సాక్షి, పల్నాడు జిల్లా: మాచర్లలో పోలీసుల వేధింపులు మితిమీరిపోతున్నాయి. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అక్రమ కేసు నమోదు చేశారు. టీడీపీ సాగిస్తోన్న అరాచకాలు, దాడులను నిరసిస్తూ.. శాంతియుత నిరసన తెలిపిన పిన్నెల్లిపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని పిన్నెల్లితో పాటు మరో 33 మంది వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు పెట్టారు
కాగా, జిల్లాలో నవంబరు ఒకటో తేదీన పల్నాడు జిల్లాలోని మాచర్ల, సత్తెనపల్లి, చిలకలూరిపేట, వినుకొండ మున్సిపాలిటీలతో పాటు గుంటూరు జిల్లాలోని గుంటూరు, తెనాలి, బాపట్ల జిల్లాలోని రేపల్లె, చీరాల మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో పల్నాడు జిల్లాలో జరిగే నాలుగు మున్సిపాలిటీల పరిధిలో అధికార పార్టీ నేతలు.. ఎన్నికల అధికారులు, పోలీసులను అడ్డుపెట్టుకుని అన్ని కుట్రలకు తెరతీశారు.
మాచర్ల మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థితోపాటు 36 వార్డులకు వైఎస్సార్ సీపీ తరఫున నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీరిలో ఏ ఒక్కరూ విత్‌డ్రా చేసుకోకుండా ధైర్యంగా నిలబడ్డారు. ఓటమి తప్పదని భయపడ్డ టీడీపీ ఎమ్మెల్యే... బీఫారాలు సమర్పించడానికి వెళ్లిన వైఎస్సార్ సీపీ అభ్యర్థులపై అప్పటికే మాటువేసి ఉన్న టీడీపీ గూండాలతో దాడి చేయించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని బీఫారాలు చించి వేయించారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి నిరసన తెలిపినప్పటికీ, ఆయనపైనే కేసులు పెట్టారు.
ఇదీ చదవండి: రిటర్నింగ్ అధికారులా.. అధికారపార్టీ ఏజెంట్లా?


