కాంగ్రెస్‌కు ప్రకాశ్ అంబేద్కర్‌ ఆఫర్‌.. ఏడు స్థానాల్లో మద్దతు | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు ప్రకాశ్ అంబేద్కర్‌ ఆఫర్‌.. ఏడు స్థానాల్లో మద్దతు

Published Tue, Mar 19 2024 8:12 PM

Prakash Ambedkar offers support to congress party on 7 seats - Sakshi

ముంబై: సార్వత్రిక ఎన్నికల వేళ​  వంచిత్‌ బహుజన్‌ అఘాడి (వీబీఏ )అ‍ధ్యక్షుడు ప్రకాశ్‌ అంబేద్కర్‌ కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి తన పార్టీ మద్దతు  ఇవ్వనున్నట్లు వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేసే ఏడు స్థానాల్లో తమ పార్టీ నుంచి పూర్తి మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని ప్రతిపక్ష మహారాష్ట్ర వికాస్‌ అఘాడీ(ఎంవీఏ)కు దూరంగా ఉన్న ప్రకాశ్‌ అంబేద్కర్‌.. కాంగ్రెస్‌ పార్టీకి మత్తతు ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.

ప్రతిపక్ష కూటమి (ఎంవీఏ) వీబీఏ  మద్దతు లేకుండా ఎన్నికల బరిలో దిగుతామని నిర్ణయం తీసుకున్న తరుణంతో మంగళవారం ప్రకాశ్‌ అంబేద్కర్‌.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. అందులో కాంగెస్‌ పార్టీకి మద్దతను ప్రకటించటం గమనార్హం. అయితే గతంతో మొత్తం 48 సీట్లలో వీబీఏకు నాలుగు సీట్లు కేటాయించగా.. ఆ పార్టీ ఒప్పుకోకుండా 12 సీట్లను డిమాండ్‌ చేసింది. దీంతో ఎంవీఏ పార్టీని  ఒప్పించటంలో ఏంవీఏ కూటమి నేతలు సఫలికృతం కాలేకపోయారు.

అయితే.. ఖర్గేకు రాసిన లేఖలో ప్రకాశ్‌ అంబేద్కర్‌ ప్రతిపక్ష కూటమిలోని శివసేన(యూబీటీ), శరద్‌ పవార్(ఎన్సీపీ)పై విమర్శలు చేశారు. ‘పలు సమావేశాల్లో మా పార్టీ అభిప్రాయాలను శివసేన(యూబీటీ), ఎన్సీపీ(శరద్‌ చంద్రపవార్‌) పట్టించుకోలేదు. దీంతో  ఆ రెండు పార్టీలపై మాకు నమ్మకం పోయింది. మా పార్టీపై అసమానత్వం ప్రదర్శించారు’ అని మండిపడ్డారు ప్రకాశ్‌ అంబెద్కర్‌.

ఇక.. కాంగ్రెస్‌ పార్టీకి తమ మద్దతు కావాలనుకుంటే తాము ఏడు స్థానాల్లో పూర్తి మద్దతను ఇస్తామని చెప్పారు. ‘మహారాష్ట్ర వికాస్‌ అఘాడీ కూటమిలో భాగంగా కాంగెస్‌ పార్టీ పోటీచేసే ఏడు సెగ్మెంట్లలో మా పార్టీ పూర్తిగా క్షేత్రస్థాయిలో కాంగెస్‌ పార్టీకి మద్దతు ఇస్తుంది. భవిష్యత్తులో కూటమి అవకాశాలను దృష్టిలో పెట్టుకొని స్నేహపూర్వకంగా తమ పార్టీ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇస్తుంది’ అని ప్రకాశ్‌ అంబేద్కర్‌ లేఖలో వివరించారు.

మహారాష్ట్రలో ఇండియా కూటమిలో భాగం ప్రతిపక్షాల కూటమిలో ఉన్న శివసేన(యూబీటీ)కి-22, కాంగ్రెస్‌- 16, ఎన్సీపీ (శరద్‌ చంద్ర పవార్‌)-10 సీట్లు కేటాయింపు జరగనున్నట్లు  సోమవారం ఎంవీఏ కూటమిలోని నేతలు చర్చించుకుంటున్నారు.

Advertisement
 
Advertisement