తీసుకుని, న్యాయం చేయాలని ఎస్పీని కోరారు.
చీమకుర్తి సీఐని విధుల నుంచి తప్పించాలి:
ఇళ్లలోకి వచ్చి దళితులపై దాడి చేసిన చీమకుర్తి సీఐ దాసరి ప్రసాద్ ను విధుల నుంచి తప్పించి తగిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. చీమకుర్తి సీఐ బాధ్యత మరిచి సానుభూతిపరులపై విచక్షణ రహితంగా దాడి చేయటం మంచిది కాదని వెంటనే ఉన్నతాధికారులు అతనిని విధులు నుంచి తొలగించాలన్నారు. ఈ విషయాన్ని స్టేట్ ఎస్సీ కమిషన్ చైర్మన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్మన్, స్టేట్ హ్యూమన్ రైట్స్ చైర్మన్, పోలీస్ లీగల్ అథారిటీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. వారి వెంట చీమకుర్తి మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, కే సత్యం, బొడ్డు కోటేశ్వరరావు, చిన్నపరెడ్డి పాపి రెడ్డి తదితరులు ఉన్నారు.
మాకు రక్షణ కావాలి
చీమకుర్తి సీఐ దాసరి ప్రసాదు వలన మాకు ప్రాణహాని ఉంది అందువలన మాకు ఉన్నతాధికారులు రక్షణ కల్పించాలి సీఐ ప్రసాద్ మాపై విచక్షణారహితంగా దాడి చేశారు. మేము ఇంటికి వెళితే అతని వలన ప్రాణహాని ఉంటుంది అందువలన మాకు రక్షణ కావాలి.
– ఎనుబర్ల ఎమ్మెల్యేమ్మ, ఎల్లయ్య నగర్.
నిద్రపోతున్న నా కుమారుడని నిద్రలేపి కొట్టారు
నిద్రపోతున్న నా కుమారుడిని నిద్రలేపి సీఐ దాసరి ప్రసాద్ కొట్టారు. టీడీపీ నాయకులు ఈ ఇల్లు వైఎస్సార్ సీపీ సానుభూతిదారులని చూపించడంతో సీఐ విచక్షణా రహితంగా ఆడ మగ అని తేడా లేకుండా లాఠీతో కొట్టారు. ఆ దాడిలో చాలామంది గాయపడ్డారు.
– జండ్రాజుపల్లి దయమ్మ, ఎల్లయ్య నగర్.


