అర్జీదారుడి ఇంటికెళ్లి సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీదారుడి ఇంటికెళ్లి సమస్యలు పరిష్కరించాలి

Nov 11 2026 3:57 AM | Updated on Nov 11 2026 3:57 AM

అర్జీదారుడి ఇంటికెళ్లి సమస్యలు పరిష్కరించాలి నిలిచిన లారీని ఢీకొన్న మరో లారీ ఇద్దరు నిందితులకు రిమాండ్‌ రిమ్స్‌ నుంచి బాధితుల డిశ్చార్జ్‌

● అధికారులతో సమీక్షలో కలెక్టర్‌ రాజాబాబు

ఒంగోలు సబర్బన్‌: ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌) అర్జీల పరిష్కారంలో అధికారులు చిత్తశుద్ధితో ముందుండాలని కలెక్టర్‌ పి.రాజాబాబు ఆదేశించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో మంగళవారం డీఆర్‌వో పీవీ రమణ, జిల్లా నోడల్‌ అధికారి ముప్పూరి వెంకటేశ్వరరావుతో కలిసి ఆర్డీవోలు, తహసీల్దార్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. అర్జీదారుల సంతృప్తి స్థాయి పెరిగేలా అధికారులు స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకొని పరిష్కరించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో పెండింగ్‌ అర్జీల సత్వర పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్‌ ఈడీ వెంకటేశ్వరరావు, కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

● చికిత్స పొందుతూ డ్రైవర్‌ మృతి

ఒంగోలు టౌన్‌: ఒంగోలు శివారు దశరాజుపల్లి ఫ్లైఓవర్‌ వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన మరో లారీ వెనుక నుంచి బలంగా ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోయాడు. బీహార్‌ నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి ఢీకొట్టడంతో క్యాబిన్‌ నుజ్జునుజ్జయ్యింది. క్యాబిన్‌లో చిక్కుకుపోయిన డ్రైవర్‌ రణపాల్‌ దేవ్‌ను పోలీసులు తీవ్రంగా శ్రమించి బయటకు తీసి ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం అతడు మృతి చెందాడు. తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మౌలాబీ కేసులో

సింగరాయకొండ: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విద్యార్థిని సయ్యద్‌ మౌలాబీ అనుమానాస్పద మృతి కేసులో అరెస్టయిన శ్రీ చైతన్య నవోదయ స్కూల్‌ నిర్వాహకుడు వాకా చైతన్య, వార్డెన్‌ బాబ్జీలకు స్థానిక జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. జడ్జి డాక్టర్‌ వి. లీలా శ్యాంసుందరి ఆదేశాల మేరకు నిందితులను ఒంగోలు సబ్‌జైలుకు తరలించారు. ఈ కేసులో పరారీలో ఉన్న స్కూల్‌ అధినేత వాకా రమణారెడ్డి, సుజాత, అనూషల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు సీఐ వై.శ్రీహరి తెలిపారు.

● ఎల్లయ్యనగర్‌లో పోలీసు బందోబస్తు

చీమకుర్తి రూరల్‌: మండలంలోని బూదవాడ పంచాయతీ ఎల్లయ్యనగర్‌లో ఈ నెల 7వ తేదీన టీడీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడిన దళిత సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు పూనూరి క్రాంతి కుమార్‌, జండ్రాజుపల్లి ఇమ్మానియేలు, ఎనుబర్ల ప్రభుదాసు, జండ్రాజుపల్లి దానయ్య, రావినూతల లత, ఎనుబర్ల సంపూర్ణమ్మ, జండ్రాజుపల్లి కుమారి, గుంటూరు రమణ ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొంది మంగళవారం సాయంత్రం డిశ్చార్జ్‌ అయ్యారు. రాత్రి గ్రామానికి చేరుకున్న బాధితులు ఇంకా భయాందోళనలోనే ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముగ్గురు కానిస్టేబుళ్లతో తాత్కాలిక బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నందున భద్రతను మరింత పెంచాలని బాధితులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement