విశాఖలోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుడు మల్లికార్జునరావును పరామర్శిస్తున్న వైఎస్ జగన్
విశాఖ స్టీల్ ప్లాంటు ప్రమాద బాధిత కుటుంబాలకు మాజీ సీఎం వైఎస్ జగన్ ఓదార్పు
రూ.1.72 కోట్లు బాధితులకు హక్కుగా వచ్చేవే.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది సున్నా
ఇటువంటి సందర్భాల్లో మానవత్వం చూపాలి.. మీరు ఇవ్వని పక్షంలో మా ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే బాధితులకు పరిహారం అందిస్తాం
నాడు ఎల్జీ పాలిమర్స్ ప్రమాద సమయంలో దేశంలోనే లేనివిధంగా ఆదుకున్నాం
బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారంతో పాటు ఉద్యోగాలూ ఇచ్చాం
అదే తరహాలో ఇప్పుడూ ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం
ఈ దుర్ఘటనలో కార్మీకుల తప్పేమీ లేదు
లోకేశ్ మాటలు వింటే.. ఇటువంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపింది మేమే.. దీనిపై రెండుసార్లు లేఖలు
రాయడంతో పాటు ప్రధాని పాల్గొన్న సభలోనే నివేదించాం
ఏకంగా అసెంబ్లీలోనూ తీర్మానం కూడా చేసి కేంద్రానికి పంపాం.. స్టీల్‌ప్లాంట్‌పై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి
రూ.1.72 కోట్లు వాళ్లకు (బాధితులకు) హక్కుగా వచ్చేవే...! ఇక నువ్వు ఇచ్చేదేందయ్యా బోడి..! రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చింది సున్నా..
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. విశాఖ స్టీల్
ప్లాంట్‌కు కేంద్రం నుంచి రూ.11,440 కోట్ల ప్యాకేజీని సాధించామని చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రులు గొప్పగా చెప్పుకున్నారు. ఈ ప్యాకేజీని ఉద్యోగుల వీఆర్‌ఎస్ అమలు కోసం ఉపయోగించారు. జీఎస్టీ బకాయిల చెల్లింపు, బ్యాంకు రుణాలు తీర్చడం కోసం వాడారు. అంతే తప్ప స్టీల్ ప్లాంటు నిర్వహణ కోసం గానీ.. ఉద్యోగుల బాగోగుల కోసం గానీ... ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాల పెంపు కోసం గానీ ఉపయోగించలేదు.
– వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబానికి కోటి రూపాయల చొప్పున నష్ట పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు కూడా ఇచ్చి మానవత్వం చూపాలని సీఎం చంద్రబాబుకు సూచించారు. ఒకవేళ చంద్రబాబు నష్టపరిహారాన్ని ఇవ్వకుంటే... దేవుడి దయతో మళ్లీ తమ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే బాధిత కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్ట పరిహారాన్ని అందజేస్తామని ప్రకటించారు. ఈ ప్రమాదంలో కార్మికుల వైపు నుంచి ఎటువంటి తప్పు లేదని.. ఇటువంటి సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని హితవు పలికారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కార్మికులతో పాటు బాధిత కుటుంబాలను వైఎస్ జగన్ బుధవారం పరామర్శించారు. తాడేపల్లి నుంచి నేరుగా విశాఖ చేరుకున్న వైఎస్ జగన్ తొలుత సెవెన్ హిల్స్ ఆస్పత్రి వద్దకు వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
వైఎస్సార్ సీపీ హయాంలో ఎల్జీ పాలిమర్స్‌లో దుర్ఘటన జరిగిన వెంటనే నాడు సీఎంగా ఉన్న తాను స్వయంగా వచ్చి దేశ చరిత్రలోనూ ఎన్నడూ లేని విధంగా బాధిత కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం అందజేయడంతో పాటు కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించామని గుర్తు చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. బాధిత కుటుంబాలకు వారి హక్కుగా వచ్చే మొత్తాన్ని.. ఈ ప్రభుత్వం ఏదో అదనంగా ఇస్తున్నట్లు ప్రకటించడం ధర్మమేనా? అని నిలదీశారు. బాధిత కుటుంబాలను పరామర్శిస్తామంటూ వచ్చిన లోకేశ్ మాట్లాడిన మాటలు వింటుంటే ఇటువంటి మనుషులు కూడా ఉంటారా? అని అనిపించిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించవద్దని కేంద్రాన్ని గట్టిగా కోరుతూ వైఎస్సార్ సీపీ హయాంలో రెండుసార్లు లేఖలు రాయడంతో పాటు ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కూడా కేంద్రానికి పంపామని గుర్తు చేశారు. తమ పోరాటం వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిచిపోయిందన్నారు. ఇప్పుడు కూడా అదే తరహాలో స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన తర్వాత మీడియాతో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే...
