
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్నులో నరేంద్ర మోదీ సర్కార్ చేపట్టిన మార్పులు లోతైన గాయాలకు కేవలం బ్యాండ్–ఎయిడ్ వేసి వదిలేసినట్లుగా ఉన్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎద్దేవా చేశారు. కొన్ని రకాల నిత్యావసరాలపై అధికంగా జీఎస్టీ విధించారని, ప్రజలకు కేంద్రం క్షమాపణ చెప్పాలని అన్నారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు.
ఈ క్రమంలో ఖర్గే.. 900 ఎలుకలను తిన్న పిల్లి హజ్ యాత్రకు వెళ్లిందన్న సామెత తీరుగా ప్రధాని నరేంద్ర మోదీ తీరు ఉందని ధ్వజమెత్తారు. మోదీ సర్కార్ ఇప్పటిదాకా 9 రకాల పన్నుల శ్లాబ్‌లతో గబ్బర్‌సింగ్ ట్యాక్స్ వసూలు చేసిందని ఆరోపించారు. ఎనిమిదేళ్లలో ఏకంగా రూ.55 లక్షల కోట్లు ప్రజల నుంచి వసూలు చేసిందన్నారు. కానీ, ఇప్పుడు ప్రజలకు రూ.2.5 లక్ష కోట్లు కోసం ఆదా చేశామంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్నారని ఖర్గే దుయ్యబట్టారు.
జీఎస్టీ సంస్కరణల విషయంలో మొత్తం క్రెడిట్ కొట్టేయడానికి ప్రధాని మోదీ ఆరాటపడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు. నిజానికి జీఎస్టీలో ఇప్పుడు తీసుకొచ్చిన సంస్కరణలు ఏమాత్రం సరిపోవని చెప్పారు. రాష్ట్రాలకు ఇచ్చే పరిహారాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలన్న డిమాండ్‌ను కేంద్రం విస్మరించిందని ఆక్షేపించారు. జీఎస్టీ 2.0 తీసుకురావాలని తాము 2017 జూలై నుంచే డిమాండ్ చేస్తున్నామని గుర్తుచేశారు. జీఎస్టీలో సంస్కరణలను మరింత విస్తరింపజేయాలని కేంద్రానికి సూచించారు.