మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ మానుకోండి: వైఎస్‌ జగన్‌ | YS Jagan Says Avoid privatization of medical colleges | Sakshi
Sakshi News home page

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ మానుకోండి: వైఎస్‌ జగన్‌

Sep 16 2024 5:10 AM | Updated on Sep 16 2024 8:59 AM

YS Jagan Says Avoid privatization of medical colleges

సీఎం చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ హెచ్చరిక

ఆ మాటున స్కామ్‌లు చేయడం విరమించుకోకపోతే ప్రజాగ్రహం తప్పదు

పాడేరు కాలేజీని 50 సీట్లకే పరిమితం చేయడమేమిటి?..

పులివెందుల కాలేజీకి 50 సీట్లు మంజూరు చేస్తే వద్దనడం ఏంటి? 

తక్షణమే ఎన్‌ఎంసీకి రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలి 

ఇబ్బందులు లేకుండా మేము సీట్లు భర్తీ చేస్తే నాడు రాద్ధాంతం 

అధికారంలోకి వస్తే మొత్తం సీట్లన్నీ ఫ్రీ అన్నారు 

తీరా గద్దెనెక్కాక ఏకంగా కాలేజీలనే అమ్మేస్తున్నారు 

ఇది ఏరు దాటాక తెప్ప తగలేయడం కాదా?  

ప్రభుత్వ వైద్యం బావుంటేనే ప్రైవేట్‌లో రేట్లు తక్కువుంటాయి 

పేదలకు ఉచితంగా మంచి వైద్యం అందకూడదా?

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఎంబీబీఎస్‌ సీట్లు వస్తుంటే సంతోషించాల్సింది పోయి.. అవసరం లేదంటూ చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం చాలా దారుణమని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసే బృహత్తర యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తన చేతులతో తానే భంగం కలిగించడం అత్యంత హేయం, దుర్మార్గమని మండిపడ్డారు. 

పక్క రాష్ట్రాలు కొత్త మెడికల్‌ కాలేజీలు, ఎంబీబీఎస్‌ సీట్ల కోసం ప్రదక్షిణలు చేస్తున్న పరిస్థితుల్లో మన రాష్ట్రానికి వచ్చిన సీట్లను తిప్పి పంపడం ఏ తరహా పరిపాలనకు నిదర్శనం అని చంద్రబాబును నిలదీశారు. ‘ఇకనైనా కళ్లు తెరవండి.. వెంటనే ఎన్‌ఎంసీకి రాసిన లేఖను వెనక్కు తీసుకోండి. ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోండి’ అని హితవు పలికారు. మెడికల్‌ కాలేజీల్లో మిగిలిన పనులను పూర్తి చేసి, పేద పిల్లలకు వైద్య విద్యను, పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. 

‘మీకు చేతనైనంత మీరు ఖర్చు చేస్తూ వెళ్లండి.. మీకు చేతకాకపోతే మళ్లీ మేం వచ్చిన తర్వాత అయినా పూర్తి చేస్తాం. అంతేకానీ ఇలా మెడికల్‌ కాలేజీల ప్రైవేటుపరం మాటున స్కామ్‌లు చేయడం మానుకోండి. లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని గుర్తించుకోండి’ అని చంద్రబాబును హెచ్చరించారు. మెడికల్‌ కాలేజీల వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వ తీరును తూర్పారపడుతూ ఆదివారం ‘ఎక్స్‌’ వేదికగా వైఎస్‌ జగన్‌ పోస్ట్‌ చేశారు. అందులో ఇంకా ఏమన్నారంటే.. 

బాధ్యతల నుంచి తప్పించుకుంటే దాన్ని ప్రభుత్వం అంటారా?  
నాణ్యమైన విద్య, వైద్యాన్ని ప్రజలకు ఒక హక్కుగా అందించడం అన్నది ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. తమ పిల్లలకు మంచి విద్యను అందించడానికి, మంచి వైద్యం అందుకోవడానికి ఏ కుటుంబం కూడా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకూడదు. ఈ బాధ్యతల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా తప్పించుకుంటుంది చంద్రబాబూ? అలా తప్పించుకుంటే, దాన్ని ప్రభుత్వం అని అంటారా?  

⇒ దీన్ని గుర్తించే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చాం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్‌ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతో రూ.8,480 కోట్లతో 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణాలను ప్రారంభించాం. దీని వల్ల ప్రభుత్వానికి ఏ రకంగా నష్టం వస్తుంది? 2023–24 సంవత్సరాల్లో ఐదు కాలేజీల్లో తరగతులు ప్రారంభం కావడం నిజం కాదంటారా? తద్వారా 750 ఎంబీబీఎస్‌ సీట్లు అదనంగా రాష్ట్రానికి రాలేదంటారా? చాలా మంది పేద పిల్లలు సీట్లు సాధించి డాక్టర్‌ చదువులు చదవడం లేదా?  

⇒ నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం వెళ్తే ఈ ఏడాదిలో మరో ఐదు కాలేజీలు.. మదనపల్లె, పులివెందుల, ఆదోని, మార్కాపురం, పాడేరుల్లో మరో 750 సీట్లు అందుబాటులోకి వచ్చేవి. విద్యార్థులు డాక్టర్లయ్యే అవకాశం ఉండేది. ఇప్పుడు పాడేరు కాలేజీని 50 సీట్లకే పరిమితం చేయడం ఏంటి? పులివెందుల కాలేజీకి ఎన్‌ఎంసీ 50 సీట్లు మంజూరు చేస్తే, వద్దంటూ లేఖ రాయడం ఏంటి? మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌ పరంచేసే స్కామ్‌లకు ఆలోచన చేయడం ఏంటి? 

ప్రైవేటు మీద అంతమోజు ఎందుకు? 
⇒ కోవిడ్‌ లాంటి సంక్షోభం ఉన్నప్పటికీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మెడికల్‌ కాలేజీల నిర్మాణాల కోసం రూ.2403 కోట్లు ఖర్చు చేసి, ఐదు కాలేజీల్లో క్లాసులు మొదలుపెట్టి, మరో ఐదు కాలేజీలను ఈ ఏడాది నుంచే బోధనకు సిద్ధం చేశాం. మీ ప్రభుత్వం కూడా క్రమంగా ఖర్చు చేసుకుంటూ వెళ్తే మిగిలిన కాలేజీలు కూడా అందుబాటులోకి వస్తాయన్నది వాస్తవం కాదా?  
⇒ ఇలా చేయకుండా భారం అంటూ చేతులు దులిపేసుకుని ప్రజారోగ్య సంస్థలను అమ్మేస్తారా? ప్రైవేటు మీద మీకు అంత మోజు ఎందుకు? ప్రభుత్వ సంస్థలంటే అంత అసహ్యం ఎందుకు? 



కోవిడ్‌లో ఆదుకున్నది ప్రజారోగ్య రంగమే 
⇒ కొత్త మెడికల్‌ కాలేజీల నిర్వహణలో ఇబ్బందులు రాకూడదు, అదే సమయంలో పేద విద్యార్థులకు నష్టం కలగ కూడదన్న విధానంలో మేం సీట్లను భర్తీ చేస్తే, ఎన్నికల్లో ఓట్ల కోసం నానా రాద్ధాంతం చేశారు. అధికారంలోకి వస్తే మొత్తం సీట్లన్నీ ఫ్రీ అన్నారు. సీట్ల సంగతి దేవుడెరుగు.. ఇప్పుడు ఏకంగా కాలేజీలనే అమ్మేస్తున్నారు. ఇది ఏరు దాటాక తెప్ప తగలేయడం కాదంటారా? మోసం చేయడమే మీ నైజమని మరోసారి బయట పడ్డారు.  

⇒ పార్లమెంటు నియోజకవర్గానికో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఉంటే, అది ఆ నియోజకవర్గంలో ఉన్న ఏరియా ఆస్పత్రులకు, సీహెచ్‌సీలకు, పీహెచ్‌సీలకు, విలేజ్‌ క్లినిక్స్‌కు మార్గదర్శిగా ఉంటుంది. ఆ జిల్లా స్థాయిలో సూపర్‌ స్పెషాల్టీ సేవలు కూడా పేదలకు ఉచితంగా అక్కడే లభిస్తాయి. అలాంటి కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే ముందుగా నష్టపోయేది పేద విద్యార్థులే కాదు, అక్కడి ప్రజలు కూడా. వారికి నాణ్యమైన వైద్యం అందదు సరికదా.. ప్రైవేటు ఆస్పత్రుల మధ్య పోటీ లోపించి వైద్యం కోసం వసూలు చేసే ఫీజులు ఆకాశాన్ని అంటుతాయి. 

⇒ ఎప్పుడైనా ప్రైవేటుకు గవర్నమెంటు పోటీగా ఉంటేనే, రేట్లు రీజనబుల్‌గా ఉంటాయి. కాలేజీలను ప్రైవేటీకరించాలన్న మీ విధానం అందరినీ దెబ్బ తీస్తుందనడం వాస్తవం కాదా? అటు ప్రజలను, ఇటు పిల్లలను కోవిడ్‌ లాంటి మహమ్మారి సమయంలో ఆదుకున్నది ప్రజారోగ్య రంగమే అని గుర్తించకపోతే ఎలా చంద్రబాబూ? పేదలకు ఉచితంగా మంచి వైద్యం అందకూడదన్నదే మీ విధానమని తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement