పెనమలూరు ఎంపీపీ బాదావత్‌ వెంకటేశ్వరరావు! | Penamaluru Elections, Two Candidates With Same Name Contesting For One MPP Post | Sakshi
Sakshi News home page

పెనమలూరు ఎంపీపీ బాదావత్‌ వెంకటేశ్వరరావు!

Oct 31 2026 11:37 AM | Updated on Oct 31 2026 12:30 PM

Penamaluru Elections, Two Candidates With Same Name Contesting For One MPP Post

కృష్ణా జిల్లా: ఇదేమిటీ ఎన్నిక జరగకుండానే ఫలానా వ్యక్తి ఎంపీపీ అని ఎలా చెబుతున్నారని ఆశ్చర్యపోతున్నారా... అక్కడ ఎంపీపీ పదవికి అర్హత ఉన్న వ్యక్తులు పెనమలూరు–1 సెగ్మెంట్‌లో మాత్రమే పోటీ చేస్తున్నారు. పైగా వారిద్దరి పేర్లు బాదావత్‌ వెంకటేశ్వరరావే... పార్టీలు మార్పు  అంతే... అందుకే ఎవరు గెలిచినా ఎంపీపీ నేమ్‌బోర్డు బాదావత్‌ వెంకటేశ్వరరావు అనే ఉంటుంది. అలాంటి విచిత్ర పరిస్థితిలో  కృష్ణాజిల్లా పెనమలూరు మండల పరిషత్‌ ఎన్నికలు జరుగుతున్నాయి. 

వివరాల్లోకి వెళితే...  పెనమలూరు  మండలం నుంచి తాడిగడప మున్సిపాలిటీ విడిపోయిన తరువాత మొదటిసారిగా మండల పరిషత్‌ ఎన్నికలు జరుగుతున్నాయి. పెనమలూరు మండలంలో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 41,832 మంది ఉన్నారు. ఇందులో ఎస్టీలు కేవలం 1294 మందే ఉన్నారు. ఎస్టీల జనాభా తక్కువగా ఉన్నా  అధికారులు ఎంపీపీ స్థానం ఎస్టీలకు రిజర్వు చేశారు. ఇక్కడివరకు వ్యవహారం బాగానే ఉన్న ఎస్టీ అభ్యర్థి పోటీ చేయటానికి అధికారులు ఎస్టీ ఎంపీటీసీ స్థానం 12 ఎంపీటీసీ స్థానాల్లో కేటాయించలేదు. దీంతో జనరల్‌ స్థానంలో ఎస్టీ అభ్యర్థులు పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఇద్దరూ ఒకే చోట పోటీ 
పెనమలూరు–1 సెగ్మెంట్‌ జనరల్‌ కావటంతో ఎంపీటీసీ స్థానానికి ఇరు పార్టీలకు చెందిన ఇద్దరు ఎస్టీ అభ్యర్థులు ఒకే చోట పోటీ పడుతున్నారు. వీరిలో గెలిచిన వ్యక్తే ఎంపీపీ అవుతారు. ఎంపీపీకి మెజారిటీ ఎంపీటీసీలతో పనిలేకుండా పోయింది. ఒకే స్థానం నుంచి పోటీ చేస్తున్న ఇద్దరిలో ఒకరే గెలిచే అవకాశం ఉన్నందున గెలిచిన వ్యక్తికి ఎంపీపీ కిరీటం దక్కుతుంది.  

ఇద్దరి పేర్లు కూడా ఒకటే 
మరో విచిత్రం ఏమిటంటే పెనమలూరు–1 సెగ్మెంట్‌లో  వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి బాదావత్‌ వెంకటేశ్వరరావు, టీడీపీ అభ్యర్థి బాదావత్‌ వెంటేశ్వరరావు పేర్లు ఒకటే.  బ్యాలెట్‌æపత్రంలో ఇద్దరి పేర్లు ఒక పేరుతోనే వచ్చే పరిస్థితి ఉంది. దీంతో ఓటర్లు అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది. ఓటర్లు పార్టీ సింబల్‌ను చూసి  మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది. మరి ఎంపీపీ పదవి వీరిద్దరిలో ఎవరికి దక్కుతుందనేది స్థానికంగా ఆసక్తి కలిగిస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement