మహాయుతి కూటమి పార్టీలతో సుదీర్ఘ మంతనాలు
పార్టీ పగ్గాలూ ఆమెకే ఇవ్వాలని డిమాండ్
బారామతి నుంచి పోటీ చేయించాలని యోచన
ముంబై: భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) చీఫ్, దివంగత అజిత్ పవర్ భార్య సునేత్రకు తక్షణం మహారాష్ట్ర కేబినెట్‌లో ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని ఎన్‌సీపీ నేతలు డిమాండ్లు చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ సారథ్యంలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమి పార్టీలతో ఈ మేరకు ఎన్‌సీపీ ముఖ్యనేతలు సుదీర్ఘ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. పార్టీ పగ్గాలు సైతం సునేత్రకు అప్పగించాలని ఆ పార్టీ ముఖ్యలు భావిస్తున్నారు. అజిత్ పవార్ మరణంతో ఖాళీ అయిన బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సునేత్రను పోటీకి నిలబెట్టాలని పార్టీ నేతలు యోచిస్తున్నారు.
విలీనంపై మొదలైన గుసగుసలు
బాబాయితో విబేధించి ఎన్‌సీపీని చీల్చి వేరు కుంపటి పెట్టుకున్న అజిత్ పవార్ లేకపోవడంతో ఇకపై పవార్ సారథ్యంలోని పార్టీని శరద్‌పవార్ నేతృత్వంలోని పాత పార్టీతో విలీనంచేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. అజిత్ వర్గం నేతలు ఇందుకు మొగ్గుచూపుతున్నారు. ‘‘ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న సునేత్ర సారథ్యంలోనే ఇకపై పార్టీ ముందుక నడవాలని నేతలంతా భావిస్తున్నారు. ఆమెకు కేబినెట్ మంత్రి పదవి ఇవ్వాలి. వాస్తవానికి శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ(ఎస్పీ)తో మా పార్టీ ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో కలిసి పనిచేస్తోంది. ఇకమీదటా శాశ్వతంగా కలిసే ఉంటాయి’’ అని మహారాష్ట్ర ఆహార, ఔషధ నియంత్రణ శాఖ మంత్రి, ఎన్‌సీపీ సీనియర్ నేత నరహరి జిర్వాల్ అన్నారు.
‘‘పవార్‌ల కుటుంబాలు ఒక్కటవ్వాలి. ఎన్‌సీపీ(ఎస్పీ), ఎన్‌సీపీలు కలిసిపోవడమే ఉత్తమం’’అని ఎన్‌సీపీ సీనియర్ నేతలు నవాబ్ మాలిక్, ప్రమోద్ హిందూరావ్ అభిప్రాయపడ్డారు. అయితే సునేత్రకు పార్టీ పట్టంకట్టే అంశం ఇంత త్వరగా చర్చించాల్సిన అవసరం లేదని ఎన్‌సీపీ నేత, ఆహార, పౌరసరఫరాల మంత్రి ఛగన్ భుజ్‌బల్ వ్యాఖ్యానించారు. శరద్ పవార్ సమ్మతితోనే పార్టీల విలీనం సాధ్యమని ఎన్‌సీపీ(ఎప్పీ) నేత ఏక్‌నాథ్ ఖడ్సే అన్నారు.


