టీడీపీలో కోట్లకు సీట్లు | The TDP leaders are alleging that seats were sold by babu | Sakshi
Sakshi News home page

టీడీపీలో కోట్లకు సీట్లు

Published Sun, Mar 31 2024 4:01 AM | Last Updated on Sun, Mar 31 2024 4:01 AM

The TDP leaders are alleging that seats were sold by babu - Sakshi

లైన్‌లో ఎన్నాళ్లున్నా నో ఛాన్స్‌

అభ్యర్థుల ఎంపికలో డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చినట్లు తేటతెల్లం 

పార్టీ నేతలను కాదని బయటి వ్యక్తులకు సీట్లు ఇవ్వడానికి ఇదే కారణం 

అనంతపురం అర్బన్‌ సీటును రూ.30 కోట్లకు అమ్ముకున్నట్లు టీడీపీ నేతల ఆరోపణ

గంటాకు భీమిలి వెనుకా భారీ డీల్‌ 

దర్శి, గుంతకల్లు ఎమ్మెల్యే, ఒంగోలు ఎంపీ సీటు ఖరారుకీ ఇదే సూత్రం

అంతకుముందు ప్రకటించిన అనేక సీట్లలోనూ ఇదే పంచాయితీ.. రెండు రకాల డిపాజిట్లు చేస్తే కానీ సీటు ఖరారు కాలేదంటున్న అభ్యర్థులు 

అనేక చోట్ల సీట్లు అమ్మేసుకున్నారని ఆరోపిస్తున్న టీడీపీ నేతలు.. మిన్నంటుతున్న ఆందోళనలు 

సాక్షి, అమరావతి: టీడీపీలో ‘కోట్లుకు టికెట్లు’ వ్యవహారం రచ్చకెక్కింది. కోరినన్ని కోట్లిస్తేనే ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు చోట్ల డబ్బు డిపాజిట్‌ చేస్తేనే టికెట్లు ఇస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘మా వాళ్లు బ్రీఫ్‌డ్‌ మీ’.. అన్న తరహాలోనే ఇప్పుడూ పెద్ద నేతకు ‘బ్రీఫింగ్‌’ వెళ్తేనే టికెట్‌ ఖరారవుతోందని చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పార్టీకి విధేయులుగా ఉండే నేతలు సైతం ఈ డబ్బు దందాపై రగిలిపోతున్నారు.

పార్టీ కోసం పని చేసిన వారిని కాదని బయటి వ్యక్తులకు వేలం పాట పెట్టి మరీ సీట్లు అమ్మేసినట్లు టీడీపీ నేతలు వాపోతున్నారు. వారి ఆవేదన హద్దులు దాటి దాడులు చేసే స్థాయికి చేరింది. అనంతపురం అర్బన్‌ సీటును అక్కడి ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకరచౌదరికి కాకుండా దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌కి ఇవ్వడంపై అనంతపురం టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. పార్టీ కార్యాలయాలపై దాడులు చేసి నిప్పు పెట్టి, చంద్రబాబు, లోకేశ్‌ ఫొటోలను దహనం చేస్తున్నారు.

ఈ సీటును లోకేశ్‌ రూ.30 కోట్లకు అమ్మేసినట్లు పార్టీ నేతలు మీడియాలోనే చెబుతున్నారు. గుంతకల్లు అసెంబ్లీ సీటును కూడా ఇలాగే వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకి కేటాయించారు. పార్టీ కోసం ఎప్పటి నుంచో పనిచేస్తున్న ఇన్‌ఛార్జి జితేంద్రగౌడ్‌కి మొండిచేయి చూపి అప్పటికప్పుడు పార్టీలో చేరిన జయరాంకి ఇచ్చేశారు. ఇందుకోసం ఆయన చంద్రబాబు, లోకేశ్‌కి భారీగా డబ్బు ముట్టజెప్పినట్లు టీడీపీ నేతలే చెబుతున్నారు. 

దర్శి సీటు స్థానికేతరురాలికి ఇవ్వడం వెనుక ! 
ఒంగోలు జిల్లా దర్శి సీటును కూడా వేరే ప్రాంతానికి చెందిన డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మికి కేటాయించారు. నిజానికి ఈ సీటును చాలాకాలం క్రితమే బేరం పెట్టినా కొనేందుకు ఎవరూ రాలేదు. ఇతర పార్టీల నుంచి ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూశారు. ఆఫర్లు ప్రకటించినా లాభం లేకపోయింది. ఈ నేపథ్యంలో నర్సరావుపేట సీటు ఆశించిన డాక్టర్‌ లక్ష్మి కుటుంబానికి ఆ సీటు కాకుండా దర్శి కేటాయించారు. నిర్దేశించిన రేటు ముట్టజెప్పడంతో స్థానికేతరురాలు అయినా ఆమెకు సీటు ఇచ్చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఏ సీటూ ఇవ్వకూడదనుకున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఆయన కోరుకున్న భీమిలి సీటు ఇవ్వడం వెనుకా భారీ డీల్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

గంటాను విశాఖ నుంచి పూర్తిగా దూరంగా పంపడానికి చంద్రబాబు ప్రయత్నించారు. అందుకోసం విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పోటీ చేయాలని తీవ్ర ఒత్తిడి చేశారు. ఆయన ససేమిరా అన్నారు. విశాఖ జిల్లాలోనే ఏదో ఒక సీటు కావాలని కోరా­రు. అందుకు మొదట ఒప్పుకోని చంద్రబాబు.. మొదటి మూడు జాబితాల్లోనూ అవకాశం కల్పించలేదు. ఇక ఆయనకు సీటు రాదనుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే గంటా ఇచ్చిన భారీ ఆఫర్‌కి చంద్రబాబు, లోకేశ్‌ తలొగ్గినట్లు ఆరోపణలు వస్తున్నాయి. జనసేనకు ఇవ్వాల్సిన భీమిలి సీటును పొత్తులో లేకుండా చేసి మరీ ఆఖరి జాబితాలో గంటాకు కట్టబెట్టారని సమాచారం. ఒంగోలు లోక్‌సభ సీటును ఫిరాయింపు నేత మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఇవ్వడం వెనుకా డబ్బు డీల్‌ ఉన్నట్లు చెబుతున్నారు.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి సీటు ఇవ్వడాన్నిబట్టి దానికి గట్టి రేటు పెట్టి డబ్బు దండుకున్నారని పార్టీ నేతలు అంటున్నారు. మొదట ఆయన కుమారుడు రాఘవరెడ్డికి సీటు ఇవ్వడానికి ఒప్పుకున్నా, అరెస్టయి బెయిల్‌పై ఉన్న వ్యక్తికి టికెట్టిస్తే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో శ్రీనివాసులరెడ్డినే పోటీ చేయించాలని నిర్ణయించారు. ఇలా అంతకుముందు ప్రకటించిన లోక్‌సభ సీట్లకు సైతం పెద్దఎత్తున డబ్బు చేతులు మారినట్లు టీడీపీలో చర్చ జరుగుతోంది.  

ఎంపీ టికెట్‌ రేటు రూ.100 నుంచి రూ.200 కోట్లు ఏలూరు, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, నంద్యాల ఎంపీ సీట్ల ఖరారు వెనుక వందల కోట్ల డీల్‌ ఉన్నట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. ఒక్కో ఎంపీ సీటు కోసం రూ.100 నుంచి రూ.200 కోట్ల డీల్‌ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో పని చేసిన నేతలను కాదని ఎన్‌ఆర్‌ఐలు, పారిశ్రామికవేత్తలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు సీట్లు ఇవ్వడానికి డబ్బు తప్ప మరో కారణం లేదని తెలుస్తోంది. సగానికిపైగా అసెంబ్లీ సీట్ల ఖరారులోనూ ఇదే సూత్రాన్ని పాటించారు. రెండు రకాల డిపాజిట్లు చేస్తేనే కాని సీటు ఖరారు కాలేదని అనంతపురం జిల్లాకు చెందిన ఒక టీడీపీ అభ్యర్థి తన అనుచరుల వద్ద వాపోయారు.

ఒక డిపాజిట్‌ ఎన్నికల్లో ఖర్చు చేయడానికి, మరొకటి చినబాబుకు చేశాకే చాలామంది సీట్లు దక్కించుకున్నారని చెబుతు­న్నారు. ఇందుకోసం ఆయన వేలం పాట పెట్టి ఎవరు ఎక్కువ ఇస్తామంటే వారికి సీట్లు ఖరారు చేసినట్లు సమాచారం. దీనిపై టీడీపీలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ కోసం అహర్నిశలూ కష్టపడి పని చేస్తే సీట్లతోపాటు తమను కూడా అమ్మేస్తున్నారని వాపోతున్నారు. అందుకే పలుచోట్ల కార్యకర్తలు చంద్రబాబు, లోకేశ్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వారిని బూతులు కూడా తిడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement