మోదీ ఓటమే లక్ష్యం | Sakshi
Sakshi News home page

మోదీ ఓటమే లక్ష్యం

Published Fri, Jan 26 2024 5:17 AM

Mallikarjuna Kharge in a meeting of Congress booth level leaders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పదేళ్లుగా దేశ ప్రజలను మోసం చేస్తూ, ఏదో ఒక అంశాన్ని తీసుకొని ఎన్నికలకు వెళ్లి లబ్ధి పొందే ప్రధాని మోదీని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు పనిచేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తుంటే, మోదీ ఎన్నికల ముందు తన గ్యారంటీ పేరిట ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు. మోదీ ప్రధాని అయ్యాక దేశంలో ప్రజాస్వామ్యం సర్వనాశనం అయిందని, పార్లమెంటులో ప్రశ్నించిన 140 మంది ఎంపీలను సస్పెండ్‌ చేశారని ధ్వజమెత్తారు. గురువారం హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో తెలంగాణ కాంగ్రెస్‌ బూత్‌ స్థాయి నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఖర్గే ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.  

దేశంలోని ప్రతి ఇంట్లో దేవుడు ఉన్నాడు 
‘దేశంలో యువశక్తి నిరుద్యోగంతో సతమతమవుతోంది. రైతులు కనీస మద్దతు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కార్మీకులు, మహిళలు, అణగారిన వర్గాల ప్రజలు తీవ్ర కష్టాలను అనుభవిస్తోంటే.. మోదీ భగవంతుని పేరిట పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. యువతకు పని దొరికితే, ఉద్యోగాలు ఉంటే ఉపయోగం తప్ప భగవంతుని ఫొటోతో కడుపు నిండుతుందా? దేశంలోని ప్రతి ఇంట్లో దేవుడు ఉన్నాడు. కానీ మోదీ దేవుడు తమ దగ్గరే ఉన్నట్టు ప్రచారం చేసుకుంటారు.

ఆకలి అయినవాడికి అన్నం పెట్టాలి.. ఉపాధి లేని వారికి ఉద్యోగం ఇవ్వాలి..కానీ మోదీ ఎన్నికల రాజకీయాలు, ప్రచారంతోనే కాలం గడుపుతున్నారు. ప్రజల సొమ్ముతో ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. మొన్న అయోధ్యలో మోదీ ఒక్కరే గర్భ గుడిలో పూజలు చేశారు. చివరకు అద్వానీ, మనోహర్‌ జోషిలను కూడా రానివ్వలేదు. ఎన్నికలకు ముందు ఏదైనా సమస్యను సృష్టించి ఆ అంశాన్ని వాడుకొని లబ్ధి పొందడం మోదీకి అలవాటే. పాకిస్తాన్, చైనా, భగవంతుడు..ఇలా ఏదో ఒక అంశాన్ని తెరపైకి తెస్తారు..’అని ఖర్గే విమర్శించారు. 

మనకు మోదీతోనే యుద్ధం: రేవంత్‌రెడ్డి 
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీని పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలిపించాలని ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్లలో 14 గెలిచి, రాహుల్‌గాం«దీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. మనకు మోదీతోనే యుద్ధం అని, గల్లీలో ఉన్న బిల్లా, రంగాలతో కాదని ఎద్దేవా చేశారు. జనాలు బీఆర్‌ఎస్‌ను ఊరికే ఓడగొట్టలేదని, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టే ఇంటికి పంపారని అన్నారు.

ప్రభుత్వం ఏర్పడ్డ వంద రోజుల లోపు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేసిన తాము ఫిబ్రవరిలో మరో రెండు గ్యారంటీలు అమలు చేయనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు రైతుభరోసా ద్వారా నగదు బదిలీ జరుగుతుందని చెప్పారు. ‘నన్ను మేస్త్రీ అని ట్రోల్‌ చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి నిజంగానే మేస్త్రీనే.. మీరు విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని సరిచేసే మేస్త్రీని నేను. మీకు 100 మీటర్ల లోతులో ఘోరీ కట్టే మేస్త్రీని..’అని అన్నారు.  

