
తాడేపల్లి : ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజమెత్తారు. ఇది నిజంగా కూటమి ప్రభుత్వం సిగ్గు పడాల్సిన అంశమని మండిపడ్డారు. ఈరోజు(గురువారం, సెప్టెంబర్ 25వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన శైలజానాథ్.. ‘చంద్రబాబు ప్రభుత్వంలో విద్య, వైద్య రంగాలు పూర్తిగా నాశనం అయ్యాయి. ఆ రెండు రంగాలనూ తమ గుప్పెట్లో పెట్టుకుని పేదలను పీల్చి పిప్పి చేస్తున్నారు.
గిరిజనులకు మెరుగైన వైద్యం కోసం జగన్ పాడేరులో మెడికల్ కాలేజీ పెట్టారు. అలాంటి కాలేజీని కూడా అడవి బిడ్డలకు దూరం చేస్తున్నారు. అదేమని అడిగితే చట్టసభలోనే లోకేష్ పీకుడు భాష మాట్లాడుతున్నారు. ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి మెడికల్ కాలేజీలు వెళ్లిపోతే పేద, మధ్య తరగతి ప్రజలు బతికేది ఎలా?, జగన్ సీఎం అయ్యాక మెడికల్ కాలేజీలను మళ్ళీ ప్రభుత్వపరం చేస్తాం.
మంత్రి సత్యకుమార్ అసత్యాలు మాట్లాడుతున్నారు. ఆయన రాష్ట్ర మంత్రిగా కాకుండా బీజేపీ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. లోకేష్ నోరు తెరిస్తే పీకుడు భాష తప్ప మరేమీ మాట్లాడటం లేదు. బూతు మాటలు మానేసి మంచి మాటలు నేర్చుకుంటే మంచిది. చంద్రబాబు తనవారికి మెడికల్ కాలేజీలను దోచి పెడుతున్నారు. దీన్ని రాష్ట్ర ప్రజలు సహించే పరిస్థితి లేదు’ అని స్పష్టం చేశారు.
