కాంగ్రెస్‌లో 'బీసీ' కాక! | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో 'బీసీ' కాక!

Published Sat, Oct 14 2023 2:11 AM

PCC Chief Ponnala Lakshmaiah Resigns From Congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీకి బీసీల కాక మొదలైంది. బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ గత 45 ఏళ్లుగా కాంగ్రెస్‌లో పనిచేస్తున్న సీనియర్‌ నేత, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి నాలుగు దశాబ్దాలకు పైగా సేవ చేసిన తనకు చివరకు అవమానాలే మిగిలాయని, ఈ ఆవేదనతోనే తాను పార్టీని వీడుతున్నానంటూ ఆయన శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాసిన లేఖ పార్టీవర్గాల్లో సంచలనం సృష్టించింది. 

పార్టీకి విధేయుడిగా పేరొందిన పొన్నాల రాజీనామా చేయడం, బీసీ నేతలు ఏకంగా గాందీభవన్‌లోనే ధర్నా నిర్వహించాలని ప్రయత్నించడం, అధిష్టానం గట్టిగా హెచ్చరించడం, మరోవైపు ఇటీవల ఢిల్లీ వెళ్లిన సందర్భంగా బీసీ నేతలకు కాంగ్రెస్‌ పెద్దలు సరిగా అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వకపోవడం, బీసీ నేతలకు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కోత తప్పదనే సంకేతాలు వస్తుండడం లాంటి పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ పారీ్టలో బీసీ నేతలు కేంద్రంగా ఓరకంగా కలకలమే రేగుతోంది. బీసీలకు ఎన్ని టికెట్లు వస్తాయో తేలాక ఆ వర్గానికి చెందిన మరికొందరు పొన్నాల బాట పట్టవచ్చనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

బీసీలకు 34 స్థానాలకు తగ్గకుండా ఇవ్వాలంటూ..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 34కు తగ్గకుండా టికెట్లు తమకు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ ఇటీవల తెలంగాణకు చెందిన 30–40 మంది బీసీ నేతలు హస్తిన బాట పట్టారు. వీరిలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఇతరులు ఉన్నారు. అయితే వీరికి కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా దొరకలేదనే చర్చ గాందీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది. రాహుల్, సోనియాలను కలుస్తామని, అక్కడే బీసీల కోటా తేల్చుకుంటామని చెప్పిన బీసీ నేతలు ఢిల్లీ వెళ్లిన తర్వాత ఉసూరుమంటూ వెనక్కు రావాల్సి వచ్చింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కలుస్తారని చెప్పినా ఆయన కేవలం మధుయాష్కీకి మాత్రమే అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. మిగిలిన నేతలంతా ఏఐసీసీ కార్యాలయంలోనే వేచి ఉండాల్సి వచ్చింది. 

ఆ తర్వాత కొందరు నాయకులను ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్‌ కలిశారు. పార్టీ అధికారంలోకి రావడం మీకు ఇష్టం లేదా? అంటూ ఆయన ఎదురుదాడికి దిగడంతో వారంతా కంగు తినాల్సి వచి్చందని చెబుతున్నారు. దీనికి తోడు పార్టీ సర్వేల ఆధారంగా గెలిచే వారికి మాత్రమే టికెట్లు ఇస్తామని, మిగిలిన వారికి ఇవ్వలేమని చెప్పిన వేణుగోపాల్‌ కొందరిని వ్యక్తిగతంగా ప్రస్తావిస్తూ వారిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తామని వారి్నంగ్‌ కూడా ఇచి్చనట్లు సమాచారం. 

ఠాక్రే ఫోన్‌తో ధర్నా విరమణ? 
వాస్తవానికి బీసీలకు 34 అసెంబ్లీ స్థానాలకు తగ్గకుండా ఈసారి సీట్లు ఇస్తామని తెలంగాణ కాంగ్రెస్‌ నాయకత్వం చాలాసార్లు స్పష్టం చేసింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)లో తీసుకున్న ఈ నిర్ణయానికి అనుగుణంగా తమకు 34 కంటే ఎక్కువ సీట్లు ఇవ్వాలని గత రెండు నెలలుగా బీసీ నేతలు టీం బీసీ పేరుతో డిమాండ్‌ చేస్తున్నారు.

