దమ్ముంటే అసెంబ్లీకి రా.. చంద్రబాబుకు పార్థసారథి సవాల్‌

YSRCP MLA Kolusu Parthasarathy Comments On Chandrababu - Sakshi

సాక్షి, తాడేపల్లి: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం టీడీపీకి ఇష్టం లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బలహీనవర్గాలకు చోటులేని రాజధాని ఎవరిక కోసం అంటూ ప్రశ్నించారు. టీడీపీ హయాంలో అమరావతిలోని 29 గ్రామాలకు ఏం మేలు జరిగింది?. చంద్రబాబుకు దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలని పార్థసారథి సవాల్‌ విసిరారు.
చదవండి: ‘ఇదేం పాలసీ.. నువ్వు రావు కానీ.. నీ ఎమ్మెల్యేలు వస్తారా..?’ 

‘‘చంద్రబాబుకి సీఎం జగన్ పాలన చూసి దిక్కు తోచడం లేదు. తమకు త్వరలో రాజకీయ సమాధి తప్పదని తెలిసి విద్వేష పూరిత రాజకీయాలు చేస్తున్నారు. కులాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నాడు. భవిష్యత్తులో ఎప్పుడూ ప్రాంతీయ విద్వేషాలు రాకూడదని సీఎం జగన్‌ ఆలోచించారు. అమరావతి ఏర్పాటు చేయాలంటే లక్షన్నర కోట్లు కావాలి. ఇతర ప్రాంతాల అభివృద్ధిని తాకట్టు పెట్టే అమరావతి నిర్మాణం సాధ్యమా?’’ అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.

‘‘విజయవాడ, గుంటూరు వాసులకు ఇళ్ల స్థలాలు ఇస్తే ఎందుకు అడ్డుకున్నారు. సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అన్నప్పుడు ఈ మద్దతు పలుకుతున్న పార్టీలు ఏమయ్యాయి?. రాజధాని నిర్మాణం కోసం మీలా జోలె పట్టుకుని అడుక్కునే దౌర్భాగ్య స్థితికి ఈ ప్రభుత్వం వెళ్లదు. ఇది చంద్రబాబు స్వార్థం కోసం ప్లాన్ చేసిన రాజధాని మాత్రమే. తనకు కావాల్సిన రియల్టర్స్ కోసం ఏర్పాటు చేసిన రాజధాని అది. మీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ఈ అంశాలన్నీ చర్చించండి. పారిపోయి బయట విద్వేష పూరిత రాజకీయాలు తగదు’’ అంటూ పార్థసారథి దుయ్యబట్టారు.

‘‘మీరు పాదయాత్ర రాయలసీమ, ఉత్తరాంధ్ర వారికి వ్యతిరేకంగా చేస్తున్నారా.?. నిజంగా మీకు ప్రజల నుంచి స్పందన ఉంటే మీరు బౌన్సర్‌లను పెట్టుకుని చేయాల్సిన కర్మ ఏమిటి?. మా పార్టీ లక్ష్యం అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి. మీరు స్నేహం చేసిన బీజేపీ మేనిఫెస్టో కూడా కర్నూలు హైకోర్టు అని పెట్టారు. రాజధానిలో పేదలకు కూడా స్థానం ఉందని సీఆర్‌డీఏ చట్టాన్ని కూడా మార్పు చేసిన వ్యక్తి సీఎం జగన్‌’’ అని పార్థసారథి అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top