
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల్లో తమకు గట్టి పట్టున్న సీట్లను సమానంగా పంచుకోవాలని శివసేన(యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్‌ఎస్) నిర్ణయించాయి. మిగతా మున్సిపాలిటీల్లో 60:40 సూత్రాన్ని అనుసరించాలని తీర్మానించాయి. సీట్ల పంపకంపై దీపావళి వరకు స్పష్టత వచ్చే అవకాశముంది.
బీఎంసీ పరిధిలోని ప్రాబల్యం కలిగిన స్థానాలను ముందుగా గుర్తించాలని కూడా అంగీకారానికి వచ్చాయి. ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన(యూబీటీ), ఎంఎన్‌ఎస్ సారథి రాజ్ ఠాక్రే వరుసకు సోదరులవుతారు. ఈ రెండు పార్టీల కూటమి ఏర్పాటు ప్రకటన కేవలం లాంఛనప్రాయమేనని ఇరుపార్టీల నేతలు అంటున్నారు. ముంబైతోపాటు థానె, నాసిక్, కల్యాణ్–డొంబివిలి ప్రాంతాల్లో రెండు పార్టీలకు గట్టి పట్టుంది. 2026 జనవరి 31వ తేదీలోగా మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు గట్టి ఆదేశాలివ్వడం తెల్సిందే. 2025–26లో వార్షిక బడ్జెట్ రూ.74 వేల కోట్లు కలిగిన బీఎంసీ దేశంలోనే అత్యంత ధనిక మున్సిపల్ కార్పొరేషన్. బీఎంసీలో 227 వార్డులున్నాయి.
ఇదిలా ఉండగా ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమంలో ఉద్దవ్, రాజ్ థాక్రే ఒకే వేదికపై మళ్లీ కలిశారు. 2005లో రాజ్ థాక్రే శివసేన పార్టీని వీడారు. పార్టీ వీడడానికి ఉద్ధవ్ కారణమని విమర్శించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీలు ఘోర పరాజయం పాలయ్యాయి. దాంతో ఇద్దరు సోదరులు మళ్లీ కలిసిపోయారు.