తౌషిక్, మౌలాబీ మృతి
ఘటనలో ఇద్దరు అరెస్టు
ఒంగోలు టౌన్: సింగరాయకొండ చైతన్య కోచింగ్ సెంటర్ విద్యార్థి సయ్యద్ తౌషిక్ అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికను త్వరలో హైకోర్టుకు అందజేస్తానని నెల్లూరు ఏఎస్పీ సౌజన్య తెలిపారు. తౌషిక్ అనుమానాస్పద మృతి కేసులో విచారణాధికారిగా ఉన్న ఆమె సోమవారం డీఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు మందా కృష్ణ మాదిగ, డీసీసీ అధ్యక్షుడు షేక్ సైదా ఆధ్వర్యంలో పలువురు ప్రజా సంఘాల నాయకులు ఏఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. హైకోర్టు ఆదేశాలను పాటించాలని, నిస్పక్షపాతంగా కేసును విచారించాలని కోరారు. తౌషిక్ అనుమానాస్పద మృతికి సంబంధించి అన్నీ కోణాల్లో విచారించి వాస్తవాలు వెలుగులోకి తీసుకోనిరావాలని, దర్యాప్తులో ఎలాంటి రాజకీయ, ఆర్ధిక ఒత్తిళ్లకు తావులేకుండా బాధ్యులైన వారిపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని, హైకోర్టు ఆదేశించిన గడువు ప్రకారం దర్యాప్తు పూర్తి చేసి త్వరితగతిన నివేదికను కోర్టుకు సమర్పించాలని వినతిపత్రంలో కోరారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరగా కోర్టుకు నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. ఏఎస్పీని కలిసి వినతి పత్రం అందించిన వారిలో వీసీకే జిల్లా అధ్యక్షుడు ఆదినారాయణ, లోక్‌సత్తా నాయకుడు చంద్రశేఖర్, ఏపీసీఎల్‌సీ కార్యదర్శి నల్లూరి క్రాంతి, పీఓడబ్ల్యూ నాయకురాలు పద్మ, సీపీఐ కొండపి కార్యదర్శి లక్ష్మి, తౌషిక్ తండ్రి సయ్యద్ అలి, నవ్యాంధ్ర ముస్లిం సొసైటీ అధ్యక్షుడు షేక్ మహబూబ్ బాషా, విద్యార్థి జేఏసీ నాయకుడు రాయపాటి జగదీష్ ఉన్నారు.
సింగరాయకొండ: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తౌషిక్, మౌలాబిల మృతి ఘటనలకు సంబంధించి మౌలాబి ఆత్మహత్యకు పాల్పడిన కేసులో శ్రీ చైతన్య నవోదయ స్కూలు పాఠశాల అధినేత చైతన్య, వార్డెన్ బాబ్జిలను సోమవారం అరెస్టు చేసినట్లు సీఐ వై శ్రీహరి తెలిపారు. మౌలాబి ఆత్మహత్య చేసుకోవటానికి ప్రేరేపించిన ఘటనకు సంబంధించి వీరిద్దరి పాత్ర ఉన్నట్లు తమ విచారణలో తేలిందని వీరిపై నాన్‌బెయిలబుల్ సెక్షన్లు విధించి కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. వీరిద్దరినీ మంగళవారం కోర్టుకు హాజరు పరచనున్నట్లు వివరించారు.


