ఎర్రబెల్లి వల్లే జైలుకు వెళ్లానన్న రేవంత్‌.. టీపీసీసీ చీఫ్‌కు మంత్రి కౌంటర్‌

Revanth Reddy Fires On Errabelli, Dayakar Rao Counter To TPCC Chief - Sakshi

సాక్షి, జనగామ జిల్లా: అసెంబ్లీ ఎన్నికల వేళ  నేతల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మధ్య మాటల యుద్ధం నెలకొంది. పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి నామినేషన్ పురస్కరించుకొని నిర్వహించిన భారీ బహిరంగ సభలో రేవంత్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మంత్రి ఎర్రబెల్లిపై నిప్పులు చెరిగారు.

వచ్చే ఎన్నికల్లో ఈ రావుల పాలన పోవాలంటే ఎర్రబెల్లి దయాకర్‌ రావును ఓడించాలని రేంత్‌ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో దొరల గడీలను పూడ్చివేద్దామన్నారు. పాలకుర్తి ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నారై ఝాన్సీ రెడ్డి అమెరికాలో డబ్బులు పోగుచేసి కృషి చేస్తుంటే.. ఇక్కడ సంపాదించిన వేలకోట్ల అక్రమ సంపాదనను మంత్రి దయాకర్ రావు అమెరికాలో పెట్టుబడులు పెడుతూ దోచుకుంటున్నారని మండిపడ్డారు. 40 ఏళ్ల దయాకర్ రావు రాజకీయంలో అక్రమ సంపాదనలే తప్ప.. ప్రాంత అభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు.

ఎర్రబెల్లికి బుద్ధి చెప్పాలి: రేవంత్‌
ఓటుకు నోటు కేసులో తాను జైలుకు పోవడానికి ఎర్రబెల్లినే కారణమని రేవంత్‌ రెడ్డి తెలిపారు. తెలంగాణలో టీడీపీ బలహీన పడటానికి కూడా దయాకర్‌ రావునే కారణమని అన్నారు. ఎర్రబెల్లి  వెన్నుపోటు పొడిచే వ్యక్తి, నమ్మక ద్రోహి అని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌, దయాకర్ రావు దొరల పాలనాలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏ రోజు అడిగిన పరిస్థితి లేదని విమర్శించారు. చెన్నూరు రిజర్వాయర్ కోసం రూ. 360 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే, ఎర్రబెల్లి దానిని రూ.7వందల కోట్లకు పెంచి, రూ.350 కోట్లు దోచుకున్న దొంగ అని ధ్వజమెత్తారు. ఓటు ద్వారా పాలకుర్తి ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పాలని కోరారు.

రేవంత్‌ ఐటమ్‌ సాంగ్‌ లాంటోడు: ఎర్రబెల్లి
రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కౌంటర్‌ ఇచ్చారు. పాలకుర్తి ప్రజలను రేవంత్ రెడ్డి అవమానించారని మండిపడ్డారు. కాంగ్రెస్ సభ దగ్గరకు వచ్చిన వారిని రేవంత్ రెడ్డి కాళ్లతో తన్నాడని విమర్శించారు. పాలకుర్తి ప్రజలు కూడా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని తన్ని తరిమేయాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ఐటమ్ సాంగ్ లాంటోడని, ఈ విషయం తాను టీడీపీలో ఉన్నప్పుడే చంద్రబాబుతో చెప్పానని పేర్కొన్నారు. చంద్రబాబు కూడా దీనిని అంగీకరించారన్నారు.

రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు పేయింటర్గా పనిచేసేవాడని, బ్లాక్ మెయిల్ చేసి ఈ స్థాయికి వచ్చాడని ఎర్రబెల్లి దుయ్యబట్టారు. పది కోట్ల రూపాయలు తీసుకొని ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చారని బయట రేవంత్‌ గురించి చర్చించుకుంటున్నారని అన్నారు. దందాలు, బ్రోకరిజం బంద్ చేయాలని రేవంత్ రెడ్డికి అప్పుడే చెప్పానని తెలిపారు. దయన్న లెక్క నీతి నిజాయితీతో ఉంటే బతకలేమని అప్పుడు రేవంత్ రెడ్డి అన్న సంగతి గుర్తు చేశారు. తాము తెలంగాణ కోసం రాజీనామాలు చేస్తే రేవంత్ రెడ్డి చేయలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. పాలకుర్తి ప్రజలు నావెంటే ఉన్నారని స్పష్టం చేశారు. 
చదవండి: ఐటీ దాడులు.. పొంగులేటి అనుచరుడు ఆత్మహత్యాయత్నం

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top