వైఎస్‌ జగన్‌ హయాంలో పట్టాలెక్కిన ప్రగతి | Development In Kadapa During YSRCP Govt | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ హయాంలో పట్టాలెక్కిన ప్రగతి

Oct 31 2026 10:09 AM | Updated on Oct 31 2026 10:19 AM

Development In Kadapa During YSRCP Govt

గోపవరం సమీపంలోని సెంచురి ప్లైబోర్డ్‌ పరిశ్రమ

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కడప గడపలో అభివృద్ధి పరుగులు తీసింది. విద్య, వైద్యం, మౌలిక వసతులతో పాటు పారిశ్రామిక ప్రగతి వేగంగా రూపుదిద్దుకుంది. ఆల్‌డిక్సన్, సెంచురీ ప్లైౖబోర్డ్స్, ఆదిత్యా బిర్లా గార్మెంట్స్‌ లాంటి ప్రముఖ సంస్థలు వచ్చి చేరాయి. రాయలసీమ నిరుద్యోగ సమస్యకు పుల్‌స్టాప్‌ పడేలా జేఎస్‌డబ్ల్యూ నేతృత్వంలో స్టీల్‌ ప్లాంట్‌ పురుడు పోసుకుంది. సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి వచ్చింది. పదేళ్లు నిరాదరణకు గురైన జిల్లాలో  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాయాంలో నలుదిశలా వృద్ధి చెందింది. – సాక్షి ప్రతినిధి, కడప

అభివృద్ధికి అడుగుజాడ..
టీడీపీ హయాంలో (2014–19)లో నిరా దరణకు గురైన కొప్పర్తి పారిశ్రామికవాడపై  వైఎస్సార్‌ సీపీ హయాంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌  ప్రత్యేక చొరవ పెట్టారు. 801 ఎకరాల్లో వైఎస్సార్‌ ఎల్రక్టానిక్‌ మ్యానుఫ్యాక్షర్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేశారు. రూ.10వేల కోట్లు పెట్టుబడులు సమీకరించి లక్ష ఉద్యోగాలు సృష్టించేందుకు ప్రణాళికలు చేశారు. అందులోభాగంగా వేగంగా పారిశ్రామిక అడుగులు పడ్డాయి. రూ.80 కోట్లతో ఏర్పాటు చేసిన ఆల్‌డిక్సన్‌ కంపెనీ ప్రారంభమైంది. ఈసంస్థలో 1100 మందికి యువతకు ప్రత్యక్ష ఉద్యోగాలు లభించాయి. మరో రూ.127 కోట్లతో 1800 మందికి ఉపాధి లభించేలా విస్తరణ చేపట్టింది.

రెండేళ్లలోనే ఉత్పత్తి
బద్వేల్‌ నియోజకవర్గం గోపవరం సమీపంలో ఏర్పాటు చేసిన సెంచురీ ఫ్లైబోర్డ్స్‌ పరిశ్రమకు శ్రీకారం చుట్టిన రెండేళ్లలోనే ప్రారంభించారు. 589.23 ఎకరాల్లో రూ.956 కోట్లు అంచనాతో శ్రీకారం చుట్టిన ఆ సంస్థ పెట్టుబడులు రూ.1600 కోట్లకు చేరాయి. 2024 డిసెంబర్‌ నాటికి ఉత్పత్తి లక్ష్యం కాగా, 2023 డిసెంబర్‌ నాటి రెండు దశల పనులు కూడా పూర్తి చేశారు. 2021 డిసెంబర్‌ 23న అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేయగా, 2023 డిసెంబర్‌ 23న ప్రారంభించారు. ఈపరిశ్రమ ద్వారా  2076 మంది స్థానికులకు ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలు లభించాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 75 శాతం స్థానికులకు ఇవ్వాల్సి ఉండగా 78 శాతం ఉద్యోగాలు స్థానికులకు లభించాయి.  

మెడికల్‌ హబ్‌గా రిమ్స్‌... 
రిమ్స్‌ వైద్యశాల ప్రాంగణం మెడికల్‌ హబ్‌గా తీర్చిదిద్దారు. రూ.322.82 కోట్లతో మూడు ఆధునాతన వైద్యశాలలను నిర్మించా రు. 452 పడకల సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాల, 100 పడకల మానసిక వైద్యశాల, 100 పడకల కేన్సర్‌ హాస్పిటల్‌ను నెలకొల్పారు. మహానేత వైఎస్‌ఆర్‌ 180ఎకరాల విస్తీర్ణంలో రూ.220 కోట్లు వ్యయంతో ‘రిమ్స్‌’వైద్య కళాశాల, దంత వైద్య కళాశాల, నర్శింగ్‌ కళాశాలలను ఏర్పాటు చేశారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మరో రూ.322.82 కోట్లు వెచ్చించి, సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. కార్డియాలజీ, పిడియాట్రిక్, న్యూరాలజీ, ప్లాస్టిక్‌ సర్జరీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, నెఫ్రాలజీ లాంటి సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు  రిమ్స్‌లో లభించనున్నాయి.

కనువిందుగా కడప  
కడప నగరం సుందరీకరణ కనువిందుగా రూపుదిద్దుకుంది. దశాబ్దాలు తరబడి పెండింగ్‌లో ఉన్న రహదారులు విస్తరణ వేగంగా చేపట్టారు. రూ.120 కోట్లతో నగరంలోని 12 జంక్షన్లును వృద్ధి చేశారు. రూ.6.85 కోట్లతో రాజీవ్‌మార్గ్‌ రోడ్డు, రాజీవ్‌ పార్క్‌ ఆధునికీకరించారు. రూ.69.2 కోట్లుతో పాత బళ్లారి రోడ్డు, రూ.100 కోట్లుతో దేవుని కడప రోడ్డు విస్తరణ చేపట్టారు. రూ.10కోట్లతో ఇండస్ట్రీయల్‌ ఎస్టేట్‌ రోడ్డు నిర్మించారు. వైఎస్‌ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్‌ మైదానంలో రంజీ, దేశవాళీ క్రికెట్‌ మ్యాచ్‌లకు వేదికగా తీర్చిదిద్దారు.  

కడపసిగలో మణిహారం... 
జమ్మలమడుగు సమీపంలో జెఎస్‌డబ్ల్యూ సంస్థచే నిర్మించతలపెట్టిన స్టీల్‌ప్లాంట్‌ కడపసిగలో మణిహారంగా నిలవనుంది. తొలివిడతగా రూ.3,300 కోట్లు వ్యయంతో 10లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మాణ పనులు కొనసాగుతోన్నాయి. 2023 ఫిబ్రవరి 15న అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భూమిపూజ చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం వైఎస్‌ జగన్‌ సర్కార్‌ రూ.720 కోట్లు వెచ్చించి మౌళిక వసతులను సమకూర్చింది. విస్తరణ అనంతరం రూ.8800 కోట్లు పెట్టుబడి, 3మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో 25వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలు లభించేలా రూపకల్పన చేశారు.

పచ్చ పాలనలో పాతాళానికి అభివృద్ధి! 
జిల్లాలో  రెండున్నరేళ్లుగా సీఎం చంద్రబాబు సర్కార్‌లో అభివృద్ధి పడకేసింది. అప్పట్లో మంజూరైన నిధులు కూడా ఖర్చు చేయలేని దుస్థితిలో కూటమి సర్కార్‌ ఉండిపోయింది. జిల్లా కేంద్రంలో ఏడాదిన్నర నుంచి వైఎస్‌ జార్జిరెడ్డి వీధిలో నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ వరద కాలువ పూర్తి చేయలేని దుస్థితి స్పష్టంగా కని్పస్తోంది. ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న కాలువ నిర్మాణం కొనసాగుతూ....నే ఉంది. పైగా మూడు దశాబ్దాలుగా ప్రశాంతతకు నెలవుగా, భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న జిల్లా కేంద్రంలో దుష్ట సంస్కృతి తెరపైకి వచ్చింది. ఆస్తులు స్వా«దీనం చేసుకునే ఎన్నడు లేని సంస్కృతి వచ్చి చేరింది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement