Sakshi News home page

మాకొక ట్రబుల్ షూటర్‌ కావలే

Published Sat, Jul 8 2023 9:12 PM

The political face of Maharashtra is changing - Sakshi

2019 మహారాష్ట్ర ఎలక్షన్స్‌లో ఒక్క ఓటు వేసాం...మాకు ముగ్గురు ముఖ్యమంత్రులు, 4గురు డిప్యూటీ సీఎంలు ఉన్నారంటూ...చాలా మంది వాట్సాప్‌స్టేటస్‌లలో చక్కర్లు కొడుతోంది.... దీనంతటికి కారణం ఒక్కటే ...ఒక సారి షిండే వ్యవహారం మహారాష్ట్రలోని శివసేన ప్రభుత్వంలో చిచ్చురేపితే....ఈసారి ఎన్‌సిపిలో అజిత్ పవార్‌ రూపంలో చిచ్చురేగింది. అజిత్‌ పవార్‌ దెబ్బకు ఏడాదిలో ముగ్గురు సీఎంలు మహారాష్ట్ర ప్రభుత్వంలో మారిన పరిస్ధితి. దీంతో మొత్తంగా మహారాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న అనూహ్య పరిణామాలు రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇక షిండే ఎపిసోడ్‌ని పక్కన పెడితే. ఎన్‌సిపి పార్టీ పరిస్ధితే కాదు పార్టీ వ్యవస్ధాపకుడు శరద్‌ పవార్‌ పరిస్ధితి మరీ దారుణంగా మారిపోయింది. 

ఒక్క మాటలో చెప్పాలంటే అటూ సొంత కుటుంబ సభ్యుడి చేతిలో వెన్నుపోటుకుగురైన శరద్‌ పవార్‌...అటు అజిత్‌ పవార్‌తో యుద్ధం చేయలేక అలాగని శరణమా అంటూ కలుపుకోలేకపోతున్నారు. పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు చీలిక వర్గం అజిత్ పవార్ గ్రూపులో చేరిపోగా, మిగిలిన నేతలను కాపాడుకోడానికి అష్టకష్టాలు పడుతున్న నిస్సహాయ స్థితిలో ఆయనున్నారు. ఒకప్పుడు దేశ రాజకీయాలను శాసించి చక్రం తిప్పిన ఆయన ఎన్నో ఎత్తుపల్లాలన్నీ చూసారు. 

దీంతో అటు ఓటమిని అంగీకరించడం లేదు....అలాగని ఇపుడు పోరాడటం అంత తేలికకూడా కాదు. ఎందుకంటే పార్టీ గుర్తుతో సహా అజిత్‌ పవార్‌ చేతిలోకి వెల్లిపోబోతుందన్న సంకేతాలు ఆయన్ని మరింత కుంగదీస్తున్నాయనే చెప్పాలి. రాజకీయ చదరంగంలో ఉద్ధండుగా ఉన్న ఆయన ఎలాంటి స్ధితిలోనైనా పార్టీని మరోసారి పట్టాలెక్కించే సత్తా ఉన్న ఆయన ఇపుడు మరోసారి పార్టీని బలోపేతం చేసే యోచనలో పడ్డారు. అంతేకాదు పార్టీ పగ్గాలు తన కుమార్తె సుప్రియ సూలేకు అందించాలనుకునే సమయంలోనే ఇంత రాజకీయం జరగడంతో అమె రాజకీయ భవిష్యత్తు ఇపుడు ప్రశ్నార్ధకంగా మారింది. అంతేకాదు తనని నమ్ముకున్న ఎంతో మంది సీనియర్‌ నాయకులు ఎటూ వెళ్ళలేని పరిస్ధితి. దీంతో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పావులు కదపడం ప్రారంభించారు శరద్‌ పవార్‌.

కుర్చీ నాదే.....పార్టీ నాదే : శరద్‌ పవార్‌
83 ఏళ్ల వయస్సు వచ్చినా ఇంకా కుర్చీ వదలవా? అంటూ అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలకు ఆయన చాలా ఘాటుగా బదులిచ్చారు. నావయస్సు 93 సంవత్సరాలైనా సరే రాజకీయాల్లోనే ఉంటాను ఏ గడ్డమీదనైతే ఒడిదుడుకులు చూశానో అక్కడే మరోసారి తన సత్తా నిరూపించుకుంటాను అంటూ ఇపుడు సవాల్‌ విసేరే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే జూనియర్ పవార్ చీల్చుకుపోయిన నేతలను వెనక్కి రప్పించి అసలైన ఎన్సీపీని దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఐతే అది సాధ్యం కాదు అని తెలుసుకున్న ఆయన ముందున్న తక్షణ కర్తవ్యం తన పాత గూడైన కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేయడం.కొద్ది రోజుల క్రితం పార్టీకిగుడ్‌బై చెపుతానన్నప్పుడు నేతల నుంచి వచ్చిన స్పందనలకు పొంగిపోయిన అయనకి అజిత్‌ పవార్‌ వెన్నుపోటుతో పార్టీపై తన పట్టు ఎంతో శరద్ పవార్‌కి తెలిసొచ్చింది.

మరొక వైపు మొత్తం 53 మంది ఎమ్మెల్యేలున్న పార్టీలో 29 మంది జూనియర్ పవార్ వెంట నిలవగా, సీనియర్ పవార్ వెంట కేవలం 16 మంది మాత్రమే ఉన్నారు. ఇందులో కూడా ఇన్ని రోజులు పవర్‌ కోసం , అవకాశాల కోసం ఎదిరి చూస్తున్నవారే కాబట్టి ఇందులో కూడా ఎంత మంది శరద్‌ పవార్‌తో ఉంటారో కూడా తెలియదు. కాబట్టి సీనియర్‌ పవార్‌ ముందున్న ప్రత్యామ్నాయం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడమే అని ఆయనకు చాలా సన్నిహితంగా ఉన్నవారు ఇప్పటికే ఆయనకు హితబోద చేశారట. దీని వల్ల అటు పరువును కాపాడుకోవడంతోపాటుగా ఇటు ఆయన్ని నమ్ముకుని ఉన్నవారికి కాంగ్రెస్‌లో మంచి పొజిషన్‌ వచ్చి వారు కూడా నెక్ట్స్‌ వచ్చే ఎలక్షన్స్‌ వరకు ఆయనకు మద్ధతుగా ఉంటారు పైగా తన కుమార్తె కూడా మహారాష్ట్రలో ఒక కీలక నేతగా మారేఅవకాశం ఉంది. కాబట్టి విలీనమే బెస్ట్‌గా ఆలోచి స్తున్నారట శరద్‌ పవార్‌.

అప్పుడు ఇప్పుడు...ఆయనే పెద్ద దిక్కు
మహారాష్ట్ర కాంగ్రెస్‌ చరిత్రలో శరద్‌ పవార్‌కు ఒక ప్రత్యేక స్ధానం ఉంది. ఎంత మంది అగ్రనేతలున్నా...ఆయన్ని కాంగ్రెస్‌ చాలా ప్రత్యేకంగా చూసేది కానీ కాంగ్రెస్ పగ్గాలను ఇటలీ జాతీయురాలైన సోనియా గాంధీ చేతుల్లో పెట్టడం ఒకప్పుడు ఏ మాత్రం ఇష్టం లేని శరద్ పవార్ 1999లో ఆ పార్టీని వీడి బయటికొచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఉన్న నాయకులంతా నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీని వదిలి వెళ్ళిపోవాలని చూస్తున్నారు. పైగా ఇపుడు కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు మల్లికార్జున ఖర్గే చేతికి వచ్చాయి. కాబట్టి ఒకప్పుడు పార్టీని వీడడానికి కారణమైన వారు కూడా ఇపుడు పార్టీలో క్రియాశీలంగా లేరు. మరొక వైపు శరద్‌ పవార్‌ లాంటి ఒక అగ్రనేత కాంగ్రెస్‌పార్టీలోకి వస్తానంటే వద్దు అని చెప్పే ప్రసక్తే లేదు. అంతేకాదు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో సత్సంబంధాలను కలిగి శరద్‌ పవార్‌ కాంగ్రెస్‌లోకి వస్తే ఆ పార్టీకి అది కొండంత బలాన్ని ఇస్తుంది కూడా.