మీడియాతో మాట్లాడుతున్న మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
మానవత్వం ఉంటే మంచి చేయండి...
విశాఖ స్టీల్ ప్లాంట్ స్టీల్ మెల్టింగ్ వర్క్‌షాప్‌లో జరిగిన ప్రమాదంలో ఇప్పటికే 9 మంది చనిపోయారు. వేర్వేరు ఆస్పత్రుల్లో మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరి పరిస్థితి చాలా విషమంగా ఉంది. దాదాపు 95 శాతం కాలిన గాయాలతో ఇంకా ఒక అన్న చికిత్స పొందుతున్నారు. ఇలాంటి తరుణంలో మాట్లాడాల్సి వస్తోంది. ఇవాళ కొన్ని ప్రశ్నలు సూటిగా అడుగుతున్నా. మానవత్వం ఏ మాత్రం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి మంచి చేయండి. స్టీల్ ప్లాంట్‌లో కార్మికులు ఎలా బతుకుతున్నారు? వారి పరిస్థితి ఎలా ఉంది? అనేది అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2024 వరకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కార్మికులు ఎలా ఉన్నారు? ఇప్పుడు వారి పరిస్థితి టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఎలా ఉంది? అన్నది బేరీజు వేసుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదం అత్యంత బాధాకరం. ఈ ఘటనలో ఉద్యోగులు, కార్మికుల తప్పిదం ఏమాత్రం లేదు. లిక్విడ్ మెటల్ పొంగి బ్లాస్ట్ అయింది. అలా ఎందుకు జరిగిందంటే.. మిక్స్ సరిగ్గా చేయకపోవడం, రా మెటీరియల్ సరిగ్గా కలపకపోవడం, రా మెటీరియల్‌లో నాణ్యత లోపించడం కారణం. ఈ ప్రమాదంలో ఎక్కడా ఉద్యోగుల తప్పిదం లేదు. ఇలాంటి ఘటనల్లో మానవత్వం చూపించాల్సిన చోట... రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్పందిస్తున్న తీరు మానవీయంగా లేదు. ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. 
కిమ్స్ హాస్పిటల్ వద్ద ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్
రెండేళ్లల్లో 10 వేల మందికి పైగా తొలగింపు..
మా ప్రభుత్వ హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌లో రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగులు కలిపి 28 వేల మంది పని చేయగా... ఈ రెండేళ్లలో ఏకంగా 10,500 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. 6,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించారు. వీఆర్‌ఎస్ ప్రకటించి బలవంతంగా 1,800 మందిపై ఒత్తిడి తెచ్చి తప్పించారు. మరో 2,500 మంది పదవీ విరమణ చేశారు. దీంతో ఈ రోజు సంస్థలో కేవలం 16 వేల మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. ఈ 16 వేల మంది ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది.
దేశంలోనే మొదటిసారి...
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇప్పుడు ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. వారికి నాలుగున్నర నెలల జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. దేశంలో ఎక్కడా జరగని విధంగా తొలిసారిగా ఉద్యోగస్తుల జీతాలను ప్రొడక్షన్‌తో లింక్ పెట్టారు. అంటే ఉత్పత్తి ఆ స్థాయిలో ఉంటేనే జీతాలు... లేకపోతే లేదు అన్న నిబంధన ఈ రెండేళ్లల్లోనే వి«ధించారు. దేశంలో ఎక్కడా, ఏ సంస్థలో ఇలాంటి విధానం లేదు. ఉద్యోగుల క్వార్టర్లకు (నివాస గృహాలు) వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో యూనిట్ విద్యుత్తుకు కేవలం 50 పైసలు మాత్రమే వసూలు చేసేవారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత రెండేళ్లల్లో కరెంటు బిల్లు యూనిట్‌కు ఏకంగా రూ.8.50కి పెంచారు. ఆ విధంగా వారిపై ఒత్తిడి తెచ్చి క్వార్టర్లు ఖాళీ చేయించే కుట్ర చేశారు. ఉద్యోగులకు ఈ రెండేళ్లలో ఇప్పటి వరకు.. నో బోనస్... నో మెడికల్ ఫెసిలిటీస్... నో హెచ్‌ఆర్‌ఏ... నో ఎల్‌టీసీ... నో లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్... నో ఇన్సెంటివ్స్...! ఈ మాదిరిగా ఉద్యోగులు దారుణ పరిస్థితుల్లో పని చేస్తున్నారు.
ఆ ప్యాకేజీ.. వీఆర్‌ఎస్, జీఎస్టీ బకాయిల కోసమే
ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం నుంచి రూ.11,440 కోట్ల ప్యాకేజీని సాధించామని చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రులు గొప్పగా చెప్పుకున్నారు. ఈ ప్యాకేజీని కేవలం ఉద్యోగులకు వీఆర్‌ఎస్ అమలు కోసం ఉపయోగించారు. అదేవిధంగా జీఎస్టీ బకాయిల చెల్లింపు, బ్యాంకు రుణాలు తీర్చడం కోసం వాడారు. అంతే తప్ప స్టీల్ ప్లాంటు నిర్వహణ కోసం గానీ.. ఉద్యోగుల బాగోగుల కోసం గానీ... ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాల పెంపు కోసం గానీ ఉపయోగించలేదు.
ఏడాదైనా ఉద్యోగం ఇవ్వలేదు..
బాధితుల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం మానవీయంగా లేదు. నా పక్కనే.. భాగ్యశ్రీ అనే బాధితురాలు ఉంది. ఆమె తండ్రి పేరు పెంటయ్య. 14 నెలల క్రితం ఇక్కడే, ఇదే సంస్థలో ఈ మాదిరిగానే ప్రమాదం జరిగి పెంటయ్యన్న చనిపోయాడు. పెంటయ్యన్న ఎంప్లాయి నెంబరు 124185. ఆయన పర్మినెంట్ ఉద్యోగి. ఎస్‌ఎంఎస్–2లో మాస్టర్ టెక్నీషియన్‌గా (ఐడీ కార్డు చూపించారు) పని చేసేవారు. 2025 ఏప్రిల్ 1న ప్రమాదంలో ఆయన చనిపోయాడు. ఆయనకు కుమార్తె భాగ్యశ్రీతోపాటు ఇద్దరు కుమారులు నవీన్, ప్రసాద్ ఉన్నారు. వారి తండ్రి చనిపోయినప్పుడు పిల్లలు ఇద్దరికి నెలలోనే ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ ఆ ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా చివరకు పరిహారం కూడా చెల్లించలేదు. ఇంకా దారుణంగా.. ఆ ఫైల్ పోయిందని అంటున్నారు. ఇంత నిర్దయగా ప్రభుత్వాలు వ్యవహరించడం ధర్మమేనా? అని అడుగుతున్నా. 
విశాఖపట్నంలోని కిమ్స్ హాస్పిటల్ వద్ద ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్
మీరిచ్చేదేమిటి... ‘బోడి’!
ప్రమాద బాధితులకు పరిహారం విషయంలో చంద్రబాబు సుపుత్రుడు లోకేశ్ మాటలు చూస్తుంటే ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? అనిపించింది. ప్రమాదంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు మొత్తం రూ.1.72 కోట్లు ఇస్తామని ఆయన చెబుతున్నాడు. ఇది ఉద్యోగులకు హక్కుగా రావాల్సిందే కదా...! అదనంగా నీవు ఏమిస్తున్నావని అడుగుతున్నా! ఉద్యోగులకు రావాల్సిన గ్రూప్ ఇన్సూరెన్‌న్స్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, రిస్క్ ఇన్సూరెన్స్... అన్నీ కలిపి రూ.1.45 కోట్లు వస్తాయి. మరోవైపు సంస్థ తన వంతుగా రూ.25 లక్షలు ఇస్తుంది. ఇంకా ప్రధాని సహాయనిధి నుంచి రూ.2 లక్షల చొప్పున వస్తుంది. ఇవన్నీ కలిపి రూ.1.72 కోట్లు అవుతున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సున్నా. మరి నువ్విచ్చేది ఏంది ‘బోడి’ అని అడుగుతున్నా. ఇది ధర్మమేనా? న్యాయమేనా?
మా ప్రభుత్వం వచ్చాక నెల రోజుల్లోనే..
ఇకనైనా ఈ ప్రభుత్వం మానవత్వం చూపి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నాం. ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం కనుక ఇప్పుడు ఆ సహాయం చేయకపోతే.. బాధ పడకండి. కొంచెం ఓపిక పట్టండి. మా ప్రభుత్వం ఏర్పడగానే నెలలోపు ఆ సహాయం చేస్తాం. కోటి రూపాయలు చొప్పున పరిహారం ప్రతీ బాధిత కుటుంబానికి అందజేస్తాం. మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, ఎంపీలు గొల్ల బాబూరావు, తనూజారాణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, ధర్మాన కృష్ణదాస్, పుష్ప శ్రీవాణి, మాజీ మంత్రులు అమర్‌నాథ్, పేర్ని నాని, బాలరాజు, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, తలశిల రఘురాం, కుంభా రవిబాబు, పాలవలస విక్రాంత్, విశాఖ, విజయనగరం, అనకాపల్లి జిల్లాల పార్టీ అధ్యక్షులు కేకే రాజు, చిన్న శ్రీను, బొడ్డేటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, తిప్పల నాగిరెడ్డి, గణేష్, కంబాల జోగులు, అదీప్‌రాజ్, కరణం ధర్మశ్రీ, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, సమన్వయకర్తలు దేవన్‌రెడ్డి, మొల్లి అప్పారావు, మలసాల భరత్‌కుమార్, చింతాడ రవికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపింది మేమే...
