సింగరాయకొండ: మురసు తుఫాన్ సృష్టించిన బీభత్సంతో కడలి బిడ్డలు కన్నీరుమున్నీరవుతుంటే.. ఆదుకోవాల్సిన కూటమి సర్కారు నిలువునా మోసం చేసింది. విపత్తు వేళ బాధితులందరినీ ఆదుకుంటామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ప్రభుత్వం, తీరా సాయం అందించే సమయానికి దారుణమైన కొర్రీలు పెట్టి చేతులు దులుపుకొంది. సింగరాయకొండ మండలంలోని తీరప్రాంత మత్స్యకార కుటుంబాల్లో సగానికి పైగా బాధితులకు మొండిచేయి చూపడంతో గంగపుత్రులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హామీ కొండంత.. చేతల్లో గోరంత!
తీరప్రాంతాల్లో తుఫాను ప్రభావానికి గురైన ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కేజీల బియ్యం, కేజీ చొప్పున చక్కెర, కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఉచితంగా అందిస్తామని పాలకులు ఊరూరా ప్రచారం చేసుకున్నారు. దీంతో పస్తులుంటున్న కుటుంబాల్లో కాస్త ఊరట లభిస్తుందని గంగపుత్రులు ఆశపడ్డారు. తీరా రేషన్ దుకాణాల వద్దకు వెళ్లాక అసలు మోసం బయటపడింది. సాధారణంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు నివాసం ఉండే పేదలందరినీ ఆదుకోవాల్సింది పోయి, కేవలం మత్స్యశాఖ జాబితాలోని శ్రీమత్స్యకార భరోసాశ్రీ లబ్ధిదారులకు మాత్రమే సరుకులు ఇస్తామంటూ అధికారులు మోకాలడ్డారు.
1,800 కుటుంబాలకు పైగా మొండిచేయి
పాకల, ఊళ్లపాలెం పంచాయతీల పరిధిలో సుమారు 3,500 మత్స్యకార కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అయితే ప్రభుత్వం కేవలం 1,677 కుటుంబాలకే సరుకులు కేటాయించి చేతులు దులుపుకుంది. మిగిలిన 1,800 పైచిలుకు కుటుంబాలకు నయాపైసా సాయం కూడా అందించలేదు. వేట నిషేధమైనా, తుఫానులొచ్చినా అందరి పొట్టలు మాడతాయని తెలిసినా.. బాబు సర్కారు వివక్షాపూరిత వైఖరి అవలంబించడంపై మత్స్యకారులు మండిపడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊదరగొట్టిన చంద్రబాబు, గద్దెనెక్కాక పేదల నోటికాడి కూడును ఎలా లాక్కుంటారో ఈ ఘటనే నిదర్శనమని ధ్వజమెత్తుతున్నారు.
ప్రభుత్వ తీరును ఎండగట్టిన మత్స్యకారుల ఐక్యత
సర్కారు చేసిన మోసానికి కుంగిపోకుండా మత్స్యకార సమాజం అద్భుత ఐక్యతను ప్రదర్శించింది. గ్రామ పెద్దలు(కాపులు) అత్యవసరంగా సమావేశమై, పాలకుల వివక్షను ఎండగడుతూ కీలక తీర్మానం చేశారు. ప్రభుత్వం కొందరికే ఇచ్చినా.. తామంతా కలిసికట్టుగా పంచుకోవాలని నిర్ణయించారు. ఒకరి పొట్టకొట్టి మరొకరు తినే సంస్కృతి తమది కాదని నిరూపించారు. కుటుంబంలో ఒక్కో వ్యక్తికి 5 కేజీల చొప్పున బియ్యం లెక్కగట్టారు. చక్కెర, నూనె, కందిపప్పు, బంగాళదుంపలు, ఉల్లిపాయలను అరకేజీ చొప్పున ప్రతి ఇంటికీ అందేలా సర్దారు. కేజీ ప్యాకెట్లుగా వచ్చిన నూనె, పప్పులను రెండు కుటుంబాలు సమంగా పంచుకునేలా ఏర్పాట్లు చేసి రేషన్ షాపుల వద్దనే పంపిణీ పూర్తి చేసుకున్నారు. ప్రభుత్వం తమ మధ్య చిచ్చుపెట్టి సగం మందికి ఎగనామం పెట్టాలని చూసినా, మత్స్యకార పెద్దల విజ్ఞతతో ఆకలి కేకలు లేకుండా అందరూ సమానంగా సాయాన్ని పంచుకున్నారు. అధికారులు ఇచ్చిన అరకొర సరుకులనే గ్రామంలోని కుటుంబాలన్నింటికీ సర్దిచెప్పిన తీరు స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికై నా నిబంధనల పేరిట కోతలు పెట్టకుండా తుఫాను బాధితులందరికీ పూర్తిస్థాయిలో నిత్యావసరాలు, నష్టపరిహారం అందించాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.
మురసు తుఫాన్ సాయంలో ‘బాబు’
సర్కారు మార్కు కోత
పాకల, ఊళ్లపాలెంలో 3,500
కుటుంబాలుంటే.. ఇచ్చింది 1,677 మందికే..
సగం మందికి ఎగనామం పెట్టి
చేతులు దులుపుకొన్న వైనం
కుల పెద్దల సూచనతో అరకొర సరుకులనే సమంగా పంచుకున్న బాధితులు


