breaking news
vote ku note
-
టీడీపీలో కోట్లకు సీట్లు
సాక్షి, అమరావతి: టీడీపీలో ‘కోట్లుకు టికెట్లు’ వ్యవహారం రచ్చకెక్కింది. కోరినన్ని కోట్లిస్తేనే ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు చోట్ల డబ్బు డిపాజిట్ చేస్తేనే టికెట్లు ఇస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘మా వాళ్లు బ్రీఫ్డ్ మీ’.. అన్న తరహాలోనే ఇప్పుడూ పెద్ద నేతకు ‘బ్రీఫింగ్’ వెళ్తేనే టికెట్ ఖరారవుతోందని చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పార్టీకి విధేయులుగా ఉండే నేతలు సైతం ఈ డబ్బు దందాపై రగిలిపోతున్నారు. పార్టీ కోసం పని చేసిన వారిని కాదని బయటి వ్యక్తులకు వేలం పాట పెట్టి మరీ సీట్లు అమ్మేసినట్లు టీడీపీ నేతలు వాపోతున్నారు. వారి ఆవేదన హద్దులు దాటి దాడులు చేసే స్థాయికి చేరింది. అనంతపురం అర్బన్ సీటును అక్కడి ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకరచౌదరికి కాకుండా దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌కి ఇవ్వడంపై అనంతపురం టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. పార్టీ కార్యాలయాలపై దాడులు చేసి నిప్పు పెట్టి, చంద్రబాబు, లోకేశ్ ఫొటోలను దహనం చేస్తున్నారు. ఈ సీటును లోకేశ్ రూ.30 కోట్లకు అమ్మేసినట్లు పార్టీ నేతలు మీడియాలోనే చెబుతున్నారు. గుంతకల్లు అసెంబ్లీ సీటును కూడా ఇలాగే వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకి కేటాయించారు. పార్టీ కోసం ఎప్పటి నుంచో పనిచేస్తున్న ఇన్‌ఛార్జి జితేంద్రగౌడ్కి మొండిచేయి చూపి అప్పటికప్పుడు పార్టీలో చేరిన జయరాంకి ఇచ్చేశారు. ఇందుకోసం ఆయన చంద్రబాబు, లోకేశ్‌కి భారీగా డబ్బు ముట్టజెప్పినట్లు టీడీపీ నేతలే చెబుతున్నారు. దర్శి సీటు స్థానికేతరురాలికి ఇవ్వడం వెనుక ! ఒంగోలు జిల్లా దర్శి సీటును కూడా వేరే ప్రాంతానికి చెందిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి కేటాయించారు. నిజానికి ఈ సీటును చాలాకాలం క్రితమే బేరం పెట్టినా కొనేందుకు ఎవరూ రాలేదు. ఇతర పార్టీల నుంచి ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూశారు. ఆఫర్లు ప్రకటించినా లాభం లేకపోయింది. ఈ నేపథ్యంలో నర్సరావుపేట సీటు ఆశించిన డాక్టర్ లక్ష్మి కుటుంబానికి ఆ సీటు కాకుండా దర్శి కేటాయించారు. నిర్దేశించిన రేటు ముట్టజెప్పడంతో స్థానికేతరురాలు అయినా ఆమెకు సీటు ఇచ్చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఏ సీటూ ఇవ్వకూడదనుకున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఆయన కోరుకున్న భీమిలి సీటు ఇవ్వడం వెనుకా భారీ డీల్ ఉన్నట్లు తెలుస్తోంది. గంటాను విశాఖ నుంచి పూర్తిగా దూరంగా పంపడానికి చంద్రబాబు ప్రయత్నించారు. అందుకోసం విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పోటీ చేయాలని తీవ్ర ఒత్తిడి చేశారు. ఆయన ససేమిరా అన్నారు. విశాఖ జిల్లాలోనే ఏదో ఒక సీటు కావాలని కోరారు. అందుకు మొదట ఒప్పుకోని చంద్రబాబు.. మొదటి మూడు జాబితాల్లోనూ అవకాశం కల్పించలేదు. ఇక ఆయనకు సీటు రాదనుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే గంటా ఇచ్చిన భారీ ఆఫర్‌కి చంద్రబాబు, లోకేశ్ తలొగ్గినట్లు ఆరోపణలు వస్తున్నాయి. జనసేనకు ఇవ్వాల్సిన భీమిలి సీటును పొత్తులో లేకుండా చేసి మరీ ఆఖరి జాబితాలో గంటాకు కట్టబెట్టారని సమాచారం. ఒంగోలు లోక్‌సభ సీటును ఫిరాయింపు నేత మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఇవ్వడం వెనుకా డబ్బు డీల్ ఉన్నట్లు చెబుతున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి సీటు ఇవ్వడాన్నిబట్టి దానికి గట్టి రేటు పెట్టి డబ్బు దండుకున్నారని పార్టీ నేతలు అంటున్నారు. మొదట ఆయన కుమారుడు రాఘవరెడ్డికి సీటు ఇవ్వడానికి ఒప్పుకున్నా, అరెస్టయి బెయిల్‌పై ఉన్న వ్యక్తికి టికెట్టిస్తే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో శ్రీనివాసులరెడ్డినే పోటీ చేయించాలని నిర్ణయించారు. ఇలా అంతకుముందు ప్రకటించిన లోక్‌సభ సీట్లకు సైతం పెద్దఎత్తున డబ్బు చేతులు మారినట్లు టీడీపీలో చర్చ జరుగుతోంది. ఎంపీ టికెట్ రేటు రూ.100 నుంచి రూ.200 కోట్లు ఏలూరు, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, నంద్యాల ఎంపీ సీట్ల ఖరారు వెనుక వందల కోట్ల డీల్ ఉన్నట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. ఒక్కో ఎంపీ సీటు కోసం రూ.100 నుంచి రూ.200 కోట్ల డీల్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో పని చేసిన నేతలను కాదని ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సీట్లు ఇవ్వడానికి డబ్బు తప్ప మరో కారణం లేదని తెలుస్తోంది. సగానికిపైగా అసెంబ్లీ సీట్ల ఖరారులోనూ ఇదే సూత్రాన్ని పాటించారు. రెండు రకాల డిపాజిట్లు చేస్తేనే కాని సీటు ఖరారు కాలేదని అనంతపురం జిల్లాకు చెందిన ఒక టీడీపీ అభ్యర్థి తన అనుచరుల వద్ద వాపోయారు. ఒక డిపాజిట్ ఎన్నికల్లో ఖర్చు చేయడానికి, మరొకటి చినబాబుకు చేశాకే చాలామంది సీట్లు దక్కించుకున్నారని చెబుతున్నారు. ఇందుకోసం ఆయన వేలం పాట పెట్టి ఎవరు ఎక్కువ ఇస్తామంటే వారికి సీట్లు ఖరారు చేసినట్లు సమాచారం. దీనిపై టీడీపీలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ కోసం అహర్నిశలూ కష్టపడి పని చేస్తే సీట్లతోపాటు తమను కూడా అమ్మేస్తున్నారని వాపోతున్నారు. అందుకే పలుచోట్ల కార్యకర్తలు చంద్రబాబు, లోకేశ్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వారిని బూతులు కూడా తిడుతున్నారు. -
చంద్రబాబు పరార్
♦ ‘ఓటుకు కోట్లు’ దెబ్బతో హైదరాబాద్ వదిలారు ♦ ‘సాక్షి’తో మంత్రి హరీశ్‌రావు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అది మంత్రి హరీశ్‌రావు అధికారిక నివాసం.. ‘నా కొడుకు గుండెకు రంధ్రం పడింది.. ఆపరేషన్‌కు డబ్బు లేదు’ అని ఓ తండ్రి కన్నీళ్లు. ‘నా పెనిమిటిని పోలీసులు పట్టుకపోయిండ్రయ్యా’ అని ఓ మహిళ ఆవేదన. ‘బోరు బాయికి కరెంటు కనెక్షన్ అడిగితే ఏఈ సారు దమ్ము దమ్ము జేస్తున్నడు’ అని ఓ రైతు మొర.. వారందరి బాధలు వింటూ అధికారులకు ఫోన్లు కలుపుతున్నారు మంత్రి. కచ్చితంగా పని చేయాలని ఆదేశాలిస్తున్నారు. ఎన్నికల స్పెషలిస్టుగా.. టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు పొందిన హరీశ్‌రావును ‘సాక్షి’ పలకరించగా.. తన మనసులోని భావాలను ఇలా బయటపెట్టారు. మంత్రి చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. బాబు ఎత్తుగడలు తెలియనివి కావు.. చంద్రబాబు నాయుడు ఎన్నికల ఎత్తుగడలు మనకు తెలియనివి కావు. ఆరు నెలల ముందే డబ్బు ఎక్కడెక్కడకు చేర్చాలో అక్కడకు చేర్చి రాజకీయాలు చేస్తారు. పత్రికలు, ప్రెస్మీట్లతో నానా హడావుడి చేసేవారు. కానీ ‘ఓటుకు కోట్లు’ దెబ్బతో హైదరాబాద్ వదిలి పరారయ్యారు. ఆరు నెలల నుంచి ఇక్కడ అసలు కనిపించడం లేదు. తెలంగాణలో టీడీపీ పరిస్థితి నాయకుడు లేని సేనల తీరుగా మారింది. ఇక గ్రేటర్లో వాళ్లకు గెలుపు పరిస్థితి ఎక్కడిది? కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ. దీటుగా నడిపించే నాయకుడు లేడు. మెజారిటీ స్థానాలు కాదు... నాకు ఉన్న సమాచారం మేరకు కాంగ్రెస్ గ్రేటర్లో కేవలం 10 సీట్లయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది. కేవలం ఆ 10 సీట్ల మీదనే కసరత్తు చేస్తూ కాలం గడుపుతోంది. హెచ్‌సీయూ రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్యతో బీజేపీ పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోయింది. అందులోంచి ఎలా బయట పడాలని వాళ్లు ఆలోచన చేస్తున్నారు. ఈ కేసు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మెడకు చుట్టుకుంది. ఆయన పదవిని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇంకా ఉసురు పోసుకోవాలా? నాకు తెలిసి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అభివృద్ధికి నోచుకోని నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది నారాయణఖేడే. ఇక్కడి ప్రజలు కనీస మౌలిక వసతులకు దూరంగా ఉన్నారు. తాగడానికి సురక్షితమైన నీళ్ల సంగతి దేవుడెరుగు. కనీసం తాగడానికి నీళ్లు లేవు. రోడ్లు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ కాలేజీలు ఏమీ లేవు. కుటుంబంలో సగటున ఒకరి జీవితం మొత్తం నీళ్లు మోయడానికే సరిపోతుంది. రికార్డులు చూస్తే రూ.వందల కోట్లు నారాయణఖేడ్‌కు కేటాయించినట్లు ఉంది. మరి ఈ నిధులు ఎటుపోయాయి. ఆస్పత్రులు, కాలేజీలు అన్ని వాళ్ల కుటుంబాలకే. వైద్యం చేయించుకోవాలంటే వాళ్ల ఆసుపత్రికే వెళ్లాలి.. చదువుకోవాలంటే వాళ్ల కాలేజీకే వెళ్లాలి. ఇక్కడి ప్రజల ప్రధాన జీవన ఆధారం వ్యవసాయం. కానీ ఇప్పటి వరకు ఇక్కడ వ్యవసాయ మార్కెట్ లేదు. ఎవరు కారణం? సింపతీ కోసమని మళ్లీ ఆ కుటుంబానికే అధికారం అప్పగించి లక్షల మంది నియోజకవర్గ ప్రజల ఉసురు పోసుకోవాలా? మిగిలిన రాష్ట్రా ల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు చనిపోయిన చోట కాంగ్రెస్ తమ అభ్యర్థిని పోటీకి నిలబెట్టింది. రాష్ట్రానికో నీతి అవలంబిస్తామంటే ఎలా కుదురుతుంది? పైగా ఓ కుటుంబం ఈ పర్యాయం పోటీ చేస్తే, మరో కుటుంబం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ పెద్దల సమక్షంలో ఒప్పంద పత్రాలు రాసుకున్నారు. ప్రజా సేవ అంటే ఒప్పంద పత్రాలు రాసుకోవడమా? త్వరలోనే చెంచులను కలుస్తా ఓ జర్నలిస్టు మిత్రుడు రాసిన ‘మరణం అంచున’ పుస్తకావిష్కణ సభలో నల్లమల చెంచులను కలవటం జరిగింది. నిజంగా చెంచులు కల్మషం లేని మనుషులు. చెంచు జాతి అభివృద్ధి కోసం నేను చేయగలిగినదంతా చేస్తానని ఆ రోజు సభలో మాట ఇచ్చాను. వాళ్లు నా కోసం ఎదురు చూస్తుంటారు. వీలైనంత త్వరలో మరోసారి నల్లమలకు వెళ్తా. అడవిలో తిరిగి చెంచులను కలుస్తాను. జిల్లా కలెక్టర్, ఐటీడీఏ అధికారులతో ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తా. చెంచు జాతి రక్షణ కోసం ఏమేమి చేయాలో అవి తప్పకుండా చేస్తాం. అపురూపమైన ఆ జాతిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత. నీళ్లు కావాలా? మొసలి కన్నీళ్లు కావాలా? నారాయణఖేడ్‌లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాం. దాదాపు రూ.750 కోట్లతో మిషన్ భగీరథ పనులు ప్రారంభించాం. ప్రతి గ్రామాన్ని కలుపుతూ బీటీ రోడ్డు వేస్తున్నాం. నారాయణపేట, పెద్ద శంకరంపేట పట్టణాల్లో వ్యవసాయ మార్కెట్‌ను మంజూరు చేశాం. దుబ్బాక తరహాలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇంతకాలం నియోజకవర్గ అభివృద్ధి నిరోధకులే మళ్లీ ఇప్పుడు జనంలోకి వస్తున్నారు. తండ్రి చనిపోయాడంటూ మొసలి కన్నీళ్లతో సింపతీ ఓట్లు పిండుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నీళ్లు కావాలో? మొసలి కన్నీళ్లు కావాలో నారాయణఖేడ్ ప్రజలకు తెలుసు. అభివృద్ధి అంటే ఏమిటో కళ్లారా చూస్తున్నారు. ఎవరికి ఓటేయాలో.. ఎవరిని గెలిపించాలన్నదానిపై ప్రజలు ఇప్పటికే ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చారు.