బిల్డప్‌ బాబు వేషాలెన్నో: వైఎస్‌ జగన్‌ | YS Jagan Tweet On Chandrababu Fraud Over Launching Sea Plane, Check Tweet Inside | Sakshi
Sakshi News home page

బిల్డప్‌ బాబు వేషాలెన్నో: వైఎస్‌ జగన్‌

Nov 10 2024 7:58 PM | Updated on Nov 11 2024 11:01 AM

Ys Jagan Tweet On Chandrababu Fraud

చంద్రబాబు మోసాలను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్స్‌ వేదికగా ఎండగట్టారు.

చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్‌పై వైఎస్‌ జగన్‌ ఫైర్‌

మాయ చేయడం, మభ్యపెట్టడం, మోసం చేయడం చంద్రబాబు నైజం

చంద్రబాబు బిల్డప్‌.. ఎల్లో మీడియా డప్పాలు..

సీప్లేన్‌ పర్యటన కూడా చంద్రబాబు వేషాల్లో ఒకటి

ఎన్ని వేషాలు వేయాలో​ అన్ని వేషాలు వేస్తాడు
 

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు మోసాలను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్స్‌ వేదికగా ఎండగట్టారు. చంద్రబాబు గురించి చెప్పాలంటే, మాయ చేస్తాడు, మభ్యపెడతాడు, చివరకు ప్రజలను మోసం చేస్తాడు. దీనికోసం ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలూ వేస్తాడంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

‘‘తాజాగా విజయవాడ నుంచి శ్రీశైలం వరకూ సీ-ప్లేన్‌ ద్వారా చేసిన పర్యటన ఇలాంటిదే. సెల్‌ఫోన్‌ తానే కనిపెట్టానని, కంప్యూటర్లు కూడా తానే కనిపెట్టానని రెండు దశాబ్దాలుగా కబుర్లు చెప్తున్న చంద్రబాబు.. ఇప్పుడు సీ-ప్లేన్‌ మీద కూడా కహానీలు మొదలెట్టేశారు. దేశంలోనే తొలిసారి అన్నట్టుగా, మరెక్కడా లేనట్టుగా, సీ-ప్లేన్‌ నడిపితే చాలు రాష్ట్రాభివృద్ధి జరిగిపోయినట్టుగా బిల్డప్‌ ఇస్తున్నారు. చంద్రబాబు బిల్డప్‌, ఎల్లోమీడియా డప్పాలు చూస్తుంటే పిట్టలదొర డైలాగులు గుర్తుకు వస్తున్నాయి.’’ అంటూ వైఎస్‌ జగన్‌ చురకలు అంటించారు.

‘‘ఓ వైపు వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ప్రజల సంపదగా నిర్మిస్తూ సృష్టించిన మెడికల్‌ కాలేజీలు, పోర్టులను ప్రైవేటుపరం చేస్తూ, స్కాంలు చేస్తూ తన మనుషులకు తెగనమ్ముతూ, మరోవైపు దీనిమీద ప్రజల్లో చర్చ జరగకూడదనే సీ-ప్లేన్‌తో అభివృద్ధి ఏదో జరిగిపోయినట్టుగా పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారు’’ అని ఆయన దుయ్యబట్టారు. 

సీ-ప్లేన్‌ అన్నది ఇప్పటిది కాదు. దాదాపు 114 ఏళ్ల క్రితమే 1910లో నడిచింది. మన దేశంలో కేరళలో 2013లో మొదలయ్యి తర్వాత నిలిపేశారు. గుజరాత్‌లో 2020లో సర్వీసులు నడవటం మొదలుపెట్టినా అవికూడా పలుమార్లు నిలిచిపోయాయి. ప్రతిరాష్ట్రంలోనూ అనేక రిజర్వాయర్లు, డ్యాంలు ఉన్నాయి. మరి ఎందుకు ఆయా రాష్ట్రాల్లో ఇలాంటి ప్రయోగాలు కొనసాగడం లేదు?

..ఆపరేషన్స్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సాంకేతిక సమస్యలు, ప్రయాణికుల భద్రతాపరమైన అంశాలతోపాటు నిర్వహణా భారం దీనికి ప్రధాన కారణాలని అనేక మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. ఇలాంటి 14 మంది ప్రయాణికుల సీ-ప్లేన్‌ సర్వీసులను అభివృద్ధికి ఒక ప్రమాణంగా చంద్రబాబు  గొప్పగా చెప్పుకోవడం, దాన్ని ఎల్లోమీడియా కీర్తించడం, పరస్పరం డప్పాలు కొట్టుకోవడం కాదా?

..సంపద సృష్టించడమంటే ప్రభుత్వ రంగంలో పోర్టులు నిర్మించి తద్వారా అభివృద్ధి చేసి ప్రభుత్వానికి ఆదాయం కల్పించడం, ప్రభుత్వరంగంలో మెడికల్‌ కాలేజీలు కట్టి ప్రజలకు అందుబాటులోకి ఉచితంగా నాణ్యమైన, అత్యాధునిక వైద్యాన్ని అందించడం లాంటి కార్యక్రమాలు చంద్రబాబూ? సీ-ప్లేన్‌మీద పబ్లిసిటీ స్టంట్లు కావు. చంద్రబాబూ.. రూ.8,480 కోట్లతో ప్రభుత్వ రంగంలో, మారుమూల ప్రాంతాల్లో అత్యాధునిక వైద్యాన్ని అందుబాటులోకి తెస్తూ, తద్వారా మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రిని తీసుకొస్తూ, కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు కట్టడం సంపద సృష్టి అవుతుందా? లేక వాటిని ప్రయివేటు పరం పేరుతో మీ మనుషులకు స్కామ్‌లు చేస్తూ అమ్మాలనుకోవడం సంపద సృష్టి అవుతుందా?

 ఇదీ చదవండి: వ్యవస్థీకృత నేర రాజకీయాల్లో చంద్రబాబు బరితెగింపు: వైఎస్‌ జగన్‌

..సుదీర్ఘ తీర ప్రాంతాన్ని వినియోగించుకుని మెరుగైన వాణిజ్యాన్ని, రాష్ట్రానికి అదనపు ఆదాయాన్ని, ప్రజలకు ఉపాధిని, పారిశ్రామిక ప్రగతిని సాధించడానికి ప్రభుత్వ రంగంలో రూ.4,361.91కోట్లతో మూలపేట,  రూ.5,156 కోట్లతో మచిలీపట్నం, రూ.3,736.14 కోట్లతో రామాయపట్నంల వద్ద 3 పోర్టులను రూ.13,254.05 కోట్లతో నిర్మిస్తే దాన్ని అభివృద్ధి, సంపద సృష్టి అంటారా? లేక సీ-ప్లేన్‌లో తిరిగి ఈ పోర్టు ఆస్తులను, మీ వారికి స్కామ్‌ల ద్వారా తెగనమ్మితే దాన్ని అభివృద్ధి, సంపద సృష్టి అంటారా? ప్రభుత్వరంగ పోర్టులవల్ల రాష్ట్రానికి ఆదాయాలు పెరుగుతాయా? లేక ఈ సంపద సృష్టించే వనరులను తెగనమ్మి, సీ-ప్లేన్స్‌ వల్ల రాష్ట్రానికి సంపద పెరుగుతుందా?

..ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, పోర్టుల రూపేణా మొత్తంగా రూ.21,734కోట్ల పబ్లిక్‌ ఇన్వెస్టిమెంట్‌ ప్రజల ఆస్తికాదా? ప్రజలకోసం సృష్టించిన సంపద కాదా చంద్రబాబూ? రాష్ట్రచరిత్రలో ప్రభుత్వరంగంలో ఇన్ని పెట్టుబడులు ఎప్పుడైనా పెట్టారా? మా హయాంలో నిర్మాణాలు జరుపుకున్న కాలేజీలు, పోర్టులన్నీకూడా ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఇవాళ రాష్ట్ర ప్రజల కళ్లముందు లేవా? ఇవన్నీ వైయస్సార్‌సీపీ ప్రభుత్వం సృష్టించిన సంపద కాదా? ఈ ఆస్తులు విలువ భవిష్యత్తులో లక్షల కోట్లు కాదా? ఇదంతా అభివృద్ధి కాదా?

..కాని చంద్రబాబు.. మీరు, మీ పార్టీ నాయకుల అభివృద్ధే రాష్ట్రాభివృద్ధిగా, మీరు, మీమనుషులు ఆస్తులు కూడబెడితే అది ప్రజలకోసం సృష్టించిన సంపదగా చెప్పుకుంటారు. మీ దృష్టిలో అభివృద్ధి, సంపద సృష్టి అంటే ఇదే. మీ పబ్లిసిటీ విన్యాసాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం రంగంలో మంచి స్కూల్స్‌ లేకుండా చేసి, మంచి వైద్యాన్ని అందించే మెడికల్‌ కాలేజీలు లేకుండా చేసి, మంచి పోర్టులు లేకుండా చేసి, చివరకు ప్రజల ఆస్తులను వారికి కాకుండా చేసే దుర్మార్గపు చర్యలను ప్రజలు తప్పక నిలదీస్తారు, ఈ ప్రభుత్వాన్ని ఎండగడతారు.’’  అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement