‘పోలీసులు నన్ను కింద పడేశారు.. గోళ్లతో రక్కారు’ | Priyanka Gandhi claims cops shoved her to ground at Janpath protest | Sakshi
Sakshi News home page

‘పోలీసులు నన్ను కింద పడేశారు.. గోళ్లతో రక్కారు’

Oct 7 2026 7:06 PM | Updated on Oct 7 2026 7:13 PM

Priyanka Gandhi claims cops shoved her to ground at Janpath protest

సాక్షి,న్యూఢిల్లీ: దేశ రాజధానిలో తీవ్ర ఉద్రిక్తత నడుమ.. ప్రధాన ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి చేపట్టిన నిరసన కార్యక్రమం హైడ్రామాకు దారితీసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌, ఓటర్ల జాబితా సవరణల్లో అవకతవకలు జరిగాయంటూ జంతర్ మంతర్ వైపు వెళ్తున్న విపక్ష ఎంపీలను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తనను మహిళా పోలీసులు కింద పడేశారని, ఒళ్లంతా రక్కారని కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ,కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రాలతో పాటు పలువురు ప్రముఖ విపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. జంతర్ మంతర్ వైపు నిరసన ప్రదర్శనగా వెళ్తున్న  ఇండియా కూటమి ఎంపీల బస్సులను అశోక రోడ్డు వద్ద భారీ భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. దీంతో ఆగ్రహించిన విపక్ష నేతలు విండ్సన్ సర్కిల్ వద్ద రోడ్డుపైనే బైఠాయించి ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. రాహుల్ గాంధీని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.

మరోవైపు, ప్రియాంకా గాంధీ వాద్రా సహా పలువురు మహిళా ఎంపీలు జంతర్‌మంతర్‌కు వెళ్లే మార్గంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు వారిని అక్కడి నుంచి బలవంతంగా ఈడ్చుకెళ్లి వ్యాన్లలో ఎక్కించారు. పోలీసుల అదుపులోకి తీసుకునే క్రమంలో తనపై దురుసుగా ప్రవర్తించారని ప్రియాంకా గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. 

నిరసన సమయంలో మహిళా పోలీసు సిబ్బంది తనను కిందపడేశారని, ఒళ్లంతా గోళ్లతో గీరారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఎంపీలతో ప్రవర్తించే తీరు ఇదేనా? ఎంపీలను కొడతారా? ఈడ్చి పడేస్తారా? ఎంపీలు ఏం అడుగుతున్నారు? ఈసీని కలుద్దామని ఎంపీలు అడగడం నేరమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.   ప్రజాస్వామ్య యుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు వ్యవహరించిన తీరు అప్ర జాస్వామికమని విపక్ష నేతలు మండిపడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement