
ఎమ్మెన్నెస్, శివసేన(యూబీటీ) పొత్తు ఊహాగానాలకు తెర
బెస్ట్ క్రెడిట్ యూనియన్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు నిర్ణయం
వెల్లడించిన ఇరుపార్టీ చీఫ్‌లు.. ఠాక్రే బ్రాండ్ పేరిట పోస్టర్ విడుదల
సాక్షి ముంబై: ఎమ్మెన్నెస్, శివసేన(యూబీటీ) పొత్తుపై గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు దాదాపుగా తెరపడింది. శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే (Raj Thackeray) ఒక్కటి కావడం ఖాయమన్న సంకేతాలిచ్చారు. ముంబైలో జరగబోయే బెస్ట్ క్రెడిట్ యూనియన్ ఎన్నికల్లో రెండు పార్టీలూ కలిసిపోటీచేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక ప్రభావం చూపనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు దీపావళి తర్వాత నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ ప్రకటన తర్వాత ఠాక్రే సోదరులిద్దరూ (Thackeray Cousins) బెస్ట్ క్రెడిట్ యూనియన్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకుని రాష్ట్ర రాజకీయాల్లో మార్పు ఖాయమని అందరికీ తెలిసేలా చేశారని చెప్పవచ్చు. బెస్ట్ క్రెడిట్ యూనియన్ ఎన్నికలు ఆగస్టు 18న జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో శివసేన (యూబీటీ), ఎమ్మెన్నెస్‌లకు చెందిన కార్మిక యూనియన్లు కలిసి పోటీ చేయనున్నాయి. దీంతో ఈసారి ఎన్నికల దిశ మారనుంది. ముఖ్యంగా బెస్ట్ క్రెడిట్ యూనియన్ ఎన్నికలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు రెఫరెండంగా నిలుస్తాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఉత్కర్ష ప్యానెల్ పేరుతో ఎన్నికల బరిలో...
ది బెస్ట్ ఎంప్లాయీస్ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఎన్నికల్లో ఠాక్రే బంధువులు రెండు పార్టీలు ఉత్కర్ష ప్యానెల్‌తో పోటీ చేయనున్నాయి. ఈ మేరకు రెండు వర్గాలు ‘ఠాక్రే బ్రాండ్’ అని రాసున్న ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశాయి. ఈ పోస్టర్‌లో ఉద్దవ్‌ఠాక్రే, రాజ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, అమిత్ ఠాక్రేలతోపాటు శివసేన (యూబీటీ), ఎమ్మెన్నెస్ నాయకుల ఫొటోలున్నాయి.
చదవండి: ‘కబూతర్ ఖానా’మూసివేతపై కన్నెర్ర