ఇంకా ఎంత దిగజారుతారు..? నితీష్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఫైర్‌

PM Attacks Nitish Kumar Over Population Control Remarks - Sakshi

భోపాల్‌: జనాభా నియంత్రణలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం విరుచుకుపడ్డారు. ఈ విషయంలో ప్రతిపక్షాల మౌనాన్ని ఆయన ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌లోని గునా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన.. నితీష్ వ్యాఖ్యలు దేశానికి అవమానకరమని అన్నారు. 

"భారత కూటమికి చెందిన ప్రధాన నాయకుడు బిహార్ అసెంబ్లీలో మహిళలపై అసభ్య పదజాలం ప్రయోగించాడు. భారత కూటమిలోని ఏ నాయకుడు దీనికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది వారికి ఏమాత్రం అవమానకరంగా కనిపించట్లేదు. మహిళల గురించి ఇలా ఆలోచించే వ్యక్తులు మీకు ఏం మంచి చేయగలరు?మన అమ్మా, అక్కాచెల్లెళ్ల పట్ల ఇలాంటి దుర్మార్గపు వైఖరి ఉన్నవాళ్లు మన దేశాన్ని అవమానిస్తున్నారు"" అని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. ఇంకా ఎంత దిగజారిపోతారని ఇండియా కూటమిని ఉద్దేశించి ప్రశ్నించారు. 

స్త్రీలు చదువుకుంటే.. భర్తలను కంట్రోల్‌లో పెట్టి జనాభాను తగ్గిస్తారని జనాభా నియంత్రణపై మాట్లాడిన నితీష్ కుమార్ వ్యాఖ్యలు దుమారం రేపాయి.  మహిళలు విద్యావంతులైతే కలయిక వేళ భర్తలను అదుపులో పెడతారని, తద్వారా జనాభా తగ్గుతుందని బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ వ్యాఖ్యానించారు. మహిళలు విద్యావంతులు అవుతున్నందువల్లే ఒకప్పుడు 4.3గా ఉన్న జననాల రేటు ప్రస్తుతం 2.9కు తగ్గిందని, త్వరలోనే 2కు చేరుతుందని నితీశ్‌ అసెంబ్లీలో  అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ సహా ప్రముఖులు చిరునవ్వులు కురిపించారు. 

 సీఎం వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని అసెంబ్లీలో బీజేపీ మహిళా ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. నితీష్ వ్యాఖ్యలు అవమానకరమని తక్షణమే క్షమాపణ చెప్పాలని దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. దీంతో ఎట్టకేలకు నితీష్ కుమార్ క్షమాపణలు చెప్పారు.    

ఇదీ చదవండి: జనాభా నియంత్రణపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సీఎం నితీష్ కుమార్ క్షమాపణలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top