రేవంత్‌రెడ్డిని సీఎం చెయ్యొద్దు  | Revanth BRS Covert says Judson | Sakshi
Sakshi News home page

రేవంత్‌రెడ్డిని సీఎం చెయ్యొద్దు 

Dec 2 2023 1:08 AM | Updated on Dec 2 2023 1:08 AM

Revanth BRS Covert says Judson - Sakshi

పంజగుట్ట (హైదరాబాద్‌): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయవద్దని, ఆయన బీఆర్‌ఎస్‌ పార్టీ కోవర్టు అని ఏఐసీసీ మాజీ సభ్యుడు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత బక్క జడ్సన్‌ ఆరోపించారు. రేవంత్‌రెడ్డి, కల్వకుంట్ల కవిత స్నేహితురాలు ఎన్‌ఆర్‌ఐ మందుల వినుత ఇద్దరూ వ్యాపారంలో భాగస్వామ్యులని ఏఐసీసీ మాజీ సభ్యుడు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత బక్క జడ్సన్‌ వెల్లడించారు. తెలంగాణను ఒక దొంగ చేతినుంచి మరో దొంగకు తాళాలు అప్పగించవద్దని కాంగ్రెస్‌ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోవాలని రేవంత్‌రెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేశారని, 53 మంది ఓడిపోయే అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారని విమర్శించారు. తన వ్యాఖ్యలవల్ల పార్టీకి నష్టం కలగకూడదనే ఇన్నిరోజులు ఆధారాలు బయటపెట్టలేదని అందుకే ఎన్నికలయ్యాక సమావేశం పెట్టినట్లు శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన పేర్కొన్నారు.

2012లో అప్పటి తెలుగుదేశం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌ కూతురు కవిత మిత్రురాలైన ఎన్‌ఆర్‌ఐ మందుల వినుత డైరెక్టర్లుగా ఆడికోర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో కంపెనీని నెలకొల్పారని 2009 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమం సమయంలోనే కేసీఆర్‌ ఆస్తులు విపరీతంగా పెరిగాయని చెప్పారు. స్వయంగా ఓటుకు కోట్లు కేసులో తనంతటతానే పట్టుబడేలా కవిత, కేసీఆర్‌తో రేవంత్‌రెడ్డి కుట్రపన్నినట్లు ఆరోపించారు. అనంతరం చంద్రబాబును బెదిరించి భారీగా డబ్బులు గుంజి ఆ సొమ్ముతోనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు చేశారని తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement