అక్కడ ఐక్యత చూశా.. విపక్షాల బాయ్‌కాట్‌ నిర్ణయంపై ప్రధాని చురకలు!

PM Modi Indirectly Reacts Oppositions Boycott Decision - Sakshi

ఢిల్లీ: పార్లమెంట్‌ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విపక్షాలన్నీ బహిష్కరించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత కాకుండా.. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆ కార్యక్రమం జరుగుతుండడమే ఇక్కడ ప్రధాన అభ్యంతరం. అయితే.. ఈ నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా విపక్షాలకు చురకలు అంటించారు. 

విపక్షాల బాయ్‌కాట్‌ నిర్ణయం సరైంది కాదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఇదివరకే పేర్కొన్నారు.  నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం నవ భారతాన్ని, ప్రాచీన సంప్రదాయాలతో అనుసంధానం చేయడమని,  దీనిని రాజకీయం చేయవద్దని ప్రతిపక్ష పార్టీలకు హితవు పలికారు. ప్రజలను ఆలోచించనిద్దామని, వారికి నచ్చిన విధంగా స్పందించనిద్దామని చెప్పారు. అయినప్పటికీ విపక్షాలు వెనక్కి తగ్గడం లేదు. ఈలోపు.. 

ప్రధాని నరేంద్ర మోదీ సైతం పరోక్షంగా ఈ అంశంపై స్పందించారు. విదేశీ పర్యటన ముగించుకుని ఈ ఉదయం ఢిల్లీలో అడుగుపెట్టిన మోదీ.. అక్కడ బీజేపీ ఏర్పాటు చేసిన స్వాగత సభలో ఈ అంశంపై మాట్లాడారు.   ‘‘సిడ్నీలో జరిగిన కమ్యూనిటీ ఈవెంట్‌లో నేను మాట్లాడింది వినడానికి 20 వేల మంది హాజరయ్యారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌, అధికారపార్టీ ఎంపీలు మాత్రమే కాదు.. ఆ దేశ మాజీ ప్రధాని, ప్రతిపక్ష పార్టీ ఎంపీలు కూడా హాజరయ్యారు. దేశం ఐక్యంగా ఉందని చాటి చెప్పేందుకే వాళ్లంతా ఒకే వేదికపైకి చేరుకున్నారు’’ అంటూ ప్రధాని మోదీ ఇక్కడి విపక్షాలకు చురకలు అంటించారు. 

అలాగే.. కరోనా టైంలో విదేశాలకు వ్యాక్సిన్‌ అందించడంపై విపక్షాలు చేసిన విమర్శలనూ ఆయన ప్రస్తావించారు. ఇది గాంధీ, బుద్ధుడు లాంటి మహానుభావులు పుట్టి నడయాడిన నేల. వాళ్లే మనకు స్ఫూర్తిదాయకం. అందుకే శత్రువుల్ని సైతం ఆదరించే గుణం మనుకుంది అంటూ పేర్కొన్నారాయన. 

ఇదిలా ఉంటే.. మే 28వ తేదీన పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. అయితే ఉభయ సభల ప్రతినిధి అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పక్కన పెట్టేసి ప్రధాని మోదీ చేతుల మీదుగా పార్లమెంట్‌ను ప్రారంభించడం తీవ్రంగా ఖండిస్తున్నాయి విపక్షాలు. ఈ మేరకు 20 పార్టీలు కలిసి బాయ్‌కాట్‌ చేస్తున్నట్లుసంయుక్త ప్రకటన చేశాయి. వైఎస్సార్‌సీపీతో పాటు ఒడిషా అధికార పక్షం బీజేడీ మాత్రం కార్యక్రమానికి హాజరవుతామని ప్రకటించాయి. 

ఇదీ చదవండి: పార్లమెంట్‌ ప్రారంభోత్సవానికి వైసీపీ హాజరవుతుంది: ఏపీ సీఎం జగన్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top