కాషాయ పార్టీకి దెబ్బే
కాంగ్రెస్‌లోకి శరద్‌ పవార్‌ వెలితే పశ్చిమ మహారాష్ట్రలో ఓట్లను ఏకతాటిపైకి తెచ్చి కాంగ్రెస్‌కు భారీ బలాన్ని తెచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్‌లో ఎన్సీపీ విలీనం అయితే మహారాష్ట్రలో కనీసం 10-12 లోక్‌సభ స్థానాలు, 50-65 అసెంబ్లీ స్థానాల్లో దూసుకుపోవడం ఖాయంగా కనపడుతోంది. బీజేపీ-శివసేన-అజిత్ పవార్ కూటమికి గట్టి సవాలుగా విసిరే అవకాశం ఉందని అంచనా. అంతేకాదు కట్టప్పలను ప్రోత్సహిస్తున్న కాషాయ పార్టీని దెబ్బతీసే అవకాశం వస్తుంది.
రెండు మూడు రోజుల క్రితం శరద్ పవార్ – రాహుల్ గాంధీ మధ్య జరిగిన చర్చలు విలీనం దిశగా తొలి అడుగు పడిందని చాలా మంది పొలటికల్‌ అనలిస్ట్‌లు అంటున్నారు. ఇదే జరిగితే మరోసారి శరద్‌ పవార్‌ ఓడి గెలిచి తీరే అవకాశం ఆయనకు దక్కుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ట్రిపుల్‌ ఇంజిన్‌ సర్కార్‌లో ముసలం
అంతేకాదు మరో వైపు శరద్‌ పవార్‌కు కలిసివచ్చే అంశం ఇప్పటికే త్రిపుల్‌ ఇంజిన్‌ సర్కార్‌లో ముసలం పుట్టింది. షిండే వర్గానికి చెందిన కొంత మంది ఎమ్‌ఎల్‌ఎలను అజిత్‌ పవార్‌ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో ఖంగారుపడ్డ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్‌నాథ్‌ షిండే రాత్రి రాత్రే బిజేపి నాయకుడు డిప్యూటీ సీఎం దేవేందర్‌ ఫడ్నవీస్‌తో కలిసి తన గోడును వెల్లబోసుకున్నట్లుగా తెలుస్తోంది. రాత్రికి రాత్రే ఉన్న ఫలంగాఫడ్నవీస్‌ను షిండే కలవడం అక్కడ ఉన్న అస్ధిరతకు కారణంగా తెలుస్తోంది. షిండే MLAలు కనుక అజిత్ పవార్‌ తన వైపు తిప్పుకుంటే తనకు అసలుకే మోసం వస్తుందని కలవరపడుతున్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే. శివసేనలో తిరుగుబాటుకు కారణమై, ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏక్నాథ్ షిండేకు ఇపుడు అజిత్‌ పవార్‌ రూపంలో మరోసారి క్లిష్ట పరిస్థితులు ఎదురుకాబోతున్నట్టు తెలుస్తోంది. 

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ ఏకనాథ్ షిండేతో సహా శివసేన ఎమ్మెల్యేల భవితవ్యాన్ని నిర్ణయించాలని మే 11న సుప్రీంకోర్టు స్పీకర్‌ను కోరింది. ఈ క్రమంలో స్పీకర్ రాహుల్ నార్వేకర్ షిండే నేతృత్వంలోని 40 మంది ఎమ్మెల్యేలు, ఉద్ధవ్ వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. అనర్హత వేటు వేయకుండా ఉండాలంటే తగిన ఆధారాలు చూపాలని వారం రోజుల గడువు ఇచ్చారు. ఇప్పటికే వారికి నోటీసులు జారీ చేశారు స్పీకర్‌ రాహుల్‌ నార్వేకర్‌. ఎమ్మెల్యేలు స్పందించడానికి వారం రోజుల గడువు ఇచ్చారు. 

ఏక్‌నాథ్ షిండే సహా 16 మంది శివసేన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై కోర్టు విచారణ త్వరలో జరగనుంది. ఏక్‌నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రేలను స్పీకర్ పిలిచి ఆధారాలతో సహా తమ అభిప్రాయాలను కోరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరొక వైపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను త్వరగా పరిష్కరించేలా మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని సేనకు చెందిన ఎమ్మెల్యే సునీల్ ప్రభు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటు శరద్‌ పవార్‌ కాంగ్రెస్‌తో పావులు కదపడం....ఇంకో వైపు అజిత్‌ పవార్‌ ఏకంగా తిరుగుబాటు శివసేన ఎమ్‌ఎల్‌ఎలను తనవైపు తిప్పుకుని ముఖ్యమంత్రి పీఠంపై కన్నేయడం షిండేకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయన్నది నిజం. దీంతో మరాఠా గడ్డమీద బిజెపి త్రిపుల్‌ ఇంజిన్‌ సర్కారుకు మరోసారి తిప్పలు తప్పేలా లేవు.
-రాజ్ కుమార్, కరస్పాండెంట్, సాక్షి

Advertisement

What’s your opinion

Advertisement