మురసు తుఫాను విలయతాండవంతో
నాగులుప్పలపాడు మండలం అతలాకుతలమైంది. తుఫాను తీరం దాటి వారం రోజులు గడుస్తున్నా విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ కాకపోవడంతో పల్లెలు అంధకారంలో మగ్గుతున్నాయి. కనపర్తి, దాసరివారిపాలెం గ్రామాల్లో చిమ్మచీకటి, దోమల బెడదతో
వృద్ధులు, చిన్నారులు కంటిమీద కునుకులేక అల్లాడుతున్నారు. తాటాకు మంటలు, దీపాల వెలుగుల్లోనే పూట గడుపుతున్నారు. సెల్ఫోన్లు, బ్యాటరీ వాహనాల ఛార్జింగ్ కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు తుఫాను రైతాంగాన్ని, వ్యాపారులను నిండా ముంచింది. పొగాకు బ్యారన్లు నేలమట్టం కాగా, పైకప్పులు లేచిపోయి నిల్వ ఉంచిన పొగాకు బేళ్లు వర్షపు నీటిలో తడిసి ముద్దయ్యాయి. రబీలో వేసిన తొలిదశ పొగాకు నారు వరదకు కొట్టుకుపోవడంతో రైతుల శ్రమ బూడిదలో పోసిన పన్నీరైంది. ఉప్పుగుండూరులో ధనియాలు, శనగల గోడౌన్లు కూలిపోయి, సరుకు పాడై
వ్యాపారులకు రూ.కోట్లల్లో నష్టం వాటిల్లింది. కరెంటు లేక, చేతికొచ్చిన పంటలు,
వ్యాపారాలు నాశనమై మండల ప్రజలు తీవ్ర నిస్సహాయతలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ను
పునరుద్ధరించి, ఆదుకోవాలని ప్రజలు
వేడుకుంటున్నారు.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఒంగోలు/
నాగులుప్పలపాడు
మురసు తుఫాన్ విలయం నుంచి కోలుకోని పల్లెలు


