
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హైడ్రాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా.. హైదరాబాద్‌ను రక్షించే ఒక గొప్ప వ్యవస్థ అని ప్రశంసించారు. హైడ్రా అవసరాన్ని హైదరాబాద్ గుర్తిస్తోందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు హైడ్రాను అస్త్రంగా వాడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గోల్కొండ కోటలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గోల్కోండ కోటలో జాతీయ జెండాను రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ..‘హైదరాబాద్‌ను స్వచ్ఛమైన, శుభ్రమైన, సౌకర్యవంతమైన నగరంగా తీర్చిదిద్దాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఆ ఆలోచన నుండి ఏర్పాటైనదే హైడ్రా వ్యవస్థ. బెంగళూరు, ముంబై, చెన్నై లాంటి నగరాలు వరదలతో చిన్నాభిన్నం అవుతున్నాయి. అలాంటి దుస్థితి హైదరాబాద్‌కు రాకూడదు అంటే చెరువుల ఆక్రమణ, అక్రమ నిర్మాణాలను నిరోధించాలి. ఆ ఉద్దేశంతోనే హైడ్రాను తీసుకువచ్చాం.
ఇటీవలే ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు హైడ్రా 13 పార్కులు, 20 సరస్సులను ఆక్రమణల నుంచి రక్షించింది. అంబర్‌పేట్ బతుకమ్మ కుంటను పునరుద్ధరించింది. 30వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాపాడింది. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు హైడ్రాను అస్త్రంగా వాడుకుంటున్నాయి. అక్రమ నిర్మాణాల విషయంలో చర్యలు తీసుకోవడం, చెరువుల పునరుద్ధరణలో హైడ్రా సమర్ధంగా పని చేస్తోంది. హైడ్రా అవసరాన్ని హైదరాబాద్ గుర్తిస్తోంది. హైడ్రా.. హైదరాబాద్‌ను రక్షించే ఒక గొప్ప వ్యవస్థ. ఆ వ్యవస్థను కాపాడుకుందామని నేను మీ అందరికి పిలుపునిస్తున్నా. అలాగే, శాంతి భద్రతలు ఒక రాష్ట్ర ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తాయి అని అన్నారు.
ఇదే సమయంలో మాకు విల్ ఉంది.. విజన్ ఉంది.. తెలంగాణ రైజింగ్-2047 మా విజన్. ఆ విజన్ నిజం చేసే మిషన్ ఈ ప్రభుత్వం తీసుకుంది. ప్రపంచ వేదికపై తెలంగాణను నెంబర్ వన్‌గా నిలబెట్టడమే మా విజన్. ఇందుకు ప్రజలందరి సహకారం, ఆశీర్వాదం అవసరం అని వ్యాఖ్యలు చేశారు.