సీఎం రేసుపై సచిన్ పైలెట్ కీలక వ్యాఖ్యలు

Sachin Pilot Shares What Rahul Gandhi Told Him - Sakshi

జైపూర్: రాజస్థాన్‌లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో సీఎం రేసుపై సీనియర్ నాయకుడు సచిన్ పైలెట్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పీఠంపై ఎవరు కూర్చోవాలనేది ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు, పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని తెలిపారు. క్షమించు.. మర్చిపో.. సాగిపో అనే విధానాన్నే కాంగ్రెస్ పెద్దలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తనకు సూచించారని పేర్కొన్నారు.

భవిష్యత్‌పైనే దృష్టి సారించానని సచిన్ పైలెట్ చెప్పారు. రాజస్థాన్‌ ఐదేళ్ల రోడ్‌మ్యాప్‌పైనే ప్రస్తుతం పనిచేస్తున్నానని పేర్కొన్నారు. ఐక్యంగా కాంగ్రెస్ పార్టీకి విజయం తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఐక్యమత్యంగా పోరాడుతున్నారని చెప్పారు. ఏ విషయాన్నైనా నాయకులందరం కూర్చోని తేల్చుకుంటామని అన్నారు. 

2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండేదని తెలిపిన పైలెట్.. ఈ ఐదేళ్లపాటు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ప్రజలు రుచి చూశారని చెప్పారు. రాజస్థాన్ చరిత్రలో ఈసారి ఎన్నికలు చరిత్రాత్మకంగా నిలుస్తాయని అన్నారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

రాజస్థాన్ రాజకీయ చరిత్రలో నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ ఎదురులేని పార్టీగా కొనసాగింది. 1990లో మొదటిసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఒకసారి కాంగ్రెస్ వస్తే మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చే సాంప్రదాయం కొనసాగుతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు గడ్డుకాలమే నడుస్తున్నా.. మరి ఈసారి ప్రజలు ఏం తీర్పు ఇవ్వనున్నారో వేచి చూడాల్సి ఉంది. 

కాంగ్రెస్‌లో సీఎం పదవిపై సీనియర్ నాయకుడు అశోక్ గహ్లోత్, సచిన్‌ పైలెట్ వర్గాల మధ్య పోటీ నడుస్తోంది. గత ఎన్నికల్లో విజయం సాధించిన నాటి నుంచి పైలెట్, గహ్లోత్ వర్గాల మధ్య నిరంతరం నువ్వా-నేనా అన్నట్లు పోటీ నెలకొంది. కానీ పార్టీ కేంద్ర అధిష్ఠానం ఎప్పటికప్పుడు కల్పించుకుని వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. గహ్లోత్‌కు పీఠాన్ని అప్పగించేలా సచిన్ పైలెట్‌ను ఒప్పించారు. అయితే.. ఈసారి సీఎం పదవి దక్కించుకోవాలని సచిన్ పైలెట్ వర్గం ఆశిస్తోంది. 

ఇదీ చదవండి: ఇంకా ఎంత దిగజారుతారు..? నితీష్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఫైర్‌

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top