బందరు లడ్డూ ఎవరికో? | Machilipatnam Municipal Corporation | Sakshi
Sakshi News home page

బందరు లడ్డూ ఎవరికో?

Oct 31 2026 11:12 AM | Updated on Oct 31 2026 11:31 AM

Machilipatnam Municipal Corporation

చిలకలపూడి(మచిలీపట్నం): మచిలీపట్నం నగరపాలక సంస్థ అభివృద్ధే ప్రధాన లక్ష్యమన్న నినాదంతో మేయర్‌ అభ్యర్థులు తమ ప్రచారాన్ని పూర్తి చేశారు. మేయర్‌ ఎన్నికల్లో ప్రధానంగా  వైఎస్సార్‌ సీపీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు తలపడుతున్నారు. వీరిరువురి కుటుంబాలు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాయి. మునిసిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవి బీసీ మహిళకు కేటాయించారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా లంకా జ్యోతి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అబ్దుల్‌ అబీదా బరిలో ఉన్నారు. ఈ పోటీలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి లంకా జ్యోతికే విజయావకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సహజంగానే వైఎస్సార్‌ సీపీకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మద్దతు ఉంటుంది. 

లంకా జ్యోతి తూర్పుకాపు సామాజికవర్గానికి చెందటంతో నగరంలో ఉన్న ఆ సామాజికవర్గం వారితో పాటు కాపు సామాజికవర్గం మొగ్గు చూపే అవకాశం మెండుగా ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి మేయర్‌ పదవిలో కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి ఉండాలనేది ఇక్కడ అధికంగా ఉన్న కాపు సామాజికవర్గ అభీష్టంగా ఉంది. అయితే రిజర్వేషన్‌ బీసీ మహిళకు రావటంతో కాపు సామాజికవర్గంలోని తూర్పు కాపునకు చెందిన జ్యోతికి సీటు దక్కింది. టీడీపీలో నగరంలోని ప్రథమ శ్రేణి నాయకులే సీటు కోసం ప్రయత్నాలు చేసినా హసీమ్‌ బేగ్‌ భార్య అబ్దుల్‌ అబీదాకు అధిష్టానం సీటు కేటాయించింది. దీంతో తొలినాళ్ల నుంచీ సీటు దక్కని నాయకులు కొంత ఎడముఖం, పెడ ముఖంగా ఉంటున్నారు.  

పొత్తుల పంచాయతీ టీడీపీలో అసంతృప్తి  
పలు డివిజన్లలో టీడీపీ, జనసేన అభ్యర్థుల మధ్య సఖ్యత లేకపోవటంతో ఆయా డివిజన్లలో రెబల్‌ అభ్యర్థులు బరిలో ఉండటం కూటమి విజయంపై తీవ్ర ప్రభావం చూపనుంది. కూటమి పార్టీల మధ్య కుదిరిన పొత్తులో భాగంగా 60 డివిజన్లలో టీడీపీకి 40, జనసేనకు 18, బీజేపీకి రెండు డివిజన్లు కేటాయించారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన తమను పక్కనపెట్టి పొత్తుల పేరుతో బీజేపీ, జనసేనకు సీట్లు కేటాయించటంపై అసంతృప్తితో టీడీపీ ఆశావహులు రగిలిపోతున్నారు.   

వైఎస్సార్‌ సీపీ పాలనలో నగరం అభివృద్ధి  
వైఎస్సార్‌ సీపీ కార్పొరేషన్‌ మొదటి సాధారణ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించి పాలన సాగించింది. 50 డివిజన్లకు గానూ 44 డివిజన్లలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు నాడు విజయబావుటా ఎగురవేశారు. టీడీపీ 5, జనసేన 1 స్థానంతో సరిపెట్టుకున్నాయి.  వైఎస్సార్‌ సీపీ హయాంలో నగరంలో ప్రజలకు అవసరమైన తాగునీటి పైప్‌లైన్లు, సిమెంటు రోడ్లు, కల్వర్టులు, డ్రెయిన్లు, పార్కులు తదితర మౌలిక వసతుల అభివృద్ధి జరిగింది. నగరంలోని దాదాపు 25 వేల మందికి ఇంటి స్థలాలను ఇవ్వటంతో పాటు వేలాది మందికి పక్కా గృహాలు నిర్మించి ఇచ్చారు. వీటికి తోడు నాటి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకున్నారు.  

లంకా జ్యోతి, వైఎస్సార్‌ సీపీ అభ్యర్ధి  
వైఎస్సార్‌ సీపీ అభ్యర్ధి లంకా జ్యోతి మామ లంకా అచ్చెయ్యనాయుడు 1981 లో మాజీ మంత్రి పేర్ని కృష్ణమూర్తి తో కలిసి కౌన్సిలర్‌గా పనిచేశారు. ఆయన కుమారుడు సూరిబాబు గతంలో కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షునిగా, అరిసేపల్లి పీఏసీఎస్‌ అధ్యక్షునిగా, కౌన్సిలర్, కో–ఆప్షన్‌ సభ్యుడు, కార్పొరేటర్, డెప్యూటీ మేయర్‌గా పనిచేశారు.

ఇదీ చదవండి: ‘రుణం తీర్చుకునే సమయం వచ్చిందిరా రామచంద్రా!’  

ఈమె తమ సామాజికవర్గంతో పాటు కాపు సామాజికవర్గం మద్దతు లభిస్తుందనే నమ్మకంతో పాటు వైఎస్సార్‌ సీపీ సంప్రదాయ ఓట్లతో అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

అబ్దుల్‌ అబీదా, టీడీపీ అభ్యర్థి 
అబీదా మామ కలీం బేగ్, అత్త మొవ్వ పార్వతి మచిలీపట్నం మునిసిపల్‌ కౌన్సిలర్లుగా పనిచేశారు. భర్త హసీం బేగ్‌ ప్రస్తుతం 16వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మైనార్టీ ఓట్లతో పాటు ఇతర సామాజికవర్గాల ఓట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement