
సాక్షి, ఢిల్లీ: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలపై పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇక, తాజాగా నవంబర్ 5-15 మధ్యలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అసెంబ్లీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై ఎన్నికల సంఘం మాత్రం షెడ్యూల్‌ను ఇంకా విడుదల చేయలేదు.
వివరాల ప్రకారం.. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను అక్టోబర్ మొదటి వారంలో ఈసీ ప్రకటించే అవకాశం ఉంది. ఛఠ్ పూజా సంబరాలు ముగిసిన తర్వాత ఎన్నికల ప్రక్రియ చేపట్టాలన్న ఆలోచనలో ఈసీ ఉన్నట్లు తెలుస్తోంది. మూడు దశల్లోనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఈసీ ప్రణాళిక వేసినట్లు భావిస్తున్నారు. నవంబర్ తొలి వారంలో తొలి దశ ఉండే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే, బీహార్ అసెంబ్లీ కాలపరిమితి నవంబర్ 22వ తేదీన ముగుస్తుంది. దీంతో, ఎన్నికలను ఆ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. 2020లో కూడా బీహార్ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించారు. అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7వ తేదీల్లో చేపట్టారు. ఫలితాలను నవంబర్ 10వ తేదీన వెల్లడించారు. దీంతో, ఈసారి కూడా ఇంచుమించుగా ఇలాగే మూడు దశల్లో ఎన్నికల జరిగే అవకాశం ఉంది.