ఉమ్మడి జిల్లాలో 917 పంచాయతీలకు ఎన్నికలు
ఈ నెల 13న నోటిఫికేషన్.. మూడు విడతల్లో పోలింగ్
గ్రామాల్లో మొదలైన రాజకీయ సందడి
మార్కాపురం: పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. గ్రామ పంచాయతీల్లో పాగా వేసేందుకు ఆశావహులు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నాహాలు ముమ్మరం చేస్తుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 917 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 13న నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయాలనుకునే వారు గ్రామాల్లో తమ బలాబలాలను అంచనా వేసుకుంటూ వ్యూహాలకు పదును పెడుతున్నారు.
మూడు విడతలుగా..
గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, తుది అభ్యర్థుల జాబితా ప్రకటన, గుర్తుల కేటాయింపు, పోలింగ్, ఓట్ల లెక్కింపు తదితర ప్రక్రియలను విడతల వారీగా చేపట్టేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
మార్కాపురంలో 402 పంచాయతీలు..
మార్కాపురం జిల్లాలో 21 మండలాల పరిధిలో 402 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. వివిధ కారణాలతో నాలుగు పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించడం లేదు. జిల్లాలో మొత్తం 7,55,261 మంది ఓటర్లు ఉన్నారు. మొదటి విడతలో కనిగిరి, పీసీపల్లి, హెచ్.ఎం.పాడు, వెలిగండ్ల, పామూరు, సీఎస్.పురం మండలాల్లోని 135 పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. రెండో విడతలో గిద్దలూరు, కొమరోలు, బేస్తవారిపేట, కంభం, రాచర్ల, అర్థవీడు, మార్కాపురం, తర్లుపాడు మండలాల్లోని 134 పంచాయతీలకు నవంబర్ 29న, మూడో విడతలో యర్రగొండపాలెం, దోర్నాల, త్రిపురాంతకం, పెద్దారవీడు, పుల్లలచెరువు, కొనకనమిట్ల, పొదిలి మండలాల్లోని 133 పంచాయతీలకు డిసెంబర్ 2న పోలింగ్ జరగనుంది.
ప్రకాశంలో 515 పంచాయతీలు..
ప్రకాశం జిల్లాలో 515 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. కందుకూరు డివిజన్‌లోని 137 పంచాయతీలకు ఈ నెల 26న మొదటి విడత పోలింగ్ నిర్వహించనున్నారు. ఒంగోలు డివిజన్‌లోని 180 పంచాయతీలకు ఈ నెల 29న రెండో విడత, అద్దంకి డివిజన్‌లోని 198 పంచాయతీలకు డిసెంబర్ 2న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 917 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిబ్బంది నియామకం, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, బ్యాలెట్ పత్రాల సిద్ధం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు.
గ్రామాల్లో అప్పుడే రాజకీయ వేడి:
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొంది. ఇప్పటికే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముగియడంతో సర్పంచ్ పదవులపై ఆశావహులు దృష్టి సారించారు. గ్రామాల్లో అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తూ తమ బలాబలాలను అంచనా వేసుకుంటున్నారు. సామాజిక సమీకరణాలు, గ్రామంలో ఉన్న పట్టుతో పాటు రాజకీయ పార్టీల మద్దతును బేరీజు వేసుకుంటున్నారు. రిజర్వేషన్లు ఖరారు కావడంతో పోటీకి సిద్ధమవుతున్న వారు తమ ప్రచారానికి ప్రాథమికంగా శ్రీకారం చుట్టారు. వార్డు సభ్యులుగా పోటీ చేయాలనుకునే వారు సైతం ఓటర్లను కలుస్తూ మద్దతు కూడగట్టుకుంటున్నారు.
మార్కాపురం జిల్లాలో 402.. ప్రకాశంలో 515 పంచాయతీలు