పులిని రమ్మనండి..బోను రెడీగా ఉంది 
ఈ నెలాఖరులో ఇంద్రవెల్లి నుంచి తన లోక్‌సభ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని రేవంత్‌రెడ్డి చెప్పారు. వారంలో మూడు రోజులు కాంగ్రెస్‌ పార్టీ పటిష్టానికి జిల్లాల్లో పర్యటిస్తానని తెలిపారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి బిల్లా, రంగాలను తెలంగాణ సరిహద్దులను దాటిస్తాం. వాళ్లు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నారు. చార్లెస్‌ శోభరాజ్‌ ఇంట్లో దుప్పటి పట్టుకుని పడుకున్నాడు. పులి బయటికి వస్తుంది అంటున్నారు కదా.. రమ్మని చెప్పండి. బోను పట్టుకుని రెడీగా ఉన్నాం’అని వ్యాఖ్యానించారు. మోదీ, కేడీ రెండూ ఒక్కటేనని, నాణేనికి మోదీ ఒకవైపు, కేసీఆర్‌ మరోవైపు అని ధ్వజమెత్తారు. ఇక్కడ గెలిచిన ఒకటో రెండో సీట్లు కూడా కేసీఆర్‌ మోదీకి తాకట్టు పెడతారని వ్యాఖ్యానించారు.  

ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలి: దీపాదాస్‌ మున్షీ 
రాహుల్‌గాం«దీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా బూత్‌ లెవల్‌ నాయకులు పని చేయాలని పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ పిలుపునిచ్చారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటైన విధంగా ఢిల్లీలో కూడా కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ తీసుకోవాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో బూత్‌ స్థాయిలో అధిక ఓట్లు తీసుకొచ్చిన ఏజెంట్లకు ఈ సందర్భంగా ప్రశంసాపత్రాలు అందజేశారు. 

చేతగానితనంగా భావిస్తే తడాఖా చూపిస్తాం: భట్టి 
రాష్ట్రంలో ప్రతిపక్ష పారీ్టలను ప్రజాస్వామ్యయుతంగా గౌరవించాలనే ఆలోచనతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు వెళ్లడాన్ని చేతగానితనంగా భావిస్తే తడాఖా చూపిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హెచ్చరించారు. ప్రజాతీర్పును జీర్ణించుకోలేక బీఆర్‌ఎస్‌ నేతలు నోటికి వచ్చినట్టు అవాకులు, చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. బట్టలు ఊడదీసి కొడతామంటే ఎవరూ చేతులు ముడుచుకొని లేరని, కాంగ్రెస్‌ కార్యకర్తలు కన్నెర్ర చేస్తే రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ మిగలదని అన్నారు. 

బట్టలు విప్పి చూపించేందుకు సిద్ధం: మంత్రి పొన్నం 
కరీంనగర్‌ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎమ్మెల్యేలుగా గెలిస్తే ఓర్వలేకనే మాజీ మంత్రి కేటీఆర్‌ బట్టలు ఊడదీస్తానని అంటున్నాడని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. బట్టలు విప్పడం ఎందుకు, ఆయనకు చూడాలనిపిస్తే తనతో పాటు కవ్వంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం బట్టలు ఇప్పి చూపించేందుకు సిద్ధమని అన్నారు. కల్వకుంట్ల కుటుంబం దోచుకొని, దాచుకున్న సొమ్ము కక్కాల్సిందేనని మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ అన్నారు. అధికారుల దగ్గరే అన్ని కోట్ల రూపాయలు దొరికితే, వారిపై పెత్తనం చేసిన కల్వకుంట్ల ఫ్యామిలీ ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తే మరెన్ని వేల కోట్లు బయటపడతాయో అని వ్యాఖ్యానించారు.  

మోదీ, అమిత్‌ షాలతో అప్రమత్తంగా ఉండాలి 
‘ఎక్కడ బలహీనంగా ఉంటే అక్కడి ప్రభుత్వాలను మోదీ, అమిత్‌ షాలు పడగొడతారు. కానీ తెలంగాణ లో గతంలో ఉన్న కాంగ్రెస్‌ లేదు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో చాలా పటిష్ట మైన కాంగ్రెస్‌ ఉంది. ఎన్నికల్లో బీజే పీ, బీఆర్‌ఎస్‌ రెండింటినీ కాంగ్రెస్‌ ఓడించింది. దీన్నిబట్టి ఇక్కడ కాంగ్రెస్‌ ఎంత బలంగా ఉందో అర్ధం చేసుకోవాలి. తెలంగాణలో వచ్చిన ఫలితాలే లోక్‌సభ ఎన్నికల్లోనూ రావాలి. తెలంగాణలో ప్రభుత్వ, రేవంత్‌రెడ్డి పనితీరు ఆదర్శంగా ఉంది. అయితే బీజేపీ భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. కానీ బీజేపీకి తెలంగాణలో ఎవరూ భయపడరు. మోదీ, షాలు ఈడీ, సీబీఐ, ఐటీలను ప్రయోగించే ప్రమాదం ఉంది. రేవంత్‌తో పాటు కాంగ్రెస్‌ నేతలంతా చాలా అప్రమత్తంగా ఉండాలి..’అని ఖర్గే అన్నారు.  

Advertisement
 
Advertisement