‘నా ముందు కూర్చోవడానికి ఆయనకు నామోషీ’ | Minister Konda Surekha Slams Kadiyam Srihari | Sakshi
Sakshi News home page

‘నా ముందు కూర్చోవడానికి ఆయనకు నామోషీ’

Jun 20 2025 6:29 PM | Updated on Jun 20 2025 7:08 PM

Minister Konda Surekha Slams Kadiyam Srihari

వరంగల్‌:  కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలపై కొండా మురళి వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీలో ఒకవైపు ప్రకంపనలు సృష్టిస్తుంటే, మంత్రి కొండా సురేఖ సైతం అదే తరహాలో మాట్లాడారు. కడియం శ్రీహరి నల్లికుట్ల మనిషని,  సీఎం రేవంత్‌ వద్దకు, పొంగులేటి వద్దకు వెళ్లా తన మీద ఉన్నది లేనిది చెబుతున్నారంటూ విమర్శలు చేశారు.  మీడియాతో చిట్‌చాట్‌లో భాగంగా కొండా సురేఖ మాట్లాడుతూ..  ‘నేను మంత్రిగా ఉంటే నా ముందు కూర్చోవడానికి నామోషీగా ఫీల్ అవుతున్నారు 

కడియం శ్రీహరి. అందుకే నా మంత్రి పదవి పోతుందంటూ తప్పుడు ప్రచారం చేపిస్తున్నాడు. సీఎం దగ్గరకు, పొంగులేటి వద్దకు వెళ్లి నా మీద ఉన్నది లేనిది చెబుతున్నాడు. తెలుగుదేశంలో నడిపించుకున్నట్లు  ఇక్కడ కూడా నడిపించాలని అనుకుంటున్నాడు. నా అదృష్టం ఉంది నేను మంత్రి అయ్యాను. ఆయనకు అదృష్టం ఉన్నప్పుడు ఆయన కూడా మంత్రి అయ్యాడు. నన్ను దిగిపోవాలని అనుకుంటే ఎలా?, నా కూతురికి అదృష్టం లేదు ఎమ్మెల్యే కాలేదు. కడియం కూతురికి అదృష్టం ఉంది ఎంపీ అయ్యింది. నేను ఆమె ఎంపీ పదవి తీయాలని అంటున్నానా?, అని కొండా సురేఖ ప్రశ్నించారు. 

భద్రకాళీ టెంపుల్‌ ఎవరి సొత్తు కాదు..
వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్‌రెడ్డికి సురేఖ కౌంటర్‌ ఇచ్చారు. కొందరు భద్రకాళీ టెంపుల్‌ తమ సొత్తు అనుకుంటున్నారని, అది ఎవరి సొత్తు కాదనే విషయం తెలుసుకోవాలన్నారు. రాజేందర్‌రెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడటం సరికాదు. ఆయన అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఆగమశాస్త్ర ప్రకారం భద్రకాళి అమ్మవారికి బోనం సమర్పించాలని నిర్ణయించుకున్నాం. అక్కడ యాటలు కోస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అమ్మవారు శాఖాహారీ అని అందరికీ తెలుసు. అక్కడ ఏళ్లుగా పనిచేస్తున్న పూజార్ల అభిప్రాయం తీసుకున్నాం. బల్కంపేట దేవాలయం నుంచి బోనం తీసుకువెళ్లి భద్రకాళి అమ్మవారికి సమర్పిస్తాం’ అని కొండా సురేఖ తెలిపారు. 

కేంద్రానికి వివక్ష తగదు
గోదావరి పుష్కరాల విషయంలో రెండు రాష్ట్రాలను కేంద్రం ఒకేలా సమానంగా చూడాలన్నారు కొండా సురేఖ. పుష్కరాలకు రూ. 200 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశామని, గోదావరి పుష్కరాలు ఏపీ కంటే తెలంగాణలోనే ఎక్కువగా జరుగుతాయన్నారు. భద్రాచలం రాముని పాదాల నుంచే గోదావరి ప్రవహిస్తుందని, ఇక్కడే గోదావరి పుష్కరాలు ఘనంగా జరుగుతాయన్నారు. తెలంగాణ వివక్ష వద్దు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ చొరవ చూపాలి.తెలంగాణకు పుష్కరాల కోసం నిధులు ఇప్పించాలి. లేదంటే వారు చేతకాని మంత్రులుగా మిగిలిపోతారు’ అని ఆమె స్పష్టం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement