రాజీవ్‌ కృషితోనే ఐటీ, టెలికాం అభివృద్ధి  | Sakshi
Sakshi News home page

రాజీవ్‌ కృషితోనే ఐటీ, టెలికాం అభివృద్ధి 

Published Mon, Aug 21 2023 1:32 AM

Revanth Reddy at the Rajiv Gandhi Jayanti programme - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో సాంకేతిక విప్లవం తీసుకురావడమేకాక, రాజ్యాంగ సవరణలతో పల్లెసీమలకు సర్వ హక్కులు కలి్పంచి, సర్వతోముఖాభివృద్ధి కోసం కృషి చేసిన మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ ఈనాటి యువతకు ఒక స్ఫూర్తి అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కొనియాడారు.

రాజీవ్‌ కృషితోనే దేశంలో ఐటీ, టెలికాం రంగాల అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. రాజీవ్‌ గాంధీ 79వ జయంతి సందర్భంగా ఆదివారం సోమాజీగూడలోని రాజీవ్‌ విగ్రహానికి టీపీసీసీ నేతలతో కలసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రేవంత్‌ మాట్లాడుతూ పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి అధికారాన్ని పేదల చేతిలో పెట్టిన నాయకుడు రాజీవ్‌ గాంధీ అన్నారు.

మహిళలకు స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు, 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత కూడా ఆయనదేనన్నారు. ప్రధాని మోదీ దేశ సంపదను తన మిత్రుడికి దోచిపెడుతుంటే, తెలంగాణలో కేసీఆర్‌ తన కుటుంబానికి దోచిపెడుతున్నారని, బీజేపీ, బీఆర్‌ఎస్‌లది ఫెవికాల్‌ బంధమని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఈ రెండు పార్టిలకు బుద్ధిచెప్పి రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాలని రేవంత్‌ పిలుపునిచ్చారు.  

గాందీభవన్‌లోనూ.. 
రాజీవ్‌ గాంధీ జయంతి సందర్భంగా గాం«దీభవన్‌లోనూ ఆయన చిత్రపటానికి కాంగ్రెస్‌ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీపీసీసీ డాక్టర్స్‌ సెల్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, యూత్‌కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఫిషర్‌మెన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్పోర్ట్స్‌ కిట్స్‌ పంపిణీ చేశారు.

రాజీవ్‌ గాంధీ జీవిత చరిత్రను వివరిస్తూ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఇతర నేతలు దీపాదాస్‌ మున్షీ, వి.హనుమంతరావు, మధుయాష్కీగౌడ్, మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్‌ యాదవ్, సంగిశెట్టి జగదీశ్వర్‌రావు, శివసేనారెడ్డి, మెట్టుసాయికుమార్, రోహిణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement