సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ దుర్భుద్ధితో మత విశ్వాసాలను ఎలా రెచ్చగొట్టారో సుప్రీంకోర్టు అర్థం చేసుకుందన్నారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. పొలిటికల్ డ్రామాలు చేయవద్దని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పిందని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ టీడీపీ ఇప్పటికీ అసత్య ప్రచారమే చేస్తుందని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై వైఎస్ జగన్ స్పందించారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు నిజ స్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపించింది. చంద్రబాబు రాజకీయ దుర్భుద్ధితో మత విశ్వాసాలను ఎలా రెచ్చిగొట్టారో సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది. పొలిటికల్ డ్రామాలు చేయవద్దని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పింది. జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారు చేసినట్టుగా చంద్రబాబు అసత్య ప్రచారం చేశారు. ఈ విషయంలో చంద్రబాబుకు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. చంద్రబాబు స్వయంగా వేసుకున్న సిట్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసిందన్నారు.
.. చంద్రబాబుకు దేవుడంటే భక్తి ఉంటే ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలి. చంద్రబాబుకు భయం, భక్తి రెండూ లేవు. ఆయనకు భయం, భక్తి ఉంటే.. ఇప్పటికైనా పశ్చాత్తాపం రావాలి. చెప్పిన అబద్దాన్నే మళ్లీ మళ్లీ చెబుతున్నారు. ఇప్పటికీ టీడీపీ ట్విట్టర్‌లో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కోర్టులు వారిని తప్పుబడితే సోషల్ మీడియాలో మాపై తప్పుడు ప్రచారానికి తెరలేపారు. లడ్డూ విషయంలో కల్తీ జరగలేదని టీటీడీ ఈవోనే చెప్పారు. చంద్రబాబు చెప్పింది తప్పు అని ఈవోనే అంటున్నారు. ఇప్పటికీ అసత్య ప్రచారమే చేస్తున్నారు. సుప్రీంకోర్టు అక్షింతలు వేసినా చంద్రబాబు తీరు మారలేదు. సిగ్గు లేకుండా చంద్రబాబు ప్రతీ విషయాన్ని వక్రీకరిస్తున్నారు. తిరుమల ప్రతిష్టను చంద్రబాబు అపవిత్రం చేశారని ఆరోపించారు.
.. లడ్డూ వివాదంలో జాతీయ మీడియా కూడా చంద్రబాబును తప్పు బట్టింది. శ్రీవారి లడ్డూ విశిష్టతను అపవిత్రం చేస్తూ చంద్రబాబు మాట్లాడారు. టీడీపీ హయాంలో 14 సార్లు ట్యాంకర్లను వెనక్కి పంపితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 18 సార్లు ట్యాంకర్లను తిరస్కరించాం. ఈ టెండర్లలో వచ్చిన వాళ్లకే కాంట్రాక్ట్‌లు ఇస్తారు. ప్రతీ నెయ్యి ట్యాంకర్ సర్టిఫికెట్ తీసుకుని రావాలి. నెయ్యి ట్యాంకర్లకు టీటీడీ మూడు టెస్టులు చేస్తుంది. టెస్టులు ఫెయిల్ అయితే ఆ ట్యాంకర్లను వెనక్కి పంపుతారు. ట్యాంకర్లను రిజెక్ట్ చేసినట్టు స్వయంగా ఈవోనే చెప్పారు. నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ మాత్రమే ఉందని ఈవోనే స్పష్టంగా వెల్లడించారు. చంద్రబాబు మాత్రం లడ్డూ ప్రతిష్టను దిగజార్చారు.
.. కల్తీ నెయ్యి ప్రసాదానికి వాడలేదని ఈవో మరోసారి చెప్పారు. ఈవో చెప్పినప్పటికీ చంద్రబాబు మళ్లీ అసత్య ప్రచారాలు చేశారు. భక్తుల మనోభావాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని కోర్టు చెప్పింది. రాజకీయ డ్రామాలు చేయవద్దని హెచ్చరించింది. చంద్రబాబు మంచి వ్యక్తి అయితే ఆధారాలను చూసి సిగ్గుపడాలి’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment