నాదెండ్ల: నూతన బైపాస్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో అయ్యప్ప మాలధారుడు దుర్మరణం పాలైన సంఘటన మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఎస్సై కట్టా వెంకటయ్య తెలిపిన వివరాల మేరకు.. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని కరువాది గ్రామానికి చెందిన పుల్లా వేణు (45) ద్విచక్రవాహనంపై ఒంగోలు నుంచి గుంటూరు వెళ్తున్నాడు. మోటారు సైకిల్ స్పేర్‌పార్ట్స్ తీసుకునేందుకు వెళ్తుండగా నూతన బైపాస్ రోడ్డుపై నాదెండ్ల ఫ్‌లైఓవర్ సమీపంలో ముందు వెళ్తున్న నూతన ట్రాక్టర్లను వెనుక నుంచి ఢీకొన్నాడు. దీంతో పుల్లా వేణు రహదారిపై పడి తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్రవాహనం ధ్వంసమైంది. మృతుడు వేణు గతంలో గుంటూరు మహీంద్రా కార్ షోరూమ్‌లో అకౌంటెంట్‌గా పనిచేశాడు. ఇటీవల అయ్యప్ప మాల ధరించాడు. ఈ క్రమంలో మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో మృతుడి ఆచూకీ కోసం అతని బ్యాగ్‌లో ఉన్న ఆధారాలతో కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. భార్య దార్ల సునీత రైల్వేశాఖ ఉద్యోగి కాగా, వీరికి ఇరువురు కుమారులు. మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భార్య సునీత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కందుకూరు: పట్టణంలో ప్రధాన రహదారి పక్కనే నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలోని బాప్టిస్టు చర్చిలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. సోమవారం రాత్రి ప్రార్థనలు ముగించుకుని నిర్వాహకులు తాళాలు వేసి వెళ్లగా, మంగళవారం ఉదయం వచ్చి చూసేసరికి ప్రధాన తలుపులు పగలగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి పరిశీలించగా హుండీని ధ్వంసం చేసి అందులోని నగదును దోచుకెళ్లినట్లు గుర్తించారు. ప్రధాన రహదారి వెంట ఉన్న చర్చిలో చోరీకి తెగబడటం స్థానికంగా కలకలం రేపింది. నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, హుండీ ఎంత మేర నగదు ఉందన్నది స్పష్టం కాలేదు.
తర్లుపాడు: మండల కేంద్రమైన తర్లుపాడులోని జడ్పీ హైస్కూల్ ఆవరణలో ఉన్న మధ్యాహ్న భోజన వంటగదికి మంగళవారం గుర్తుతెలియని దుండగులు నిప్పంటించారు. ఈ ప్రమాదంలో వంటగది, అందులోని వంట సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. పాఠశాల సమయం కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.


