విద్య, వైద్యానికి ప్రాధాన్యమిస్తాం

Rahul Gandhi Bharat Jodo Yatra Enters 4th Day In Telangana - Sakshi

రాష్ట్రంలో అధికారంలోకొస్తే ఆ రంగాలపై అధికంగా ఖర్చు పెడతాం 

నాలుగో రోజు భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌ గాంధీ 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా ప్రైవేటీకరిస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. ఒకవైపు యూనివర్సిటీలు, కాలేజీలను ప్రైవేటుపరం చేస్తూ మరోవైపు విద్యారంగానికి తక్కువ నిధులు ఖర్చు చేస్తోందని ఆరోపించారు. ఫలితంగా నిరుపేదలు, రైతుల పిల్లలకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

పాదయాత్రలో తాను ఓ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థిని కలిశానని.. రాష్ట్ర ప్రభుత్వం కాలేజీ ఫీజును రీయింబర్స్‌ చేయకపోవడం వల్ల డోర్‌ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నట్లు చెప్పాడన్నారు. అందుకే రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యమిస్తూ అధిక నిధులు ఖర్చు పెడతామని రాహుల్‌ హామీ ఇచ్చారు. లక్షలాది మంది యువతీయువకులు వారి కలలను సాకారం చేసుకొనేందుకు వీలుగా ప్రభుత్వ రంగంలోనే యూనివర్సిటీలు, విద్యాసంస్థలను నెలకొల్పుతామన్నారు.

భారత్‌ జోడో యాత్రలో భాగంగా నాలుగో రోజైన శనివారం మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం ధర్మాపూర్‌ నుంచి ఉదయం 6 గంటలకు పాదయాత్ర ప్రారంభించిన రాహుల్‌... పాలమూరు యూనివర్సిటీ, బండమీదిపల్లి, మహబూబ్‌నగర్‌ వన్‌టౌన్‌ చౌరస్తా, అశోక టాకీస్‌ జంక్షన్, బస్టాండ్, న్యూటౌన్, మెట్టుగడ్డ మీదుగా ఏనుగొండలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన శిబిరానికి చేరుకున్నారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి యాత్ర పారంభించి అప్పనపల్లి, కేసీఆర్‌ ఎకో పార్క్, మల్లెబోయినపల్లి మీదుగా జడ్చర్ల నియోజకవర్గానికి చేరుకున్నారు. క్రాస్‌రోడ్డులో ఫ్లైఓవర్‌ కింద కార్నర్‌ మీటింగ్‌లో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.   

అవి వ్యాపార పార్టీలు.. 
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ, నోట్ల రద్దుతో నిరుపేదలు, చిన్న, మధ్యతరగతి ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాహుల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగసంస్థలను ప్రైవేటీకరించి సామాన్యుల ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తోందని దుయ్యబట్టారు. దేశంలో గత 35 ఏళ్లలో ఎన్నడూలేని స్థాయిలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయిందని... అదే సమయంలో ప్రపంచంలో ఉన్న ధనవంతుల్లో ఎక్కువ మంది భారత్‌లోనే ఉన్నారని రాహుల్‌ గుర్తుచేశారు.

దేశంలో ధనవంతులు ఏం చెబితే అదే జరుగుతోందని... ఇక్కడి ముఖ్యమంత్రి, ఢిల్లీలో ప్రధాని వారికి పూర్తిస్థాయిలో వత్తాసు పలుకుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ రాజకీయ పార్టీల్లా కాకుండా వ్యాపార పార్టీలుగా మారాయని.. వాటికి నిరుపేదలు, రైతులు, ఇతర వర్గాలతో పని ఉండదని విమర్శలు గుప్పించారు. ఆ రెండు పార్టీలు కలసి పనిచేస్తున్నాయని ఆరోపించారు.

దేశ సంపదను పేదలకు పంచి అభివృద్ధిని సాధించాల్సింది పోయి నలుగురు సంపన్నులకే దోచిపెడుతుండటంతో పేదలు, ధనవంతులనే అంతరాలు ఏర్పడ్డాయని... ఇందుకు కేంద్రంలోని బీజేపీనే కారణమని రాహుల్‌ ధ్వజమెత్తారు. బీజేపీ అమలు చేస్తున్న విచ్ఛిన్నకర విధానాలను తిప్పికొట్టేందుకే భారత్‌ జోడో యాత్ర చేస్తున్నాని పునరుద్ఘాటించారు. 

చేనేత కార్మికులకు పరిహారం.. 
ప్రపంచంలోనే తెలంగాణ చేనేతకు ఎంతో ప్రాచుర్యం ఉందని.. అయితే కేంద్రం విధించిన జీఎస్టీతో లక్షలాది మంది చేనేత కార్మికులు తీవ్రంగా నష్టపోయారని రాహుల్‌ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆ వర్గాలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. తాము అధికారంలోకి రాగానే జీఎస్టీ వల్ల నష్టపోయిన కార్మికులకు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఇది పెద్ద విషయమేమీ కాదని.. వాటి లెక్కలు చూసే చెబుతున్నానన్నారు. అలాగే ధరణి పోర్టల్‌లో మార్పులు చేస్తామని.. దళిత, ఆదివాసీలు, గిరిజనుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం లాక్కున్న భూములను తిరిగి వారికే అందిస్తామన్నారు. కార్నర్‌ మీటింగ్‌ అనంతరం రాహుల్‌ గొల్లపల్లిలో రాత్రి బస చేశారు. శనివారం మొత్తంగా రాహుల్‌ 20.3 కి.మీ. మేర పాదయాత్ర చేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top