
సాక్షి, తాడేపల్లి: కూటమి పాలన ఎలా ఉందో ప్రజలకు తెలుసని.. వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టే వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని వైస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) హెచ్చరించారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతల సమావేశంలో కార్యకర్తల కోసం ఆయన డిజిటల్ బుక్ యాప్(YSRCP Digital Book)ను లాంచ్ చేశారు.
వైఎస్సార్‌సీపీ శ్రేణుల కోసం ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్ గురించి సమావేశం అనటతరం బయటకు వచ్చిన నేతలు వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టే వారి పేర్లను డిజిటల్ బుక్‌లో నమోదు చేసే వీలుందని తెలిపారు. ‘‘కార్యకర్తల కోసం డిజిటల్ బుక్‌ను వైఎస్ జగన్ లాంచ్ చేశారు. రెడ్‌బుక్ పేరుతో దాడులు, దౌర్జన్యాలు చేసేవారి పేర్లు అందులో నమోదు చేసే వీలుంది. రెడ్‌బుక్ బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని అందులో పేరొనవచ్చు. అధికారంలోకి వచ్చాక ఈ ఫిర్యాదులన్నింటిపై కచ్చితంగా విచారణ ఉంటుంది. అన్యాయం చేసిన వారు ఎక్కడున్న సరే.. తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టే చర్యలు ఉంటాయని జగన్ చెప్పారు’’ అని వివరించారు. అదే సమయంలో..


గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని వైఎస్ జగన్ పిలుపు ఇచ్చారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధంగా ఉందని నేతలు స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో చేస్తున్న ప్రతీకార రాజకీయాలపై గతంలోనూ వైఎస్ జగన్ తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేశారు. ‘‘కూటమి పాలనలో ఈరోజు ఇవన్నీ నాశనం అయిపోతున్నాయి. వ్యవస్థలను చంద్రబాబు నాశనం చేస్తున్నారు. ప్రజలను వెన్నుపోటు పొడిచారు. ఎవరూ ప్రశ్నించకూడదని భయానక పరిస్థితులను తీసుకు వచ్చారు. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఎవరైనా గొంతు విప్పితే వారిని అణచివేయాలని చూస్తున్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు. తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు సృష్టిస్తున్నారు..

గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. వైఎస్సార్‌సీపీలో పార్టీలో చురుగ్గా ఉన్న వ్యక్తులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రతి కార్యకర్త కష్టాన్నీ చూస్తున్నాను. అన్యాయం చేయాలనుకుంటే చేయమనండి. కొడతానంటే.. కొట్టమనండి. కాని, మీరు ఏ పుస్తకంలోనైనా పేర్లు రాసుకోండి. కాని, ఆ అన్యాయాలు చేసిన వారికి సినిమాలు చూపిస్తాం. రిటైర్డ్ అయిన వారినీ లాక్కుని వస్తాం. దేశం విడిచిపెట్టి వెళ్లినా సరే.. సప్త సముద్రాల అవతల ఉన్నా సరే రప్పిస్తాం. అన్యాయాలు చేసిన ఒక్కొక్కరికి సినిమాలు చూపిస్తాం’’ అంటూ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిజిటల్ బుక్ పేరిట ఇప్పుడు యాప్ విడుదల చేయడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు షాకిచ్చిన కూటమి సర్కార్