
పాట్నా: బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణపై రాష్ట్ర ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.బీహార్ ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయి. ఏ సీట్లో ఏ పార్టీ గెలవాలో ఈసీ నిర్ణయిస్తోంది. అందుకే అసెంబ్లీ ఎన్నికల్ని బహిష్కరించే యోచనలో ఉన్నాం. ఇండియా కూటమితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు.
బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణపై తేజస్వీ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఎన్‌డీఏ ప్రభుత్వం తమకు అనుకూలంగా మలచుకుంటోంది. నిజమైన ఓటర్లను తొలగిస్తూ, తప్పుడు ఓటర్ల జాబితాలను రూపొందిస్తున్నారని అన్నారు. ఇంతకుముందు ఓటర్లు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఓటర్లను ఎంచుకుంటోంది’అని వ్యాఖ్యానించారు.
కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా ఈసీ పనిచేస్తోంది. ఎన్నికలు మోసపూరితంగా జరుగుతున్నాయని భావిస్తున్నామని.. అందుకే ఎన్నికలను బహిష్కరించే యోచనలో ఉన్నామన్నారు. అలయన్స్ పార్టీలతో చర్చించి, ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.