అప్పట్లో ఇదే ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రస్తావన వస్తే మా ప్రభుత్వం గట్టిగా ఆపింది. ఆ మేరకు 2021 ఫిబ్రవరి 6న ప్రధానికి ఒక లేఖ రాశాం. ఏ రకంగా చేసి ఈ ప్లాంట్‌ను నిలబెట్టాలో అందులో చాలా వివరంగా ప్రస్తావించాం. అనంతరం నెల రోజుల తర్వాత 2021 మార్చి 9న మరో లేఖ (లేఖ ప్రతులను మీడియాకు చూపించారు) రాశాం. అలా మొత్తం రెండు లేఖలు రాశాం. ఆ తర్వాత 2021 మే నెలలో ఏకంగా అసెంబ్లీలో తీర్మానం (అసెంబ్లీ తీర్మానం మినిట్స్ కాపీని ప్రదర్శించారు) కూడా చేశాం. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం అన్యాయమని చెప్పాం. ఏ విధంగా మార్పుచేర్పులు చేస్తే స్టీలు ప్లాంట్‌ను గొప్పగా నిలబెట్టవచ్చో వివరిస్తూ సలహాలు కూడా ఇచ్చాం. ఈ మేరకు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి అన్ని వివరాలతో కేంద్రానికి పంపాం. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని, ప్రైవేటు చేతుల్లో మేనేజ్‌మెంట్‌ను పెట్టాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గట్టిగా కోరాం. ఏ చర్యలు తీసుకుంటే స్టీల్ ప్లాంట్ లాభాల బాట పడుతుందనే విషయాన్ని కూడా పేర్కొంటూ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేశాం. అలా సంస్థను, ఉద్యోగులను కాపాడగలిగాం. అంతేకాకుండా 2022 నవంబరు 12న ప్రధాని విశాఖ వచ్చినప్పుడు జరిగిన సభలో.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని ఆ సభలోనే ప్రధానిని కోరాం. మా పార్టీ అంత గట్టిగా నిలబడింది కాబట్టి, ఉద్యోగులకు తోడుగా నిలబడింది కాబట్టే సంస్థ ప్రైవేటీకరణ జరగలేదు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఆదుకున్నాం..
గతంలో ఇదే విశాఖలో ఎల్‌జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీక్ వల్ల 14 మంది చనిపోతే మా ప్రభుత్వం చాలా వేగంగా స్పందించింది. కోటి రూపాయల చొప్పున పరిహారం ప్రకటించడమే కాకుండా, నేనే స్వయంగా ఇక్కడకు వచ్చి చనిపోయిన వారి కుటుంబాలకు కోటి చొప్పున ఇచ్చాం. గతంలో దేశంలో ఎక్కడా అలా జరగలేదు. ఆ కుటుంబాలకు తోడుగా నిలబడ్డాం. ఆ కుటుంబాల్లో పిల్లలకు ఉద్యోగాలు వచ్చేలా చూశాం. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తీరు చాలా దారుణంగా ఉంది. కార్మికులకు హక్కుగా రావాల్సినవే వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం చేయాలి. నాడు మా ప్రభుత్వంలో కార్మికులకు కోటి రూపాయలు ఇచ్చి ఎలా అండగా నిలబడ్డామో... అదే మాదిరిగా ప్రతీ ఉద్యోగికి మేం చేసి చూపించిన తరహాలోనే మీరూ చేయాలని అడుగుతున్నాం. వారికి హక్కుగా వచ్చే రూ.1.72 కోట్లతో పాటు అదనంగా మరో కోటి రూపాయలు ఇవ్వాలి. వారి కుటుంబ సభ్యులకు వెంటనే ఉద్యోగాలు కూడా ఇవ్వాలని కోరుతున్నాం. నా పక్కనే ఉన్న పెంటయ్యన్న కుటుంబాన్ని కూడా అదే మాదిరిగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమికి చెబుతున్నాం. సంస్థ ప్రైవేటీకరణ వద్దంటూ మా మాదిరిగానే అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపి మీ చిత్తశుద్ధి చూపాలని డిమాండ్ చేస్తున్నాం.