తాజాగా 20–25 స్థానాలు మాత్రమే బీసీలకు ఇస్తున్నారని తెలియడంతో శుక్రవారం గాంధీభవన్‌లో ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ అనూహ్యంగా వారు తమ నిరసన విరమించుకున్నారు. ఇందుకు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే నుంచి వచ్చే ఒకే ఒక్క ఫోన్‌కాల్‌ కారణమనే చర్చ గాందీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది. టికెట్ల ప్రకటన సమయంలో ఇలాంటి ఆందోళనలు చేయవద్దని, గెలిచే వారికే సీట్లిస్తామని, తమను కాదని ధర్నాలు చేస్తే పార్టీ నుంచి బయటకు పంపిస్తామని ఆయన హెచ్చరించడంతోనే టీం బీసీ నేతలు తమ ఆందోళనను విరమించుకున్నారని తెలుస్తోంది.  

పొత్తు కుదిరితే బీసీలకిచ్చే సీట్లేనా? 
వామపక్ష పార్టీలతో పొత్తు కుదిరితే చెరో రెండు సీట్లు చొప్పున సీపీఐ, సీపీఎంలకు కాంగ్రెస్‌ కేటాయిస్తుందనే చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, కొత్తగూడెం, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, మునుగోడు స్థానాలను ఆ పార్టీలకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇవి సాధారణంగా కాంగ్రెస్‌ బీసీలకిచ్చే అవకాశం ఉన్న, చాలామంది బీసీ నేతలు ఆశిస్తున్న స్థానాలనే వాదన విన్పిస్తోంది. 

బీసీలకు ఇచ్చే అవకాశమున్న సీట్లను పొత్తుల్లో వేరే పార్టీలకు ఇచ్చి, పొత్తుల కారణంగానే కొన్ని సీట్లు బీసీలకు ఇవ్వలేకపోయామని చెప్పేందుకే ఈ ఆలోచన చేస్తున్నారని బీసీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు సర్వేల పేరుతో బీసీ నేతలను దూరం చేసుకునేందుకు కూడా పార్టీ వెనుకాడడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే.. అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత చాలామంది బీసీ నేతలు పొన్నాల బాటలో పయనించవచ్చనే చర్చ గాందీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది.ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా

  • పార్టీలోకి కొత్తగా వచ్చిన వారు అన్యాయంగా అధికారం చేజిక్కించుకున్నారు 
  • నిఖార్‌సైన నేతలు ఉనికి కోసం పాకులాడాల్సి వస్తోంది 
  • బీసీలకు అగౌరవం మాత్రమే మిగిలింది 
  • ఇలాంటి వాతావరణంలో ఇమడలేననే నిర్ధారణకు వచ్చా: పొన్నాల 

‘అమెరికాలోని ప్రతిష్టాత్మక సంస్థతో కలిసి దశాబ్దం పాటు పనిచేసిన తర్వాత, కాంగ్రెస్‌ పార్టీతో కలిసి నాలుగు దశాబ్దాలకు పైగా పనిచేసిన నేను బాధాతప్త హృదయంతో ఈ లేఖను రాస్తున్నాను..’అని ఖర్గేకు రాసిన లేఖలో పొన్నాల తెలిపారు. ‘నేను కాంగ్రెస్‌ పార్టీలో పనిచేసేందుకు పీవీ నరసింహారావు స్ఫూర్తినిచ్చారు. పార్టీలో సాధారణ కార్యకర్త నుంచి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించాను. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, 12 ఏళ్ల పాటు మంత్రిగా నిబద్ధతతో సేవలందించాను. అయితే పార్టీలో తాజాగా జరుగుతున్న పరిణామాలు నాకు తీవ్ర బాధను కలిగించాయి. 

2015లో పీసీసీ అధ్యక్షుడిగా నన్ను అకారణంగా తొలగించారు. 2014 ఎన్నికల్లో పార్టీ ఓటమికి నేనే బాధ్యుడినని నిందించారు. పార్టీ మూల సిద్ధాంతంతో అనుబంధమున్న నాలాంటి నాయకుడికి పార్టీలో ఎన్నో అవమానాలు కలిగాయి. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారు అన్యాయంగా అధికారం చేజిక్కించుకున్నారు. నిఖార్‌సైన కాంగ్రెస్‌ నేతలు మాత్రం పార్టీలో ప్రాధాన్యం కోల్పోయి ఉనికి కోసం పాకులాడాల్సి వస్తోంది. ఈ విషయాలను పీసీసీ అధ్యక్షుడితో మాట్లాడేందుకు రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నాను. కానీ సాధ్యపడలేదు. సామాజిక న్యాయానికి కాలం చెల్లింది. కాంగ్రెస్‌ పార్టీకి ఆయువు పట్టు లాంటి సామాజిక న్యాయానికి ఇప్పుడు పార్టీలో కాలం చెల్లింది. సమాజంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు అగౌరవం మాత్రమే మిగిలింది.

పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ క్రమంలో వస్తున్న ఆరోపణలు పార్టీ అంకితభావాన్ని ప్రశ్నించే విధంగా ఉన్నాయి. ఇలాంటి అంశాలను చర్చించేందుకు నాలాంటి సీనియర్‌ నేత కూడా నెలల తరబడి నిరీక్షించాల్సి రావడం, ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌ను కలిసేందుకు పదిరోజులు వేచి ఉన్నా ఫలితం లేకపోవడం దురదృష్టకరం. 50 మంది బీసీ నేతలు ఢిల్లీకి వచ్చినా పెద్దలను కలిసేందుకు అనుమతి లభించలేదు. ఉదయ్‌పూర్, రాయ్‌పూర్‌ డిక్లరేషన్‌లు పార్టీలో అమలు కావడం లేదు. మరోవైపు బీఆర్‌ఎస్‌ ఎంపీ, ఎమ్మెల్సీ, ఇతర హోదాలను బీసీ నాయకులకు కల్పిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను పార్టీతో అనుబంధాన్ని కొనసాగించలేనని, ఇలాంటి వాతావరణంలో ఇమడలేననే నిర్ధారణకు వచ్చా. ఇన్నాళ్లూ నాకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు..’అని పొన్నాల తన లేఖలో పేర్కొన్నారు. 

ప్రస్తుతానికి కాంగ్రెస్‌కు రాజీనామా చేశా.. 
ఏఐసీసీకి లేఖను పంపిన తర్వాత హైదరాబాద్‌లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ పొన్నాల భావోద్వేగానికి గురయ్యారు. 1983 తర్వాత పార్టీ కేవలం మూడు సార్లు మాత్రమే అధికారంలోకి వచ్చిందని, ఉమ్మడి ఏపీలో అధికారం దక్కించుకున్నా తెలంగాణలో మాత్రం సగం సీట్లు పార్టీకి ఎప్పుడూ రాలేదని, ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు అవసరమైన విషయాలను పార్టీలో చర్చించాలన్నా వీలుపడలేదని చెప్పారు. చెప్పేది వినేవాళ్లు పార్టీలో లేరని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పొన్నాల కన్నీటి పర్యంతమయ్యారు. బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారా అని ప్రశ్నించగా, ప్రస్తుతానికి తాను కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా మాత్రమే చేశానని, ఇప్పుడే తన రాజకీయ భవిష్యత్తు గురించి చెప్పలేనని అన్నారు.  

ఒకరిద్దరు వెళ్లినా నష్టమేమీ లేదు: మురళీధరన్‌ 
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఒకరిద్దరు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ మురళీధరన్‌ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీలోకి చాలామంది వచ్చి చేరుతున్నట్లు చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. పొన్నాల పార్టీని వీడటంపై విలేకరులు ప్రశ్నించగా..దీనిపై స్పందించాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. అదే సమయంలో అభ్యర్థుల జాబితా ప్రకటించకుండానే పొన్నాల పార్టీని ఎలా విమర్శిస్తారని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement