
హైదరాబాద్: ‘SIR’(స్పెషల్ ఇంటిన్స్‌వ్ రివ్యూ) పేరుతో భారత ఎన్నికల సంఘం చేస్తున్న దారుణాన్ని తాము ప్రశ్నించామని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఒకవేల 65 లక్షలు ఓటర్లను తొలిగించినట్లయితే ఎందుకు తీసేస్తున్నారో వివరాలను పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ‘ సుప్రీం కోర్టు ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ...తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో గడిచిన రెండు వారాలుగా పార్లమెంటు సభ్యులం....ఈ స్పెషల్ ఇంటిన్స్‌వ్ రివ్యూపై పార్లమెంటులో చర్చ జరగాలని పట్టుపడుతూ వస్తున్నాం. స్పీకర్ ఈ విషయంపై దృష్టి పెట్టకుండా సభను వాయిదా వేస్తూ వచ్చారు.
ఇవాళ సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడంతో....మనం ప్రజా స్వామ్యాన్ని కాపాడుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల సంఘం అనేది ఒక కీలకమైన విభాగం. రాజ్యాంగ బద్దంగా స్వతంత్రంగా పని చేయాల్సిన ఈ సంస్థ ప్రలోభాలకు లోనైతే తీరని నష్టం వాటిల్లుతుంది. పౌరసత్వం, మతం పేరున ఎన్నికల సంఘం ఓటర్లను తొలిగించలేదు. ఒకవేల ఓటర్లను తొలిగించాలంటే ఎందుకు తొలిగించారో...చెప్పాల్సి ఉంటుంది. రాహుల్ ఇటీవల ఇచ్చిన ప్రజంటేషన్ ద్వారా ఓటర్ల జాబితాలో లోపాలు సుస్పష్టంగా వెలుగులోకి వచ్చాయి.
అటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటకలో చనిపోయిన వారిని బతికి ఉన్నట్లు, బతికి ఉన్న వారు చనిపోయినట్లు తప్పులు తడకలుగా జాబితా ఉంది. భారత్‌లో ఎన్నికల సంఘం చాలా స్పష్టతతో న్యూట్రల్‌గా పని చేయాల్సి ఉంది. సుప్రీం కోర్టు ఇవాళ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఈ విషయాన్ని స్పష్ఠం చేస్తున్నాయి.. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై తామంతా సంతోషిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం మనందరిపై ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.