
సాక్షి, న్యూఢిల్లీ: సీఎం కేసీఆర్ కుటుంబం ఇప్పుడు అనుభవిస్తున్నదంతా కాంగ్రెస్ పార్టీ భిక్షనే.. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ చేరదీయకుంటే కేసీఆర్ సహా ఆయన కుటుంబం మొత్తం ఇప్పుడు బిచ్చమెత్తుకుంటూ ఉండేదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
అధికారం కోసం పొత్తులు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రి పదవులు పొందలేదా..? 1996లో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా 610 జీవో పై, జోనల్ విధానం రద్దు చేయాలని మాట్లాడిన విషయం కేసీఆర్ మరిచిపోయారా..? అని ప్రశ్నించారు.
తెలంగాణకు కేసీఆర్ చేసిన ద్రోహంపై చర్చించేందుకు అమరవీరుల స్తూపం వద్ద చర్చకు తాను సిద్ధమని తాను వస్తారో, కేటీఆర్‌ను పంపుతారో హరీశ్‌ను పంపుతారో తేల్చుకోవాలని సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. ఢిల్లీలోని తన నివాసంలో మంగళవారం రేవంత్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ కోసం నిలబడ్డా
తెలంగాణ ఉద్యమానికి రేవంత్‌కు సంబంధంలేదంటూ ఎలా అంటారని, తానెప్పుడూ తెలంగాణకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. చంద్రబాబుతో ఉన్నా తెలంగాణ కోసం నిఖార్సుగా నిలబడ్డానని రేవంత్ తెలిపారు. తను తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు ఉంటే బయటపెట్టాలని సీఎం కేసీఆర్, కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు.
కేసీఆర్‌ను నమ్మి వచ్చిన విజయశాంతి, ఆలె నరేంద్ర సహా అనేక మందిని మోసం చేసిన సంగతి మరిచిపోయావా? అని ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహులతో అంటకాగిన కేసీఆర్ లాంటి వ్యక్తి మరొకరు పుట్టరన్నారు. కేసీఆర్ రాజీనామా చేసిన ప్రతీసారి ఎలక్షన్.. కలెక్షన్.. సెలెక్షన్ అనే విధానంతోనే ముందుకు వెళ్తారని విమర్శించారు.
లిక్కర్, నిక్కర్ పా ర్టీలకు ధీటుగా..
లిక్కర్ పార్టీ, నిక్కర్ పార్టీ ఒక్కటై చేస్తున్న యుద్ధాన్ని కాంగ్రెస్ ధీటుగా ఎదుర్కొంటుందని బీఆర్‌ఎస్, బీజేపీలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీలతో యుద్ధం వ్యూహాత్మకంగా చేయాలని గద్దర్ తన చివరి రోజుల్లో తనకు సూచించారని రేవంత్ తెలిపారు.
బట్టలతో తిరిగి వెళ్లేవారా?
గద్దర్ మరణాన్ని రాజకీయం చేయొద్దనే తాము విజ్ఞత ప్రదర్శించామనీ అందుకే కేసీఆర్‌కు బట్టలు, కేటీఆర్‌కు డ్రాయర్ మిగిలాయని రేవంత్ వ్యాఖ్యానించారు. తెలంగాణ సమాజం కోసం అహర్నిశలు పరితపించిన గద్దర్ మరణ వార్త తెలిసినా అసెంబ్లీలో సీఎం కేసీఆర్ నివాళులు అర్పించలేదన్నారు.
గద్దర్ అంత్యక్రియలను సైతం ప్రభుత్వ లాంఛనాలతో ఇష్టంతో చేయలేదనీ.. ప్రజలకు భయపడి చేశారన్నారు. బీఆర్‌ఎస్ పా ర్టీకి పిండం పెట్టడం... కేసీఆర్‌కు రాజకీయ సమాధి కట్టడమే తన లక్ష్యమని... ఇదే తన శపథమని రేవంత్‌రెడ్డి తెలిపారు. కేటీఆర్‌కు ఫామ్‌హౌజ్‌తో, డ్రగ్స్‌తో, ఓ హీరోయిన్‌తో సంబంధం లేకుంటే తను మాట్లాడకుండా ఉండాలని కోరుతూ ఎందుకు హైకోర్టుకు ఎందుకు వెళ్లారో చెప్పాలని రేవంత్ నిలదీశారు.